Potlakaya Mutton Keema Curry: పొట్లకాయ మటన్ కీమా కలిపి వండండి, దీన్ని ఇగురులా వండితే ఆ రుచే వేరు
Potlakaya Mutton Keema Curry: వేడివేడిగా పొట్లకాయ మటన్ కీమా కర్రీ తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు. దీన్ని అన్నంలో కలుపుకున్నా, చపాతీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా దీనిలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.
Potlakaya Mutton Keema Curry: మటన్ కీమా పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. దీన్ని మరింత పోషకాహారంగా మార్చుకోవాలనుకుంటే పొట్లకాయని కూడా జతచేసి వండండి. అన్నంలో ఈ పొట్లకాయ మటన్ కీమా ఇగురును కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. చపాతీతో, రోటితో కూడా టేస్టీగా ఉంటుంది. దోసెలతో తిన్నా బాగుంటుంది. ఒక్కసారి ఈ పొట్లకాయ మటన్ కీమా కర్రీ వండుకుని చూడండి. మీకు నచ్చడం ఖాయం.
పొట్లకాయ మటన్ కీమా కర్రీకి కావలసిన పదార్థాలు
మటన్ కీమా - పావు కిలో
పొట్లకాయ తరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
గరం మసాలా - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
నూనె - రుచికి సరిపడా
పసుపు - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర పొడి - అర స్పూను
కరివేపాకులు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - రెండు
పొట్లకాయ మటన్ కీమా కర్రీ
1. పొట్లకాయను ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
2. మటన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కాస్త నూనె వేయాలి.
4. ఆ నూనెలో మటన్ కీమాను వేసి వేయించాలి.
5. ఆ మటన్ కీమలోనే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. అయిదు నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత ఈ మటన్ కీమా ఉడకడానికి సరిపడా నీటిని వేసి మూత పెట్టేయాలి.
7. కనీసం ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
8. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.
9. అందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
10. అందులోనే చిటికెడు పసుపు, అర స్పూను కారం, చిటికెడు ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి.
11. ఇందులో ముందుగానే సన్నగా తరిగిన పొట్లకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
12. మూత పెట్టి చిన్న మంట మీద ఒక 20 నిమిషాల పాటు మగ్గించాలి.
13. పొట్లకాయలు మెత్తగా ఉడుకుతాయి. అవి ఉడికిన తర్వాత కుక్కర్లోని మటన్ కీమా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
14. మూత పెట్టి చిన్నవంట మీద మరొక అరగంట పాటు ఉడకనివ్వాలి.
15. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకులు, కొత్తిమీర తరుగును చల్లుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
16. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే పొట్లకాయ మటన్ కీమా కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో తిన్నా చపాతీలో తిన్నా ఇది రుచిగా ఉంటుంది.
మటన్‌లోనూ, పొట్లకాయల్లోనూ రెండిట్లోనూ పోషకాలు ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పొట్లకాయ తినడం వల్ల మూత్రపిండాలకు వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్, పొటాషియం, మాంగనీస్, అయోడిన్ వంటి పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి. మటన్ తక్కువగా తినడం వల్ల కూడా మేలే జరుగుతుంది. ఈ కర్రీని ఇగురులా వండుకుంటే మీకు కచ్చితంగా నచ్చుతుంది.