Healthy Homemade Chips | రుచికరమైన, ఆరోగ్యకరమైన కరకరలాడే చిప్స్.. ఇంట్లోనే చేసుకోండి ఇలా!
Healthy Homemade Chips: నూనెలో వేయించిన అప్పడాలు, పాపడాలు తినే బదులు ఇలా ఆరోగ్యకరమైన రీతిలో చిప్స్ చేసుకొని తింటే మంచిది. న్యూట్రిషనిస్టుల రెసిపీలు చూడండి.
లంచ్‌లో అయినా, డిన్నర్‌లో అయినా అన్నం, పప్పు, కూర, అవకాయతో పాటు అప్పడం ఉంటే మనం తృప్తిగా తింటాం. ముఖ్యంగా అప్పడం లేకుండా తెలుగు వారి భోజనం పూర్తికాదు. అయితే అప్పడాలకు ప్రత్యామ్నాయంగా వడియాలు, ముర్కులు, చిప్స్ వంటి కరకరలాడేవి ఏవి ఉన్నా అడ్జస్ట్ అవుతారు. భోజనం చేసేటపుడు మాత్రమే కాకుండా, టీ-టైమ్ స్నాక్స్ లాగా కూడా ఇవి ఎప్పుడైనా నోటిలో కరకరలాడుతుంటే గమ్మత్తుగా ఉంటాయి.
ఏది ఏమైనప్పటికీ, కరకరలాడేలా చేయాలంటే వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. ఇలా నూనెలో వేయించినవి తినడం వలన ఊబకాయం, అధిక బరువు సహా అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. అయితే బెంగుళూరులోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ సుస్మిత, మీకు మంచింగ్ కోసం కొన్ని ఆరోగ్యకరమైన చిప్స్ రెసిపీలు అందించారు. వీటిని బేక్ చేయడం లేదా కాల్చటం ద్వారా రుచికరంగా, కరకరలాడేలా చేయవచ్చు. నూనె ఉపయోగించడం లేదు కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచివి. మరి ఆ క్రిస్పీ రెసిపీలను మీరూ ఇక్కడ తెలుసుకోండి.
Crispy Zucchini Recipe - క్రిస్పీ జుకిని రెసిపీ
జుకిని ఒక రకమైన గుమ్మడికాయ. ఇందులో పొటాషియం, ఫోలేట్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి, కేలరీలు, కొవ్వు ,చక్కెర తక్కువగా ఉంటాయి
- ముందుగా ఓవెన్‌ను 250 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడి చేయండి
- జుకిని లేదా గుమ్మడికాయను సన్నని ముక్కలుగా చేసి ఒక శుభ్రమైన గుడ్డలో ఆరబెట్టండి.
- ఆ తర్వాత ఒక మిక్సింగ్ గిన్నెలో, జుకిని ముక్కలు, ఉప్పు, మిరియాలు/ నచ్చిన మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి.
- బేకింగ్ ట్రేలో మ్యారినేట్ చేసిన ముక్కలను సమానంగా ఉంచండి.
- 250 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద 1.5 గంటలు కాల్చండి.
- 350 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ప్రతి వైపు 10 నిమిషాలు లేదా అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఎయిర్ ఫ్రై చేయండి.
Sweet Potato Crisps Recipe- స్వీట్ పొటాటో క్రిస్ప్స్ రెసిపీ
మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో చిలగడదుంప సహాయపడుతుంది. వీటితో ఇలా చిప్స్ చేయండి.
- ముందుగా ఓవెన్‌ను 120 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసి ఉంచండి.
- వాటిని మందపాటి ముక్కలుగా కట్ చేయండి.
- మిక్సింగ్ గిన్నెలో, కట్ చేసిన చిలఫడదుంపలు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఉప్పును కలపండి.
- ఆపై వాటిని బేకింగ్ ట్రేలో ఉంచి 150 డిగ్రీల సెల్సియస్ వద్ద 1 గంట 20 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు కాల్చండి. మధ్యలో తిప్పండి.
- 200 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాలు లేదా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఎయిర్ ఫ్రై చేయండి.
Carrot Ribbons Recipe- క్యారెట్ రిబ్బన్లు రెసిపీ
బరువు తగ్గడానికి క్యారెట్లు మంచి ఆహారం, క్యారెట్‌లలో బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ K1, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్యారెట్ రిబ్బన్‌లను ఎలా తయారు చేయవచ్చో చూడండి
- ముందుగా ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసి ఉంచండి.
- వెజిటబుల్ పీలర్ ఉపయోగించి, క్యారెట్‌లను పొడవుగా, సన్నగా కట్ చేయండి.
- మిక్సింగ్ గిన్నెలో, క్యారెట్ రిబ్బన్లు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, ఉప్పును కలపండి.
- ఆపై బేకింగ్ ట్రేలో సమానంగా ఉంచండి. 200 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 నిమిషాలు లేదా స్ఫుటంగా మారే వరకు కాల్చండి.
- 200 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాలు లేదా అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఎయిర్ ఫ్రై చేయండి.
ఈ రుచికరమైన చిప్స్ గ్లూటెన్ రహితమైనవి, ఆరోగ్యకరమైనవి. వీటిని గాలి చొరబడని కంటైనర్‌లలో నిల్వ చేసి ఎప్పుడైనా తినవచ్చు. మీకు ఆరోగ్యం అవసరం లేదు, రుచి మాత్రమే కావాలనుకుంటే వీటిని బేక్ చేయడానికి బదులుగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
సంబంధిత కథనం