Chicken Pakodi Recipe: కరకరలాడే చికెన్ పకోడి మన ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోండిలా!-street food style chicken pakodi recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Pakodi Recipe: కరకరలాడే చికెన్ పకోడి మన ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోండిలా!

Chicken Pakodi Recipe: కరకరలాడే చికెన్ పకోడి మన ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోండిలా!

Galeti Rajendra HT Telugu
Oct 27, 2024 11:30 AM IST

ఆదివారం వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులు కొత్త రకమైన వంటలు టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారికి స్ట్రీట్ ఫుడ్ స్టయిల్‌లో చికెన్ పకోడిని ఇంట్లోనే సింపుల్‌గా ఈరోజు తయారు చేసి వడ్డించండి.

చికెన్ పకోడి
చికెన్ పకోడి

నాన్‌వెజ్ ప్రియులు బిరియానీతో పాటు బాగా ఇష్టంగా తినేది చికెన్ పకోడి. చాలా మంది ఇంట్లో కంటే బయట స్ట్రీట్‌లో చేసే చికెన్ పకోడిని ఇష్టంగా తింటూ ఉంటారు. దానికి కారణంగా టేస్ట్. అయితే.. సింపుల్‌గా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్‌లోనే చికెన్ పకోడి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

చికెన్ పకోడికి కావాల్సిన పదార్థాలు

  • చికెన్: 250 గ్రాములు (బోన్ లేదా బోన్ లెస్ చిన్న ముక్కులుగా)
  • శనగ పిండి: 1 కప్పు
  • బియ్యపు పిండి: 1 కప్పు 
  • కార్న్ ఫ్లోర్: 2 టీ స్పూన్స్
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీ స్పూన్
  • కారం పొడి: 1 టీ స్పూన్
  • ధనియా పొడి: 1 టీ స్పూన్
  • జీలకర్ర పొడి: 1/2 టీ స్పూన్
  • గరం మసాలా: 1/2 టీ స్పూన్
  • పసుపు: చిటికెడు
  • ఉప్పు: రుచికి తగినంత
  • నిమ్మరసం: 1 టీ స్పూన్
  • కరివేపాకు: తగినంత
  • నూనె: వేయించడానికి సరిపడా

 

చికెన్ పకోడి తయారీ విధానం:

 

  • ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి
  • ఆ తర్వాత చికెన్ ముక్కలపై శనగ పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి.
  • పదార్థాలు బాగా మిక్స్ అయిన ఆ మిశ్రమానికి నిమ్మరసం వేసి కలిపితే మెత్తగా మారుతుంది. ఒకవేళ నిమ్మరసం తర్వాత కూడా మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలియతిప్పాలి.
  • చికెన్ ముక్కలకి ఆ మిశ్రమం బాగా కలిసిన తర్వాత కనీసం 15-20 నిమిషాలు అలానే పక్కన పెట్టేయాలి.
  • ఆ తర్వాత స్టౌ వెలిగించి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి
  • నూనె బాగా వేడి అయిన తర్వాత చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డ్ రంగులోకి మారే వరకు వేయించాలి.
  • ఆ తర్వాత ఆఖరిగా కొంచెం కరివేపాకు వేసి వాటికి కూడా కారం పట్టేవరకు వేయించి చికెన్ ముక్కలతో కలిపి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఆ వేడి వేడి చికెన్ పకోడి ముక్కలపై మళ్లీ నిమ్మరసం పిండి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే ఆ మజానే వేరు. ఇంకెందుకు ఆలస్యం ఈరోజే కరకరలాడే చికెన్ పకోడిని మీ ఇంట్లో ట్రై చేయండి

Whats_app_banner