Puri Laddu: మిగిలిపోయిన పూరీలతో ఇలా టేస్టీ లడ్డూలు చేసేయండి, అదిరిపోయే స్వీట్ రెసిపీ ఇది
Puri Laddu: పూరీలు మిగిలిపోయినప్పుడు వాటితో స్వీట్ గా లడ్డూలను చేసుకోవచ్చు. ఈ పూరీ లడ్డూ చాలా టేస్టీగా ఉంటుంది. తినాలన్న ఆసక్తిని పెంచుతుంది.
Puri Laddu: ఇంట్లో ఒక్కోసారి పూరీలు మిగిలిపోవడం సహజం. అలా మిగిలిపోయిన పూరీలను స్వీట్ రూపంలోకి మార్చవచ్చు. ఇక్కడ మేము పూరీ లడ్డు రెసిపీ ఇచ్చాము. దీన్ని మిగిలిపోయిన పూరీలతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ పూరీలు మిగలకపోయినా పూరీలను చేసి ఈ లడ్డూలను తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో తెలుసుకోండి.
పూరీ లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు
పూరీలు - పది
నెయ్యి - రెండు కప్పులు
యాలకులు పొడి - ఒక స్పూను
జీడిపప్పు - గుప్పెడు
చక్కెర - మూడు కప్పులు
పూరీ లడ్డు రెసిపీ
1. ముందుగానే గోధుమ పిండితో పూరీలను చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
2. మైదాతో చేసే పూరీలను తినడం ఆరోగ్యకరము కాదు.
3. కాబట్టి గోధుమ పిండితోనే పూరీలను చేసుకోండి.
4. ఈ పూరీలను కాస్త క్రిస్పీగా వచ్చేలా వేయించుకోవాలి.
5. వాటిని చేత్తోనే నలిపేసి పొడిలా చేసుకోవాలి. లేదా ఒకసారి మిక్సీలో వేసుకున్నా అది మెత్తగా పొడిలా అయిపోతుంది.
6. ఇప్పుడు ఒక మిక్సీలో పంచదారను కూడా వేసి పొడిలా చేసుకోవాలి.
7. స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
8. అందులో జీడిపప్పులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
9. అందులోనే పూరీ పొడి, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి.
10. యాలకుల పొడిని చల్లుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా వచ్చేవరకు ఉడికించాలి.
11. తర్వాత స్టవ్ కట్టేసి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే టేస్టీ పూరీ లడ్డు రెడీ అయిపోతుంది.
12. ఇది నాలుగైదు రోజులపాటు తాజాగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. ఒక్కసారి చేసి చూడండి. సాధారణ లడ్డూ కన్నా ఈ పూరీ లడ్డు కాస్త కొత్తగా రుచిగా ఉంటుంది.
డయాబెటిస్ పేషెంట్లకు మాత్రం ఈ లడ్డూ తినడం వల్ల ప్రయోజనాలు దక్కవు. సరి కదా షుగర్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనం చక్కెరను అధికంగా వినియోగించాం. కాబట్టి పిల్లలకు మాత్రం రోజుకు ఒకటి ఇవ్వండి. ఏదైనా తీపి పదార్థం తినాలనిపించినప్పుడు వీటిని తింటే మంచిది. పూరీలను చేసేందుకు చాలా మంది మైదా పిండిని వాడుతూ ఉంటారు. అది ఆరోగ్యానికి తీవ్ర హానికరం. ఎందుకంటే మైదాలో కొన్ని రసాయనాలను కలిపి తెల్లగా వచ్చేలా చేస్తారు. కాబట్టి పూరీలు చేసేందుకు గోధుమపిండిని వినియోగించడమే అన్ని రకాలుగా మంచిది.
టాపిక్