Chilli Fish Recipe | చిల్లీ ఫిష్ ఇలా చేసుకొని తినండి.. పార్టీలో చిల్ అవ్వండి!
Chilli Fish Recipe: మీ పార్టీలో రుచికరమైన సీఫుడ్ స్టార్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే చిల్లీ ఫిష్ చేసుకోండి. ఇది మంచి ఇండో-ఫ్యూజన్ వంటకం, దీనిని చేసుకోవడం చాలా సులభం, రెసిపీని ఇక్కడ చూడండి.
ఇది వేడుకల సీజన్, విందులో వివిధ రకాల రుచులను ఆస్వాదించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు రుచికరమైన సీఫుడ్ స్టార్టర్స్ ఆప్షన్స్ కోసం చూస్తున్నట్లయితే ఫిష్ వంటకాలు అద్భుతంగా ఉంటాయి. చికెన్ ఎప్పుడూ తినేదే, చేపలతో కూడా చికెన్ తో చేసుకున్నట్లుగా మీరు చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చు. మీకోసం ఇక్కడ చిల్లీ ఫిష్ రెసిపీని అందిస్తున్నాము. ఇది ఒక ఇండో-ఫ్యూజన్ వంటకం. మీ పార్టీలో సైడ్ డిష్‌గా అందించండి, దీని రుచిని అందరూ మెచ్చుకుంటారు.
చిల్లీ ఫిష్, ఫిష్ మంచూరియన్ దాదాపు ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని రెస్టారెంట్లలో ఫిష్ మంచూరియన్‌ను ఫిష్ బాల్స్‌తో తయారు చేస్తారు. కానీ ఉపయోగించే సాస్ అదే ఉంటుంది. అయితే చిల్లీ ఫిష్ చేసుకోవడం చాలా సులభం. మీకు మీరుగా నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. చిల్లీ ఫిష్ ఎలా చేయాలో ఈ కింద సూచనలు పాటించండి.
Chilli Fish Recipe కోసం కావలసినవి
- 250 గ్రాముల చేప ముక్కలు (ముళ్లు లేనివి)
- 1/2 కప్పు మైదా
- 1/2 కప్పు మొక్కజొన్న పిండి
- 1 స్పూన్ బేకింగ్ పౌడర్
- 2 స్పూన్ సోయా సాస్
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
- 1 స్పూన్ మిరియాలు
- ఉప్పు రుచికి తగినంత
- నూనె ఫ్రై చేయడానికి సరిపడినంత
- స్ప్రింగ్ ఆనియన్ గార్నిషింగ్ కోసం
- సాస్ కోసం: 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్లు సోయా సాస్, 5 టేబుల్ స్పూన్లు టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి
చిల్లీ ఫిష్ ఎలా తయారు చేయాలి
- ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఆ తర్వాత మొక్కజొన్న పిండి, మైదా, బేకింగ్ పౌడర్, సోయా సాస్, కొత్తిమీర, మిరియాల పొడి, కొద్దిగా నీరు, రుచికోసం ఉప్పు వేసి అన్నీ కలిపి మసాలా మిశ్రమాన్ని తయారు చేసుకోండి.
- అనంతరం ఈ మిశ్రమంలో చేప ముక్కలను ముంచి, నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. చేపలను సర్వింగ్ ప్లేట్‌లోకి మార్చండి.
- ఇప్పుడు సాస్‌ను సిద్ధం చేయండి, ఇందుకోసం వేరొక పాన్‌లో నూనె వేడి చేయండి. అందులో అల్లం, వెల్లులి, పచ్చిమిర్చి వేసి వేయించండి.
- అందులో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి బాగా కలపాలి, చివరగా కార్న్ ఫ్లోర్ కలిపిన నీటిని పోసి ఉడికించాలి. సాస్ రెడీ అవుతుంది.
- ఇప్పుడు ఫ్రై చేసిన సాస్ ముక్కలపై, ఈ వేడివేడి సాస్ పోసి బాగా కలపాలి.
- చివరగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేస్తే, చిల్లీ ఫిష్ రెడీ.
చిల్లీ ఫిష్ రుచిని ఆస్వాదించండి, మీ పార్టీని గొప్పగా సెలెబ్రేట్ చేసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్