Snake Gourd Curd Pachadi । పొట్లకాయ పెరుగు పచ్చడి.. లొట్టలేసుకుంటూ తింటారు!
Snake Gourd Curd Pachadi Recipe: పొట్లకాయను, పెరుగుతో కలిపినప్పుడు అది రుచికరమైన వంటకం అవుతుంది, ఒంటికి చలువ చేస్తుంది. పొట్లకాయ పెరుగు పచ్చడి రెసిపీని చదవండి
Healthy Summer Recipes: వేసవిలో నూనె ఎక్కువగా కలిగిన గ్రేవీలకు దూరంగా ఉండి, తేలికపాటి భోజనం, కాలానుగుణ కూరగాయలైన దోసకాయ, గుమ్మడికాయ, సోరకాయ, కాకరకాయ, మామిడికాయ వంటి వాటిని వండుకొని తినాలి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా, శరీరంపై సహజమైన శీతలీకరణ ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మీకు పొట్లకాయ, పెరుగుతో చేసే పొట్లకాయ పెరుగు పచ్చడి రెసిపీని (Potlakaya Perugu pachadi Recipe) అందిస్తున్నాము.
పొట్లకాయను, పెరుగుతో కలిపినప్పుడు అది రుచికరమైన వంటకం అవుతుంది, ఒంటికి చలువ చేస్తుంది. వేడి వాతావరణంలో పొట్లకాయ తినడం శరీరానికి చాలా మంచిది. ఇది శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గిస్తుంది, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, హైడ్రేషన్ పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Snake Gourd Curd Pachadi Recipe కోసం కావలసినవి
- 1 పొట్లకాయ
- 1 కప్పు చిక్కటి పెరుగు
- 2 పచ్చిమిర్చి
- 2 ఎండుమిర్చి
- 1 అంగుళం అల్లం
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి
- 2 టీస్పూన్ల ఆవాలు
- 1 టీస్పూన్ జీలకర్ర
- 1/2 టీస్పూన్ ఇంగువ
- 1 కరివేపాకు రెమ్మ
- రుచికి సరిపడా ఉప్పు
- గార్నిష్ కోసం కొత్తిమీర
పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం
- మొదట పొట్లకాయ శుభ్రంగా కడిగి, దాని తొక్క తీసి, దానిలోని గింజలు, నారను తీసివేసి, చిన్నగా అర అంగుళం పరిమాణంలో కట్ చేసుకోండి.
- ఇప్పుడు ఒక కుండలో పొట్లకాయ ముక్కలను వేసి, తగినంత నీరు పోసి, మీడియం వేడి మీద 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆపై నీటిని తీసివేసి చల్లబరచండి.
- ఈలోగా అల్లం, కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి కలిపి రుబ్బుకొని పేస్ట్ లాగా చేయాలి. అవసరమైతే దానికి కొంచెం నీరు కలపండి
- పొట్లకాయ ఉడికిన తర్వాత అందులో పెరుగు, సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కలపాలి.
- ఆ తర్వాత రుచికి అనుగుణంగా చిటికెడు పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఒక చిన్న బాణలిలో నెయ్యి వేసి, వేడయ్యాక ఆవాలు వేయించాలి, ఆ తర్వాత, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకులను వేసి పోపు పెట్టండి.
- పొట్లకాయ, పెరుగు మిక్స్‌లో పోపును వేసి మృదువుగా కలపండి. ఆపై కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోండి.
అంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి. అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం