Relationships: నా భర్త మూడు సార్లు మోసం చేశాడు, నాలుగోసారి కూడా తప్పు చేసి క్షమించమంటున్నాడు, ఏం చేయాలి?
Relationships: భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలకు మానసిక వైద్యులు మంచి పరిష్కారాలను చూపిస్తారు. అలాగే కౌన్సిలింగ్ నిపుణులు ఉత్తమ సలహాలను అందిస్తారు. ఓ మహిళ సమస్యకు నిపుణులు ఏం చెబుతున్నారో చదవండి.
ప్రశ్న: మా పెళ్లయి పదేళ్లు అయింది. ఈ పదేళ్లలో నా భర్త నన్ను మూడుసార్లు మోసం చేశాడు. నాకు మూడు సార్లు దొరికిపోయాడు కాబట్టి, మూడు సార్లే తప్పు చేశాడని చెప్పగలను. నేను చూడకుండా ఎన్ని సార్లు తప్పు చేశాడో తెలియదు. ప్రతిసారీ నేనే సర్దుకుపోయేదాన్ని. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కోసమే నేను మా ఆయన చేసిన తప్పులను మూడుసార్లు క్షమించాను. ఆ మూడుసార్లు ఆయన ఇంకెప్పుడు తప్పు చేయనని ఈ ఒక్కసారి క్షమించమని నన్ను అడిగాడు. అతడిని మన్నించి ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు మళ్లీ మరొక అమ్మాయితో తప్పు చేస్తూ దొరికిపోయాడు. ముందు మూడుసార్లు చెప్పినట్టే ఈసారి కూడా నాకు క్షమాపణ చెప్పాడు. ఇంకెప్పుడూ తప్పు చేయనని, నీతోనే ఉంటానని చెబుతున్నాడు. కానీ ఈసారి ఆయనను నాకు నమ్మాలనిపించడం లేదు. అంతేకాదు నాతో పాటు మరో నలుగురు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. అతడిని అలా వదిలేస్తే ఇంకెంతమందితో ఇలా ఆడుకుంటాడో అని భయం కూడా వేస్తోంది. పిల్లల కోసం అతడితో కలిసి జీవించాలా లేక నా జీవితాన్ని నేను బతకాలా? అనేది అర్థం కావడం లేదు. ఏదో ఒక సలహా ఇవ్వండి.
నిపుణులు ఏం చెబుతున్నారు...
ఏ బంధంలోనైనా ముందుగా ఉండాల్సింది నమ్మకం. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఇప్పటికే మూడుసార్లు మోసం చేశాడు. మీ నమ్మకాన్ని ముక్కలు చేశాడు. నిజాయితీ లేని జీవిత భాగస్వామితో కలిసి ఉండడం నిజంగా కష్టమైన పని. ఇప్పటికే మీరు ఎన్నో సార్లు అతనికి చెప్పి చూశానని అన్నారు. చివరిసారిగా ఇంకొక్కసారి మాట్లాడండి. ఇదే చివరి అవకాశం అని చెప్పండి. వేరే అమ్మాయిలతో తిరగడం వంటివి చేయకూడదని హెచ్చరించండి. ఈ విషయంలో మిమ్మల్ని మీరు నిందించుకోవడం మొదట మానేయండి. పిల్లల కోసం చెడు భర్తని భరించమని ఏ రాజ్యాంగమూ ఇంతవరకు చెప్పలేదు. హిందువులు నమ్మే రామాయణ, మహాభారతాలు కూడా ఆత్మాభిమానానికి ఎంతో విలువచ్చాయి. అంతేతప్ప ఆత్మాభిమానం లేకుండా బతకమని ఏ పురాణ గ్రంథాలు వివరించలేదు.
మీ వివాహాన్ని పదిలంగా ఉంచుకునేందుకు మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ భర్త ప్రతిసారి మీ ప్రయత్నాన్ని వమ్ము చేస్తున్నాడు. మీ భర్తకు ఉన్న చెడు తిరుగుళ్ళ కారణంగా మీరు మీ పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ముందుగా మీ కుటుంబానికీ, అతని కుటుంబానికీ ఈ విషయాన్ని చేరవేయండి. పెద్దలలోనే చివరిసారిగా మాట్లాడండి. అతనితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అన్నీ మీ పెద్దల ముందే మాట్లాడండి. ఇది చివరి అవకాశమని చెప్పండి. ఇంకొక్కసారి మిమ్మల్ని మోసం చేస్తే పిల్లలతో పాటూ వేరుగా జీవిస్తానని చెప్పండి. ఇందుకోసం మీ అత్తయ్య, మావయ్య, మీ తల్లిదండ్రుల సహకారం మీకు చాలా అవసరం. మీరు నిస్సహాయంగా ఉండిపోవద్దు. కాస్త తెలివితేటలు ఉంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కూడా జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముల అండ కాస్త ఉంటే చాలు మీ పిల్లల్ని ధైర్యంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా మోసం చేసే భాగస్వామితో జీవితాంతం బతకమని ఎవరూ చెప్పరు. ఇప్పటికి మూడుసార్లు అతనికి అవకాశం ఇచ్చారు. ఇక నాలుగోసారి పెద్దల సమక్షంలో చివరి అవకాశం ఇవ్వండి. అదే తప్పు మళ్లీ చేస్తే అతనికి దూరంగా విడిగా పిల్లలతో కలిసి బతకడమే మేలు.
టాపిక్