Palakura Pachadi: పోషకాల పాలకూర పచ్చడి, అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్, రెసిపీ ఇదిగో-palakura pachadi recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palakura Pachadi: పోషకాల పాలకూర పచ్చడి, అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్, రెసిపీ ఇదిగో

Palakura Pachadi: పోషకాల పాలకూర పచ్చడి, అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
May 25, 2024 11:30 AM IST

Palakura Pachadi: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఒకసారి పచ్చడి చేసుకుని చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. రెసిపీ కూడా చాలా సులువు.

పాలకూర పచ్చడి రెసిపీ
పాలకూర పచ్చడి రెసిపీ

Palakura Pachadi: గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి, మామిడికాయ పచ్చడి... ఇలాగే పాలకూరను కూడా టేస్టీ పచ్చడిగా మార్చుకోవచ్చు. పాలకూరను పప్పులో వేసి వండడమో లేక పాలకూర వేపుడు చేయడమో ఎక్కువగా చేస్తుంటారు. ఓసారి పచ్చడి చేసి చూడండి. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నం లోనే కాదు రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీల్లో కూడా తినవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి చేసుకుంటే రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెసిపీ ఇది.

పాలకూర పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పాలకూర - నాలుగు కట్టలు

చింతపండు - నిమ్మకాయ సైజులో

ధనియాలు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

జీలకర్ర - పావు స్పూను

ఆవాలు - పావు స్పూను

పసుపు - చిటికెడు

మెంతులు - పావు స్పూను

ఎండుమిర్చి - ఆరు

ఉప్పు - రుచికి సరిపడినంత

నూనె - సరిపడినంత

పాలకూర పచ్చడి రెసిపీ

1. పాలకూరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో నూనె వేయాలి.

3. ఆ నూనెలో మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నూనెలో పాలకూరను వేసి వేయించాలి.

5. పాలకూర నుంచి నీళ్లు దిగేటప్పుడు పసుపు, చింతపండు కూడా వేసి బాగా వేయించుకోవాలి.

6. ఐదు నిమిషాల పాటు వేయిస్తే పాలకూర మెత్తగా ఉడుకుతుంది. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.

7. ఇప్పుడు మిక్సీ జార్లో మొదటిగా వేయించుకున్న ధనియాలు, మినప్పప్పు, మెంతులు, ఎండుమిర్చితో పాటు ఈ పాలకూర మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

8. చివరిలో పచ్చి ఉల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేయాలి.

9. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.

10. స్టవ్ మీద కళాయి పెట్టి తాలింపు కోసం నూనె వేయాలి.

11. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు వేసి ఆ మొత్తాన్ని పచ్చడి పైన వేసుకోవాలి. అంతే టేస్టీ పాలకూర పచ్చడి రెడీ అయినట్టే.

12. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అన్నం వేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చడిని కలుపుకుని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

పప్పు పాలకూర మంచి కాంబినేషన్. పాలకూరలోని పోషకాలు ఏవీ బయటకు పోకుండా అన్నీ అందులోనే ఉంటాయి. అలాగే పాలకూర పచ్చడి చేసినా పాలకూరలోని పోషకాలు బయటకు పోవు. ఎందుకంటే దీన్ని ఎక్కువసేపు ఉడికించము, కాబట్టి పోషకాలన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా మేలు చేస్తుంది. ఒక్కసారి దీన్ని వండుకొని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఒకరోజు చేసుకుంటే రెండు మూడు రోజులు పాటు తినవచ్చు. ఫ్రిజ్లో పెడితే తాజాగా ఉంటుంది.

Whats_app_banner