Spinach Sambar: పోషకాల పాలకూర సాంబార్, సాధారణ సాంబార్‌తో పోలిస్తే ఆరోగ్యానికి రెండింతలు మేలు చేసే రెసిపీ-spinach sambar recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spinach Sambar: పోషకాల పాలకూర సాంబార్, సాధారణ సాంబార్‌తో పోలిస్తే ఆరోగ్యానికి రెండింతలు మేలు చేసే రెసిపీ

Spinach Sambar: పోషకాల పాలకూర సాంబార్, సాధారణ సాంబార్‌తో పోలిస్తే ఆరోగ్యానికి రెండింతలు మేలు చేసే రెసిపీ

Haritha Chappa HT Telugu
Jun 19, 2024 11:38 AM IST

Spinach Sambar: సాంబార్‌ను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి పోషకాల నిండిన పాలకూర సాంబార్ ప్రయత్నించండి. ఇది ఎంతో ఆరోగ్యకరం.

పాలకూర సాంబార్
పాలకూర సాంబార్ (Vismai food/Youtube)

Spinach Sambar: సాంబార్ అంటే కొన్నిరకాల కూరగాయలు వేసి చేసే ఒకే రకమైన రెసిపీ కాదు, దీన్ని రకరకాలుగా ప్రయత్నించవచ్చు. ఇక్కడ మేము పాలకూర సాంబార్ రెసిపీ ఇచ్చాము. దీనిలో ఇతర కూరగాయలు వేయాల్సిన అవసరం లేదు. పాలకూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఈ పాలకూర సాంబార్ సాధారణ సాంబార్ కన్నా రెండింతల పోషకాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే దీనిలో పాలకూర అధికంగా వేస్తాము. పాలకూరలో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వారానికి ఒకసారి ఇలా పాలకూర సాంబార్ ప్రయత్నించి చూడండి. మీకు నచ్చడం ఖాయం. ముఖ్యంగా పిల్లలకు దీన్ని కచ్చితంగా పెట్టాలి.

పాలకూర సాంబార్ రెసిపీకి కావలసిన పదార్థాలు

కందిపప్పు - అరకప్పు

పాలకూర - మూడు కట్టలు

ఉల్లిపాయలు - రెండు

చింతపండు - నిమ్మకాయ సైజులో

సాంబార్ పొడి - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఎండుమిర్చి - మూడు

ఇంగువ - చిటికెడు

ఆవాలు - అర స్పూను

మెంతులు - అర స్పూను

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడినన్నీ

నూనె - తగినంత

పాలకూర సాంబార్ రెసిపీ

1. పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కందిపప్పును వేసి మంచి వాసన వచ్చేదాకా వేయించాలి.

3. మూడు నిమిషాలు వేయిస్తే చాలు, తర్వాత ఆ కందిపప్పును కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.

4. స్టవ్ మీద సాంబార్ వండే పాత్రను పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.

6. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.

7. ఉప్పు, పసుపు కూడా అందులోనే వేసి వేయించాలి.

8. ఇప్పుడు పాలకూర తరుగును ఆ మిశ్రమంలో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.

8. పాలకూరలోనే నీరు దిగి అది దగ్గరగా ఇగురులాగా అవుతుంది.

9. ఆ సమయంలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి.

10. ఆ తర్వాత అర లీటర్ నీళ్లు పోసి మరగనివ్వాలి.

11. ఆ తరువాత సాంబార్ పొడి వేసుకుని చిన్న మంట మీద మరిగించాలి.

12. అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి బాగా కలపాలి.

13. పైన కొత్తిమీరను చల్లుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.

14. ఆ నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులు, ఇంగువ పొడి వేసి వేయించి సాంబార్లో వేసి స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ పాలకూర సాంబార్ రెడీ అయినట్టే.

పాలకూరను తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ పాలకూర సాంబార్లో విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. పాలకూరతో చేసిన వంటకాలు తరచూ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో పాలకూర ముందుంటుంది. మహిళలు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పాలకూర ఒకటి. ఇది ఒవేరియన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్. పాలకూర తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. కాబట్టి పాలకూర ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.

Whats_app_banner