Pesarattu Pulusu: ఆంధ్రాలో చేసే పెసరట్టు పులుసు, దీని రుచి చూస్తే వదల్లేరు, రెసిపీ తెలుసుకోండి-pesarattu pulusu recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pesarattu Pulusu: ఆంధ్రాలో చేసే పెసరట్టు పులుసు, దీని రుచి చూస్తే వదల్లేరు, రెసిపీ తెలుసుకోండి

Pesarattu Pulusu: ఆంధ్రాలో చేసే పెసరట్టు పులుసు, దీని రుచి చూస్తే వదల్లేరు, రెసిపీ తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Sep 27, 2024 11:30 AM IST

Pesarattu Pulusu: ఆంధ్రాలో పెసరట్టును కూరగా వండుతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కోఫ్తా కర్రీలాగే పెసరట్టు కూర టేస్టీగా వండవచ్చు. రెసిపీ ఎలాగో చూద్దాం.

పెసరట్టు కూర రెసిపీ
పెసరట్టు కూర రెసిపీ

Pesarattu Pulusu: పెసరట్టు కూర ఏంటి? అనుకోవచ్చు. కోఫ్తాను ఎలా తయారు చేసి కర్రీగా వండుతారో, అలాగే పెసరట్టును కాస్త మందంగా వేసి ముక్కలుగా కోసి కూర వండుతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. చింతపండు వేసి చేసే ఈ పులుసు వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది. ఒక్కసారి తిని చూడండి. దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

పెసరట్టు పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసరట్టు - ఒకటి

పచ్చిమిర్చి - ఆరు

అల్లం - చిన్న ముక్క

జీలకర్ర - ఒక స్పూను

ధనియాలు - రెండు స్పూన్లు

లవంగాలు - నాలుగు

యాలకులు - రెండు

దాల్చిన చెక్కలు - రెండు

చింతపండు - నిమ్మకాయ సైజులో

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ఉల్లిపాయలు - రెండు

టమాటో - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

పెసరట్టు పులుసు రెసిపీ

1. పెసరట్టును సాధారణంగా దోశెల్లా పలుచగా వేసుకుంటాము. కానీ కూర వండుకోవాలనుకుంటే మాత్రం పెసరట్టును కాస్త మందంగా వేసుకోవాలి.

2. అలా మందంగా వేయాలంటే పిండిని ఎక్కువ నీళ్లు పోయకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

3. పెసరట్టు మందంగా వేసుకున్నాక దాన్ని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఏ సైజు ముక్కలు కోయాలో మీ ఇష్టమే.

4. ఇప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

5. కాస్త నీరు వేసి పేస్టులా రుబ్బుకున్నా మంచిదే.

6. చింతపండును కూడా నానబెట్టుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. ఉల్లిపాయల తరుగును వేసి వేయించుకోవాలి. ఇవి రంగు మారేవరకు వేయించుకోవాలి.

9. తర్వాత పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.

10. టమోటో తరుగు వేసి బాగా మగ్గించాలి.

11. ఆ తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలపాలి.

12. కారం కూడా వేయాలి. ఇది మరుగుతున్నప్పుడు పెసరట్టు ముక్కలను అందులో వేయాలి.

13. మీకు పులుసు ఏ పరిమాణంలో కావాలో ఆ పరిమాణానికి నీళ్లను వేసుకోండి.

14. మరీ ఎక్కువ నీళ్లు వేస్తే పులుసు టేస్ట్ లేకుండా పలుచగా అయిపోతుంది.

15. కాబట్టి ఒక గ్లాసు నీళ్ళకు మించి వేయకపోవడమే మంచిది.

16. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాను వేసి బాగా కలుపుకోండి.

17. కరివేపాకులు, కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలపండి.

18. చిన్న మంట మీద అరగంట పాటు ఉడికించండి.

19. తర్వాత స్టవ్ కట్టేసి ఒక అరగంట అలా వదిలేయండి.

20. పులుసును పెసరట్టు ముక్కలు పీల్చుకుంటాయి. దీనివల్ల అవి చాలా టేస్టీగా ఉంటాయి.

21. ఆ తర్వాత వేడి వేడి అన్నంతో ఈ పెసరట్టు పులుసును వేసుకొని తినండి. రుచి అదిరిపోతుంది.

చేపల పులుసును ఎలా చేస్తారో అదే విధంగా పెసరట్టు ముక్కలతో పులుసును వండుకోవచ్చు. ఇది మహా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మీరు మళ్లీ మళ్లీ చేసుకొని తింటారు. ఆరోగ్యానికి కూడా ఈ రెసిపీ ఎంతో మంచిది. ఒకసారి ఈ పెసరట్టు కూరను వండుకొని చూడండి. పిల్లలతో సహా అందరికీ నచ్చుతుంది. పెసరట్టు కూర ఆంధ్రాలో చాలా ఫేమస్ వంటకం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దీన్ని వండుతూ ఉంటారు.