Mukku Pudaka: హిందూ ధర్మంలో పురాణాల ప్రకారం ముక్కు పుడక విశిష్టత ఏమిటి?
Mukku Pudaka: మగువలకి ముక్కెర అందం అంటారు చాలా మంది. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ముక్కు పుడక విశిష్టత ఏంటి అనేది చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
స్టైల్గా ఉంటుందనో లేదంటే ఇష్టం మీదనో ఇటీవల కాలంలో చాలా మంది ముక్కు పుడక పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మన అమ్మమ్మల కాలం నుంచి ముక్కు పెట్టుకోవడం అనేది ఆచారంగా వస్తుంది.
ముక్కుపుడక లేదా ముక్కెర ముక్కుకు ధరించే ఆభరణము. దీనిని ఎక్కువగా స్త్రీలు ధరిస్తారు. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముక్కెరను తమిళంలో మూక్కత్తి, హిందీలో నాత్ లేదా నాథురి, బీహారీలో లాంగ్ అని పిలుస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పురాణాల ప్రకారం ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువ అని తెలిపే కథలు పురాణాలలో చాలా ఉన్నాయి. భామా కలాపంలో భాగంగా సత్యభామ ఒకసారి తన చెలికత్తెని కృష్ణుడి దగ్గరకి రాయబారం కోసం పంపించాలని అనుకుంటుంది. కానీ అందుకు ఆమె ససేమిరా అన్నది.
ధగధగలాడే నగలు ఎన్ని ఇస్తానని ఆశ చూపించినా కూడా చెలికత్తె వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో విసిగిపోయిన సత్యభామ అసలు నీ మనసులో ఏం కోరిక ఉంది, ఏం కావాలని అడిగింది. అప్పుడు చెలికత్తె ఆమె ముక్కుకు పెట్టుకున్న ముక్కుపుడక కావాలని చెప్తుంది. సత్యభామ అది ఇవ్వగానే చెలికత్తె మహా సంబరంగా శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి రాయబారం నడుపుతుంది.
హిందూ దేవతలు అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో ముక్కెర గురించి ప్రస్తావిస్తారు.
సాంప్రదాయం
సంప్రదాయం ప్రకారం అమ్మాయి మేనమామ లేదంటే కాబోయే భర్త మాత్రమే ముక్కు పుడక ఇవ్వాలి. బయటి వాళ్ళెవరైనా ఇవ్వడం చాలా తప్పుగా భావిస్తారు. ఒకవేళ వాళ్ళ నుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు.
మెడలో పెళ్ళినాడు వేద మంత్రాల నడుమ కట్టించుకున్న తాళి ఎలా అయితే తీయారో అలాగే పెళ్లి సమయంలో పెట్టుకున్న ముక్కుపుడక కూడా తీసేయరు. అది ఉన్నంత కాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.
భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి. రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి. పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారు తీగ చుట్టించేవారు. యుక్త వయసుకి వచ్చిన తర్వాత వాటిని తీసేసి రాళ్ళు, ముత్యాలు పొదిగిన ముక్కు పుడకలు పెట్టెవాళ్ళు.
ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారని చిలకమర్తి తెలిపారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. గిరిజనులు, ఆదివాసీలు ముక్కుకి రెండు వైపులా ముక్కెరలు పెట్టుకుంటారు.
ప్రస్తుత కాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు వాడతారని చిలకమర్తి తెలిపారు.