Summer Fish Curry Recipe । వేసవిలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా, చేపల కూర ఇలా చేయండి!
Summer Fish Curry Recipe: ఎండాకాలంలో మాంసాహారం ఎక్కువగా తినకూడదు అని అంటారు. అయితే తేలికగా ఉండేలా ఇలా చేపల కూర చేసుకోవచ్చు. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Summer Recipes: వేసవికాలంలో ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వంటకాలను తయారు చేసుకోవాలి. ఎందుకంటే వేడి శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, జీర్ణవ్యవస్థ కూడా నెమ్మదిస్తుంది, కాబట్టి సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎండాకాలంలో మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలని ఇది వరకే కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. కానీ చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు, కనీసం ఆదివారం అయినా నాన్-వెజ్ తినాలని కోరుకుంటారు.
ఎండాకాలంలో మాంసాహారం మితంగా తినాలి. అయితే చేపలు తినవచ్చు, ఎందుకంటే మటన్ లాంటి కఠినమైన మాంసం లాగా కాకుండా చేపలు వేసవిలో తేలికగా ఉంటాయి, సులభంగా జీర్ణమవుతాయి. రోహు లేదా కట్లా వంటి నదీ చేపలను ఎంచుకోవాలి, వాటిని పులుసు పెట్టుకోవడం గానీ, ఆలివ్ నూనెతో మైక్రోవేవ్‌లో కాల్చడం లేదా ఎయిర్ ఫ్రై చేసుకొని తినవచ్చు. మీకు ఇక్కడ రోహు ఫిష్ కర్రీ ఎలా చేయాలో రెసిపీ అందిస్తున్నాం. ఇది చాలా సింపుల్ రెసిపీ.
Summer Fish Curry Recipe కోసం కావలసినవి
- 500 గ్రాములు రోహు చేప ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1/2 టీస్పూన్ ఆవాలు
- 1/4 స్పూన్ మెంతులు
- 1 tbls తరిగిన అల్లం
- 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
- 2 రెమ్మలు కరివేపాకు
- 2 పచ్చి మిరపకాయలు
- 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు
- 1 పెద్ద ముక్క చింతపండు
- 1/4 టీస్పూన్ పసుపు
- 1 టేబుల్ స్పూన్ కారం
- 1 టమోటా
- ఉప్పు రుచికి తగినంత
చేపల పులుసు కూర తయారీ విధానం
- ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడగండి, ఆపైన కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు కలిపి పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించండి.
- ఆలస్యం లేకుండా, ఆ వెంటనే పెనం మీద కొద్దిగా నూనె వేడి చేసి చేప ముక్కలను పచ్చి వాసన పోయేవరకు రెండు వైపులా కొద్దిగా వేయించుకోండి. అనంతరం వీటిని పక్కన పెట్టుకోండి. (ఇలా వద్దనుకుంటే నేరుగా చేపముక్కలను కడిగి, పులుసులో వేసుకోవచ్చు).
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి, వేడి చేయండి. అందులో ఆవాలు, మెంతులు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి.
- అనంతరం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- ఆపైన టొమాటో ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాల వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేలా వేయించాలి.
- ఆ తర్వాత కొన్ని నీళు పోయండి, చింతపండు గుజ్జు కలపండి మరిగించండి.
- మరుగుతున్న పులుసులో చేప ముక్కలను వేసి తక్కువ- మీడియం మంటలో 10 నిమిషాలు ఉడికించాలి.
అంతే, స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చేపల కూర రెడీ. అన్నంతో కలిపి ఆస్వాదించవచ్చు.
సంబంధిత కథనం