Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి-sudden hair loss but these could be the reasons check once ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Haritha Chappa HT Telugu
May 17, 2024 01:17 PM IST

Hair Fall Causes: కొంతమందికి జుట్టు హఠాత్తుగా ఊడిపోతూ ఉంటుంది. కొన్ని నెలల్లోనే సగానికి పైగా జుట్టు రాలిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది.

జుట్టు రాలిపోవడానికి కారణాలు
జుట్టు రాలిపోవడానికి కారణాలు (Pixabay)

Hair Fall Causes: జుట్టు అందానికి చిహ్నమే కాదు, అది ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. కొంతమందికి కొన్ని నెలల్లోనే జుట్టు పల్చబడిపోతుంది. రెండు నెలల క్రితం ఒత్తుగా ఉన్న జుట్టు రెండు నెలలలోపే రాలి సన్నగా మారిపోతుంది. ఇలా అకస్మాత్తుగా ఎక్కువ జుట్టు రాలిపోవడానికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల వైద్య పరిస్థితులు జుట్టుకు నష్టాన్ని కలిగిస్తాయి, జుట్టు రాలిపోవడానికి కారణం అవుతాయి. అవి ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

థైరాయిడ్ అసమతుల్యత

థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో జుట్టు ఒత్తుగా పెరగదు. థైరాయిడ్ అతి చురుకుగా పనిచేస్తున్నా లేదా చురుకుగా పని చేయకపోయినా కూడా అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. థైరాయిడ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. థైరాయిడ్ హార్మోన్లు జుట్టు పెరుగుదలతో పాటు శారీరక ప్రక్రియలను నియంత్రిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడిందో అది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. హార్మోన్లను సమతుల్యం చేసుకోవడం ద్వారా తిరిగి జుట్టును పెంచుకోవచ్చు.

ఒత్తిడి

మానసిక ఒత్తిడి కంటికి కనిపించని నష్టాలను కలుగజేస్తుంది. మనసుకు తగిలిన గాయం ఒత్తిడికి కారణం అవుతుంది. ఈ శారీరక ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. వెంట్రుకలు రాలిపోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అలాగే శస్త్ర చికిత్సలు జరిగినా, కాలిన గాయాలు ఉన్నా జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. ఒత్తిడి వల్ల మీ జుట్టులో 50 నుండి 75% వరకు వెంట్రుకలు రాలిపోవచ్చు. పరిస్థితి మెరుగ్గా అయ్యాక జుట్టు పెరగడం మొదలవుతుంది.

వారసత్వంగా...

కొందరికి వారసత్వంగా కూడా బట్టతల, పలుచటి జుట్టు వస్తుంది. జన్యుపరమైన కారణాలను ఆపడం ఎవరి తరం కాదు. బట్టతల ఉన్నా, ఆండ్రోజనిక్ అలోపేసియా అనే రుగ్మతలు ఉన్నా కూడా అవి వారసత్వంగా వస్తాయి. వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వచ్చేస్తుంది.

పోషకాహార లోపం

తినే ఆహారంలో పోషకాలు లోపించినా వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం అధికంగా ఉంది. జుట్టుకు ఐరన్, జింక్, బయోటిన్, ప్రోటీన్ పుష్కలంగా కావాలి. వీటిలో ఏది లోపించినా జుట్టు రాలిపోవచ్చు. కాబట్టి జుట్టు రాలిపోతూ ఉంటే పోషకాహారం తినడానికి ప్రయత్నించండి.

కొన్ని రకాల మందులు చికిత్సలు

క్యాన్సర్, డిప్రెషన్, గుండె సమస్యలు, ఆర్థరైటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు మందులు వాడుతున్నా కూడా జుట్టు రాలిపోయే సమస్య అధికంగా ఉంటుంది. రేడియేషన్ కు గురైనా కూడా తల నుంచి వెంట్రుకల విపరీతంగా రాలిపోతాయి. కాబట్టి మీకు జుట్టు రాలిపోవడానికి కారణం ఏంటో మీరే తెలుసుకోండి.

Whats_app_banner