Green Tomato Pachadi: ఎర్ర టమోటాలాగే పచ్చి టమోటో పచ్చడి అదిరిపోతుంది, ఒకసారి చేసుకొని చూడండి-green tomato pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Tomato Pachadi: ఎర్ర టమోటాలాగే పచ్చి టమోటో పచ్చడి అదిరిపోతుంది, ఒకసారి చేసుకొని చూడండి

Green Tomato Pachadi: ఎర్ర టమోటాలాగే పచ్చి టమోటో పచ్చడి అదిరిపోతుంది, ఒకసారి చేసుకొని చూడండి

Haritha Chappa HT Telugu
Aug 26, 2024 11:41 AM IST

Green Tomato Pachadi: టమోటో పచ్చడి అనగానే ఎర్రగా పండిన టమోటాలతోనే చేస్తారనుకుంటారు. నిజానికి ఆకుపచ్చగా ఉన్న టమోటోలతో కూడా టేస్టీ పచ్చడి చేయొచ్చు. ఇవి పచ్చి టమోటోలు. ఇవి కూడా రుచిగానే ఉంటాయి.

పచ్చి టమోటో పచ్చడి
పచ్చి టమోటో పచ్చడి

Green Tomato Pachadi: టమాటోలతో చేసిన ఏ ఆహారమైనా, టేస్టీగా ఉంటుంది. ఎర్రగా పండిన టమోటోలతోనే కాదు ఆకుపచ్చగా ఉన్న పచ్చి టమోటాలతో కూడా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చు. ఇది ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. పైగా రుచిగా కూడా ఉంటుంది. పచ్చిమిర్చి వేసి స్పైసీగా చేసుకుంటే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది. ఈ పచ్చి టమోటోలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే. రుచి రెట్టింపు అవుతుంది. ఇక్కడ మేము లేతగా ఉన్న పచ్చి టమోటాలతో పచ్చడి ఎలా చేయాలో ఇచ్చాము. మీకు మార్కెట్లో పచ్చి టమోటోలు దొరికితే ఈ పచ్చడిని ప్రయత్నించండి. లేదా ఇంట్లో మీరు పెంచుకున్న టమోటో ముక్కలకు టమోటాలు పండక ముందే ఆకుపచ్చగా ఉన్నప్పుడే తీసి ఈ టమోటో పచ్చడిని ప్రయత్నించండి. ఇది మీకు చాలా నచ్చుతుంది. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

పచ్చి టమోటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు

పచ్చి టమోటోలు - పావుకిలో

పల్లీలు - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - పావు కప్పు

మినప్పప్పు - అర స్పూను

ఆవాలు - అర స్పూను

నూనె - తగినంత

ఎండు మిర్చి - ఒకటి

పచ్చిమిర్చి - నాలుగు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - ఒక స్పూను

పచ్చి టమోటో పచ్చడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు అదే కళాయిలో అర స్పూన్ నూనె వేసి పచ్చి టమోటోలను చిన్న ముక్కలుగా కోసుకొని ఆ నూనెలో వేసి వేయించుకోవాలి. కాస్త ఉప్పు వేసుకోవాలి.

3. ఇది మీడియం మంట మీద పెట్టి వండాలి. లేకపోతే టమోటా ముక్కలు మాడిపోతాయి. ఇవి మెత్తగా ఉడికే వరకు అలా ఉంచాలి.

4. పసుపును కూడా వేసుకోవాలి.

6. మిక్సీలో వేయించిన పచ్చి టమోటా మిశ్రమాన్ని వేసి, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నిమ్మకాయ సైజులో లేదా ఉసిరికాయ సైజులో చింతపండును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

7. తాజా కొత్తిమీర ఆకులను కూడా వేసి రుబ్బుకుంటే టేస్టీగా ఉంటుంది.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

9. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాలి.

10. తాలింపు పెట్టేందుకు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి అర స్పూన్ నూనె వేయాలి.

11. అందులో ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి.

12. ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.

13. గుప్పెడు కరివేపాకులను వేయాలి.

14. ఈ మొత్తం మిశ్రమాన్ని రుబ్బుకున్న పచ్చి టమోటో మిశ్రమంపై వేయాలి.

15. అంతే టేస్టీ పచ్చి టమోటా పచ్చడి రెడీ అయినట్టే. దీని రుచి మామూలుగా ఉండదు.

16. ఎర్ర టమోటాల పచ్చడి మీకు ఎంతగా ఇష్టపడతారో ఈ పచ్చి టమోటాల పచ్చడిని కూడా మీరు అంతగా ఇష్టపడతారు. దోశ ఇడ్లీ అన్నంతో ఇది అదిరిపోతుంది.

పచ్చి టమోటాలతో ఉపయోగాలు

ఎర్రగా ఉండే టమాటోలోనే కాదు పచ్చి టమాటాల్లో కూడా లైకోపీన్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఇందులో ఉంటాయి. చర్మానికి, జుట్టుకు మేలు చేసే విటమిన్ ఈ కూడా పచ్చి టమాటోల్లో లభిస్తుంది. కాబట్టి పచ్చి టమోటాలను కూడా అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కచ్చితంగా ఆహారాలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పచ్చి టమోటాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా పచ్చి టమోటోలు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి మీకు ఎప్పుడైనా పచ్చి టమోటాలు లభిస్తే వాటితో ఇలా టమాటా పచ్చడి చేసుకోవడం మర్చిపోవద్దు. పైగా ఇది చాలా రుచిగా ఉంటుంది.