Onion peels: ఉల్లిపాయ పొట్టు జమ చేయండి.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?
Onion peels: ఉల్లిపాయ ఉపయోగించని ఇల్లు ఉండదు. ప్రతిరోజూ ఉల్లి తొక్కల్ని చెత్తబుట్టలో వేసేస్తాం. కానీ వాటిని ఎలా ఉపయోగించొచ్చో తెల్సుకోండి.
ఉల్లిపాయలు ఉపయోగించని ఇల్లు ఉంటుందా? ప్రతి రోజూ కనీసం ఒక్క ఉల్లిపాయ అయినా కోయందే రోజు గడవదు. ఉల్లిపాయల మాదిరిగానే ఉల్లిపాయ తొక్కలు కూడా ఆల్ రౌండర్ అని మీకు తెలుసా. ఉల్లిపాయ తొక్కలను ఇంటి శుభ్రపరచడం నుండి అందం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటి కోసం ఉపయోగించవచ్చు.
మొక్కల కోసం:
ఉల్లిపాయ తొక్కల సహాయంతో మొక్కలకు ఎరువులాగా ఉపయోగపడే స్ప్రే తయారు చేయవచ్చు. ఉల్లి తొక్కలతో తయారు చేసిన ఈ స్ప్రే మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది. స్ప్రే తయారు చేయడానికి, ముందుగా ఉల్లి తొక్కలను నీటిలో మరిగించండి. నీరు కాస్త మరిగి రంగు మారాక, గ్యాస్ కట్టేయండి. ఇప్పుడు ఉడికించిన ఉల్లిపాయ తొక్కలను మాత్రమే మిక్సీ జార్‌లో వేసి, అందులో కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. చిక్కటి ముద్ద రెడీ అయ్యాక ఈ పేస్ట్ ను స్ప్రే బాటిల్ లో వేసి, దానికి తగినన్ని నీళ్లు పోసుకుంటే పలుచగా మారుతుంది. ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిళ్లో వేసుకుంటే సరి. చెట్లకు స్ప్రే చేస్తే ఎదుగుదల బాగుంటుంది.
క్లీనర్ తయారీ:
ఉల్లిపాయ తొక్కల సహాయంతో ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ లిక్విడ్ ను తయారు చేయవచ్చు. ఈ శుభ్రపరిచే ద్రవంతో ఫ్లూరింగ్, గాజు వస్తువులు, ఇతర మెటల్ వస్తువుల్ని కూడా సులభంగా శుభ్రం చేయవచ్చు. క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయ తొక్కలను నీటిలో మరిగించి, వాటిని గ్రైండర్లో గ్రైండ్ చేసి, మెత్తని పేస్ట్ తయారు చేయండి. ఈ ముద్దలో ఒక టీస్పూన్ డిటర్జెంట్ పౌడర్, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. క్లీనింగ్ లిక్విడ్ రెడీ అయినట్లే. దీన్ని బ్రష్ సహాయంతో అప్లై చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే వస్తువులు మెరుస్తాయి.
ముఖ సౌందర్యానికి:
ఉల్లిపాయ తొక్కల్లో విటమిన్ ఎ, ఇ, సి పుష్కలంగా లభిస్తాయి. వీటితో అనేక చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖంపై మరకలు తగ్గాలంటే ఈ తొక్కలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వడగట్టిన నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా శనగపిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వారానికి కనీసం రెండుసార్లు ఫేస్ మాస్క్ లా ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఇది ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది.
జుట్టు సమస్యలు:
జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య ఉంటే వాటిని ఉల్లి తొక్క సహాయంతో తగ్గించుకోవచ్చు. చుండ్రు సమస్య ఉంటే ఉల్లిపాయ తొక్కలను నీటిలో మరిగించి తర్వాత వడకట్టాలి. నీరు చల్లారిన తర్వాత, ఈ నీటితో తలకు మసాజ్ చేసుకుని జుట్టును కడగాలి. ఇది చుండ్రు తగ్గిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలుతుంటే ఉల్లిపాయ తొక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు టీస్పూన్ల పొడిలో రెండు టేబుల్ చెంచాల అలోవెరా జెల్ కలపాలి. తయారుచేసిన పేస్ట్ ను మాస్క్ లాగా జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేయాలి.
టాపిక్