Adai Dosa Recipe । ప్రోటీన్లతో నిండిన అడై దోశ.. సులభంగా ఇలా చేసేయండి!
Adai Dosa Recipe: రెగ్యులర్ దోశకు బదులుగా ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే అడై దోశ తింటే ఎంతో ఆరోగ్యం. సులభంగా చేసుకునే రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
రోజుకు మూడు పూటలు తినడం అవసరమే, కానీ మీరు ఒక్కపూట అయినా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారా అనేది ముఖ్యం. అల్పాహారం రోజులో చేసే ముఖ్యమైన భోజనంగా చెప్తారు. కాబట్టి మీరు ఉదయం లేచిన తర్వాత మొదటగా తీసుకునే ఆహారం పోషకాలతో సమృద్ధిగా ఉండాలి. సాధారణంగా మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా అంటూ రోజుకో వెరైటీ తింటాం. అయితే దోశల్లో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. అందులో ఒకటి అడై దోశ.
అడై దోశ అనేది కొన్ని కాయధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు కలిపి చేసే ఒక ఆరోగ్యకరమైన వంటకం. ఇది ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే అల్పాహారం. అడై దోశ చేయాలంటే కాయధాన్యాలు, పప్పులు నానబెట్టి, ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేసి, పిండి రుబ్బుకొని చేయాల్సి ఉంటుంది. అయితే అంత శ్రమ లేకుండా సులభంగా ఇన్‌స్టంట్ వెర్షన్ అడై దోశ రెసిపీ (Instant Adai Dosa Recipe) ని మీకు ఇక్కడ అందిస్తున్నాం. మరి ఇన్‌స్టంట్ అడై దోశ ఎలా చేయడానికి ఈ కింద ఇచ్చిన సులభమైన సూచనలను అనుసరించండి.
Instant Lentil Dosa Recipe కోసం కావలసినవి
- 1/4 కప్పు శనగపిండి
- 1/2 కప్పు గోధుమ పిండి
- 1/2 కప్పు బియ్యం పిండి
- 1 ఉల్లిపాయ
- 1/2 చెంచా జీలకర్ర
- 1/4 చెంచా ఇంగువ
- 1/2 స్పూన్ కారం
- 1/4 చెంచా పసుపు పొడి
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- తాజా కొత్తిమీర
- సరిపడా నీరు
- తగినంత ఉప్పు
అడై దోశ తయారీ విధానం
- ఒక గిన్నెలో గోధుమ పిండి, బియ్యప్పిండి, శనగపిండి వేసి కలపాలి.
- అందులో తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు వేసి కలపండి
- ఆపైన అవసరం మేరకు నీరు కలపండి, దోశలు వేసుకునేలా చిక్కటి పిండిని సిద్ధం చేయండి.
- ఇప్పుడు పాన్ వేడి చేసి, నూనె చిలకరించి దోశ వేయండి.
- గోధుమ రంగులో వచ్చే వరకు దోశను కాల్చండి. దోశను రెండు వైపులా కాల్చుకోండి.
అంతే, అడై దోశ రెడీ. ఇడ్లీ పొడి లేదా కొబ్బరి చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయండి.
- మరో విధానంలో, అయితే బియ్యం, శనగపప్పు, మినపపప్పు, కందిపప్పులను బాగా కడిగి, అందులో కొన్ని ఎండు మిర్చి వేసి 1-2 గంటలు నానబెట్టుకోవాలి, ఆపై నీరు పోసి పిండి రుబ్బుకోవాలి. ఈ పిండిని 8 గంటలు పులియబెట్టి. ఆ తర్వాత ఆ పిండిలో పైన పేర్కొన్న పదార్థాలు కలిపి దోశగా వేసుకోవచ్చు. ఇది అడై దోశను తయారు చేసే ప్రామాణిక పద్ధతి.
సంబంధిత కథనం