Thursday Motivation । జీవితంలో జరిగే ప్రతీది మన మంచికే.. ఓపిక పట్టండి!
Thursday Motivation: జీవితంలో ఏది జరిగినా అంతా మంచికే అని ముందుకు సాగాలి. ఎందుకో ఈ కథ చదివితే మీకే తెలుస్తుంది.
Thursday Motivation: జీవితం కొన్నిసార్లు మనం అనుకున్నట్లు సాగదు. మనకు అన్ని అర్హతలు ఉన్నా, మనం కోరుకున్నవి మనకు దక్కకపోవచ్చు. మీకంటే ఏ అర్హత లేని వారికి కూడా దక్కవచ్చు. దీనికి కారణం అంటూ ఏదీ ఉండదు, ఒక్కోసారి కాలం అలా గడుస్తుంది. అయితే మనకు జీవితంలో ఏదైనా విషయంలో దెబ్బతగిలితే కుంగిపోకూడదు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఒక్కోసారి కాలం చాలా పరీక్షలు పెడుతుంది. అది మనల్ని జీవితంలో ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కష్టకాలంలో మనకు కావాల్సింది ఓపిక, భవిష్యత్తుపై ఆశ. కాలం మనల్ని ఎంతైనా పరీక్షించనీ.. అలవాటు పడాలి, తట్టుకొని ధైర్యంగా నిలబడాలి. కారుమబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదు, చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, ఎండిపోయి రాలిన ఆకులు మళ్లీ చిగురిస్తాయి అనేది ఎంత నిజమో.. మీ జీవితంలో ఆనందపు వెలుగులు వస్తాయనేది అంతే నిజం. అదే ప్రకృతి ధర్మం కూడా.
ప్రతీ మనిషిలో ప్రతిభ ఉంటుంది.. కానీ ఆ ప్రతిభను వాడుకునే అవకాశం కోసం వేచి చూడాలి. అప్పటివరకు ఆ వచ్చే అవకాశంపై ఒక కన్నేసి ఉంచాలి, మీ పనులు చేసుకుంటూ ముందుకు సాగాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది మారుతుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు, ఈరోజు మీరు చాలా తిరస్కారాలకు గురైన వారు కావచ్చు. కానీ రేపంటూ ఒక రోజు వస్తుంది. మిమ్మల్ని తిరస్కరించిన వారే మీకు పూల బాటపట్టవచ్చు. మీ దశ ఒక్కసారిగా తిరగవచ్చు.
ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం.. ఒక యువకుడు క్రీడల్లో చాలా ముందు ఉండేవాడు, తన ఆటతీరుతో మంచి క్రీడాకారుడిగా ఎదుగుతాడు. కానీ విధి వెక్కిరించి ఒక యాక్సిడెంట్లో తన కాలును పోగోట్టుకుంటాడు. దీంతో తనకు ఎంతో ఇష్టమైన క్రీడకు దూరం అవుతాడు. ఇక తన జీవితం వ్యర్థం అని భావిస్తాడు. కొన్నాళ్లు గడుస్తాయి, తన జీవితంపై ఆ యువకుడికి ఏమాత్రం ఆశ లేదు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు తన వద్ద ఉన్నవి జ్ఞాపకాలు మాత్రమే. అయితే ఇలా భారంగా కాలం వెల్లదీస్తున్న సమయంలోనే తన ఆలోచనలనే ఒక బ్లాగులో రాసుకుంటూపోతాడు. తాను సాధించిన విజయాలు, తను జీవితంలో కింది నుంచి ఎలా ఎదిగాడు అనేది రాస్తుండగా తనకు తానే స్ఫూర్థి పొందుతాడు.. ఈ క్రమంలో ఆ బ్లాగు చదివిన ఎంతో మంది కూడా స్ఫూర్థిపొందుతారు. తనకు అభిమానులుగా మారతారు. అనతికాలంలోనే తన బ్లాగ్ పాపులర్ అవుతుంది. ఆ కథ స్ఫూర్థిగా ఎన్నో కథనాలు వస్తుంటాయి. అతణ్ని క్రీడా సంఘం వారు పిలిచి జట్టుకు స్ఫూర్థినింపేలా మెంటార్ గా నియమిస్తారు. మళ్లీ అతడి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు క్రీడాకారుడిగా తన గెలుపును మాత్రమే సంబరాలు చేసుకునే ఆ యువకుడు, ఆ తర్వాత ఒక జుట్టులో స్ఫూర్థి నింపుతూ వారి విజయంలో భాగం అవుతాడు. విధిని సైతం ఎదురించిన విజేతగా జీవితంలో నిలుస్తాడు.
ఈ కథను బట్టి తెలిసేది ఏమిటి? జీవితంలో అంతా అయిపోయింది అని భావించవద్దు. ప్రతి ముగింపు మరొక కొత్త ప్రారంభానికి నాంది. జీవితంలో ఏది జరిగినా అంతా మంచికే అని ముందుకు సాగాలి.
సంబంధిత కథనం
టాపిక్