Heatwave Advisory । ఎండలు పెరుగుతున్నాయి.. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి!
Heatwave Health Advisory: రాబోయే నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దేశంలోని కొన్ని జిల్లాలలో ఎండలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏం చేయాలి, ఏం చేయకూడదో సూచించింది. అవి ఇక్కడ తెలుసుకోండి.
Heatwave Health Advisory: 2023లో భారత వాతావరణ శాఖ తన మొదటి హీట్ వార్నింగ్‌ను జారీ చేసినందున, మార్చి నుండి మే వరకు వడగాలుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుపుతూ జాబితాను ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ముఖ్యంగా బయట పని చేసే వ్యక్తులు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు కలిగిన వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, 65 ఏళ్లు పైబడిన వారు, శిశువులు, చిన్న పిల్లలు మొదలైన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా తెలిపింది.
రాబోయే నెలల్లో విపరీతమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉండవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకొని సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆరోగ్య నిపుణులు సిఫారసు చేసిన కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
హైడ్రేటెడ్‌గా ఉండండి
మనందరికీ తెలుసు కఠినమైన వేసవి వాతావరణంలో మన శరీరం వేగంగా నీటిని కోల్పోతుంది, నిర్జలీకరణకు గురవుతాం. దీనిని నివారించాలంటే హైడ్రేటెడ్‌గా ఉండడం అనేది ప్రతీఒక్కరి ప్రధాన ప్రాధాన్యత. హైడ్రేటెడ్ గా ఉండటానికి తరచుగా నీరు త్రాగాలి . అలాగే ప్రయాణాల సమయంలో నీటిని తీసుకువెళ్లాలని సలహా ఇస్తున్నారు. లెమన్ వాటర్, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) వంటి సాల్టెడ్ డ్రింక్స్‌తో పాటు పుచ్చకాయ, దోసకాయ, నిమ్మకాయ, నారింజ వంటి తాజా పండ్లను తీసుకోవాలని ఆరోగ్య శాఖ సిఫార్సు చేస్తోంది.
నీడపట్టున ఉండండి
వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. నీడ ఉన్న ప్రదేశాలలో ఉండండి, విండో షేడ్స్, కర్టెన్లను ఉపయోగించండి, ఫ్యాన్లు, కూలర్లు, AC ఉపయోగించండి, చల్లని నీటితో స్నానాలు చేయండి.బయటకు వెళ్లేటప్పుడు, టోపీ, గొడుగు, ఏదైనా వస్త్రాన్ని తలను కప్పుకోవడం మర్చిపోవద్దు. అదనంగా, లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగటం నివారించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
ఆల్కాహాల్ వద్దు- మాంసాహారం వద్దు
ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. బదులుగా కొబ్బరినీరు, పండ్ల రసాలు వంటివి ఆరోగ్యకరమైనవి తాగవచ్చు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారానికి దూరంగా ఉండండి, తాజాగా వండిన ఆహారం తీసుకోండి. ఉప్పు, కారం, నూనెలు తక్కువ ఉండేలా చూసుకోండి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తినకుండా చిన్న చిన్న పరిమాణాలలో ఎక్కువ సార్లు తినాల్సిందిగా ఆరోగ్య శాఖ సూచించింది.
అదనంగా రోజులో వేడిగా ఉన్నప్పుడు శ్రమతో కూడిన పని చేయడంగానీ, వ్యాయామం చేయవద్దని సూచించారు. ఇంటి చుట్టూ మొక్కలు, ఇంటిపైన గడ్డి, సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వంటి సాధారణ వేసవి నియామాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
సంబంధిత కథనం
టాపిక్