Nadendla Manohar: రైతు బజార్లలో నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు, ఎక్కడా కనిపించని సబ్సిడీ ఉల్లి, టమాటా, వంట నూనెలు-minister nadendla inspection in raithu bazars subsidized onions tomatoes cooking oils nowhere to be found ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nadendla Manohar: రైతు బజార్లలో నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు, ఎక్కడా కనిపించని సబ్సిడీ ఉల్లి, టమాటా, వంట నూనెలు

Nadendla Manohar: రైతు బజార్లలో నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు, ఎక్కడా కనిపించని సబ్సిడీ ఉల్లి, టమాటా, వంట నూనెలు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 18, 2024 06:50 AM IST

Nadendla Manohar: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎక్కడా ఫలితాన్ని ఇవ్వడం లేదు. సబ్సిడీ ధరలకు ఉల్లిపాయలు, టామాటాలు, వంట నూనెల్ని అందించాలని నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో ఆ ధరలతో ఎక్కడా అమ్మకాలు జరగక పోవడం మంత్రి తనిఖీల్లో బయటపడింది.

రైతు బజార్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న నాదెండ్ల మనోహర్
రైతు బజార్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన లేదని మంత్రి తనిఖీల్లోనే స్పష్టమైంది. ఏపీలో నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచిప్రజలకు ఉపశమనం కలిగించడానికి సబ్సిడీ ధరలతో విక్రయించాలని నిర్ణయించినా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు. రైతు బజార్లు మొదలుకుని సూపర్ బజార్ల వరకు ఎక్కడా సబ్సిడీ ఉత్పత్తుల జాడ కనిపించడం లేదు.

ప్రజలకు విక్రయించే సరుకులు నాణ్యత, ధరలపై విజయవాడలో పడమట రైతుబజార్ , గురునానక్ కాలనీలో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ధరల స్థిరీకరణ విషయంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రైతు బజార్లు, రిటైల్ మార్ట్‌లు, దుకాణాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బహిరంగ మార్కెట్‌లలో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో భాగంగా అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమాటాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం గత వారం పదిరోజులుగా ప్రకటనలు ఇస్తోంది. క్షేత్ర స్థాయిలో సబ్సిడీ ధరలకు విక్రయాలు పెద్దగా జరగడం లేదు. మార్కెటింగ్‌ శాఖ నుంచి అరకొరగా వచ్చే ఉత్పత్తులు రోజూ కొంతమందికి మాత్రం విక్రయిస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో మంత్రి చర్యలు చేపట్టారు.

విజయవాడ పడమట రైతు బజార్‌, గురు నానక్ కాలనీలోని ఉషోదయ సూపర్ మార్కెట్ ను గురువారం మంత్రి నాదెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్‌ కౌంటర్‌ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు, వంటనూనె చౌక ధరలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

రైతు బజార్లో సరుకులలో వ్యత్యాసంపై ఎస్టేట్‌ ఆఫీసర్‌ను నిలదీశారు. రైతు బజారులో బియ్యం, కందిపప్పు పంపిణీకి ఏర్పాటు చేసిన కౌంటర్ల నిర్వహణకు సమయపాలన పాటించకపోవడాన్ని గుర్తించి షాపుల నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. గురు నానక్ కాలనీ ఉషోదయ సూపర్ మార్కెట్ సరుకుల ధరలు పరిశీలించినప్పుడు.. కందిపప్పు ధర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అమ్మకాలు లేకపోవడానికి మంత్రి సూపర్ మార్కెట్ నిర్వాహకులను నిలదీశారు.అధిక ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వినియోగదారులకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు, వంటనూనె రైతు బజార్లు, హోల్‌ సేల్‌, రిటైల్‌ దుకాణాలలో అందుబాటులో ఉంచినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.

పామాయిల్ లీటర్ 110 రూపాయలకు , సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ను లీటర్124 రూపాయలకు , కిలో 67 రూపాయలకే కందిపప్పు, వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు.ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయని వ్యాపారులు..

ధరలు నియంత్రణలో భాగంగా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు జరపాలని మంత్రులు, అధికారులు పదేపదే చెబుతున్నా వ్యాపారులు మాత్రం ఆ ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వ ధరలకు విక్రయాలు గిట్టుబాటు కావడం లేదంటూ రైతు బజార్లలో సైతం అదనపు ధరలు వసూలు చేస్తున్నారు.

Whats_app_banner