Rice cooker biryani: ఎలక్టిక్ రైస్ కుక్కర్ ఉందా? అదిరిపోయే బిర్యానీ ఇలా చేసేయండి..-how to make veg biryani in electric rice cooker with tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Cooker Biryani: ఎలక్టిక్ రైస్ కుక్కర్ ఉందా? అదిరిపోయే బిర్యానీ ఇలా చేసేయండి..

Rice cooker biryani: ఎలక్టిక్ రైస్ కుక్కర్ ఉందా? అదిరిపోయే బిర్యానీ ఇలా చేసేయండి..

Koutik Pranaya Sree HT Telugu
Jul 06, 2024 11:30 AM IST

Rice cooker biryani: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పొడిపొడిగా, రుచిగా ఉండే పర్ఫెక్ట్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెల్సా? ఈ టిప్స్ చూసేయండి.

రైస్ కుక్కర్ బిర్యానీ
రైస్ కుక్కర్ బిర్యానీ

బిర్యానీ చేయాలంటే బోలెడు పాత్రలు అవసరమవుతాయి. అందుకే చాలా మంది శ్రమ ఎక్కువని దాని జోలికి తరచూ పోరు. ఇక బ్యాచిలర్లకు ఇది చేయడం మరింత కష్టం. కానీ ఏ బ్యాచిలర్ దగ్గర అయినా తప్పకుండా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది. దాంట్లో కూడా అదిరిపోయే బిర్యానీ సింపుల్‌గా చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి.

వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల బాస్మతీ బియ్యం

1 కప్పు మీల్ మేకర్

1 చెంచా నూనె

4 చెంచాల నెయ్యి

సగం నిమ్మచెక్క

3 ఉల్లిపాయల ముక్కలు

2 టమాటాల ముక్కలు

2 బంగాళదుంపలు

1 కప్పు బీన్స్

1 కప్పు బటానీ

4 పచ్చిమర్చి

1 కప్పు కొత్తిమీర తరుగు

1 కప్పు పుదీనా ఆకులు

చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

పావు చెంచా పసుపు

రెండు చెంచాల కారం

రెండు చెంచాల ధనియాల పొడి

చెంచా గరం మసాలా

తగినంత ఉప్పు

మసాలాలు:

3 లవంగాలు

పావు టీస్పూన్ మిరియాలు

2 యాలకులు

అంగుళం దాల్చిన చెక్క ముక్క

1 జాపత్రి

1 అనాసపువ్వు

1 బిర్యానీ ఆకు

వెజ్ బిర్యానీ తయారీ విధానం:

1. ముందుగా బాస్మతీ బియ్యాన్ని కడిగి కనీసం పదిహేను నిమిషాల పాటూ నానబెట్టుకోవాలి. అలాగే మీల్ మేకర్ కూడా నానబెట్టుకోవాలి.

2. ఇప్పుడు కూరగాయల ముక్కల్ని వేయించడానికి కడాయి వాడొచ్చు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్లో నేరుగా తాలింపు పెట్టేయొచ్చు.

3. రైస్ కుక్కర్ ఆన్ చేశాక అందులో 2 చెంచాల నూనె, 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి.

4. అందులో మిరియాలు, లవంగాలు, అనాసపువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి వేసి వాసన వచ్చేదాకా వేగనివ్వాలి.

5. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి రంగు మారేదాకా వేయించుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి.

6. పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసి నిమిషం వేయించాలి. టమాటాలు పూర్తిగా మెత్తబడ్డాక పసుపు, గరం మసాలా, కారం, ధనియాల పొడి కూడా వేసుకోవాలి.

7. అన్నీ బాగా కలుపుకుని నానబెట్టుకున్న మీల్ మేకర్ , మిగతా కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. సగం కన్నా ఎక్కువ కూరగాయముక్కలన్నీ ఉడికిపోవాలి. రైస్ కుక్కర్ అడుగుభాగంలో మాడితే కొద్దిగా నీళ్లు పోయండి.

8. పైన చెప్పిన పద్ధతంతా ముందుగా కడాయిలో కూడా చేసుకుని ఇప్పుడు రైస్ కుక్కర్లోకి వేసుకోవచ్చు.

9. ఈ కూరగాయ ముక్కల్లో నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం నీళ్లు వంపేసి కలుపుకుని వేయించుకోవాలి.

10 .ఉప్పు, ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకుని కలియబెట్టాలి. బియ్యం ముందుగా నానబెట్టుకోకపోతే మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి.

11. ఇప్పుడు రైస్ కుక్కర్ మూత పెట్టుకుని వార్మ్ మోడ్ లోకి వచ్చేదాకా ఆగితే సరిపోతుంది. చివరగా రెండు చెంచాల నెయ్యి మీద వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రైస్ కుక్కర్ వెజ్ బిర్యానీ రెడీ.

Whats_app_banner