Saturday Motivation | నువ్వు ఖాళీగా ఉన్నంత మాత్రానా నీ జీవితం ఖాళీ అయిపోయినట్లు కాదు!
Saturday Motivation: గొప్ప విషయాలకు సమయం పడుతుంది. కొన్నిసార్లు ఖాళీగా ఉండటం కూడా మంచిదే. ఈ స్ఫూర్థిదాయకమైన కథ చదవండి.
Saturday Motivation: అందరి జీవితం ఒకేలా ఉండదు. కొందరికి జీవితంలో అన్నీ ఈజీగా లభిస్తాయి, మరికొందరికి ఏదీ సులభంగా లభించదు. అనుకున్న లక్ష్యం సాధించాలనే నీ దృఢ సంకల్పంలో చాలా రోజులు నువ్వు ఏ పని పాటా లేకుండా ఖాళీగా ఉండాల్సి రావచ్చు. నీ తోటి వారే నువు వేస్ట్, ఎందుకు పనికి రావు ఆనొచ్చు, ఇప్పటికైనా ఏదైనా ఉద్యోగం చూసుకో అని సలహాలు ఇవ్వవచ్చు. కానీ, నువ్వు ఖాళీగా ఉన్నంత మాత్రానా నీ జీవితం ఖాళీ అయిపోయినట్లు కాదు. గొప్ప గొప్ప విషయాలకు సమయం పడుతుంది. కొన్నిసార్లు ఖాళీగా ఉండటం కూడా మంచిదే. ఈ సమయంలో నిన్ను నువ్వు అర్థం చేసుకోవటానికి సమయం దొరుకుతుంది, ప్రపంచాన్ని నీదైన కోణంలో చూసే సామర్థ్యం లభిస్తుంది. జీవితం అంటే ఏమిటో నీకంటే బాగా ఎవరికీ తెలియకపోవచ్చు.
ఈరోజు నువ్వు ఏ పని లేకుండా ఉండొచ్చేమో, కానీ నీదైన సమయంలో నువ్వే ఎంతో మందికి పని కల్పించే వెలుగువు కావొచ్చు. ఈరోజు నీకు ఉచిత సలహాలు ఇచ్చిన వారే రేపటి నీ ఎదుగుదలను చూసి వినమ్రంగా దండాలు పెట్టవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకిరి చేసే వారివి దీనగాథలే కానీ, విజయగాథలు కావు. విజేతగా నిలవాలంటే ఇష్టంగా పనిచేయాలి, ఇష్టమైన పనిచేయాలి, ఇష్టమైన దానిలో కష్టపడాలి.
ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం.. ఓ యువకుడు చాలా గొప్పగా జీవించాలని, గొప్పవాడిగా ఉండాలని కలలు కంటాడు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగంలో చేరతాడు. కొన్నినాళ్లు పనిచేసినా అతడికి ఆ జీవితం ఏమాత్రం సంతృప్తిగా అనిపించదు. చివరకు ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితం అవుతాడు. అది చూసి అతణ్ణి ఛీదరించుకోని వారు లేరు. అయినప్పటికీ అన్నింటిని భరిస్తూ ఇంట్లోనే ఉంటాడు. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటాడు, కానీ విభిన్న ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడంలో ఖాళీగా ఉండడు. ఏదో సాధించాలనే తపన అతనిలో నిరంతరం ఉండేది.
కొన్నాళ్లకు కరోనా వంటి మహమ్మారి సోకి లాక్డౌన్ పడింది, ఉద్యోగాలు పోయాయి. అతణ్ణి ఖాళీగా ఉండమని చెప్పిన వారు కూడా ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండసాగారు. ఇలా కొంతకాలం గడిచాకా ఆ యువకుడికి ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది. ఐడియా అతనది, పెట్టుబడి మరొకరిది. ఆన్ లైన్ లో పాఠాలు చెప్పే స్టార్టప్ అది. లాక్డౌన్ లో ఉండటం మూలానా అందరూ ఇళ్లకే పరిమితం అవడం వల్లనో, ఏమో అనతికాలంలోనే వాళ్ల ఎడ్యుకేషన్ స్టార్టప్ పాపులర్ అయింది. వ్యాపారం చాలా లాభసాటిగా మారింది. ఒక్కసారిగా ఖాళీగా ఉన్న ఆ యువకుడు పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారతాడు. ఖాళీగా ఎందుకు ఉంటున్నావు అని సలహాలు ఇచ్చిన వారు కూడా ఉద్యోగం కోల్ఫోయి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలంటూ అతణ్ని అభ్యర్థించారు.
దీనిని బట్టి మనం గ్రహించాల్సిన నీతి ఏమి? ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉంటుందో చెప్పలేం. ఎవర్నీ తక్కువగా అంచనా వేయవద్దు. సమయం మారినపుడు ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి.
సంబంధిత కథనం
టాపిక్