Raw Onions: రోజుకో పచ్చి ఉల్లిపాయ తింటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం
Raw Onions: పచ్చి ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని చాలామంది తినరు. కానీ రోజుకో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు అదుపులో ఉంటాయి.
Raw Onions: ప్రతి వంటగదిలో ఉల్లిపాయలు ఉండాల్సిందే. భారతీయ వంటకాలలో ఉల్లిపాయలది ప్రముఖ పాత్ర. కూరల్లో, పప్పుల్లో, బిర్యానీల్లో వేసిన ఉల్లిపాయల కన్నా ప్రతిరోజూ ఒక పచ్చి ఉల్లిపాయను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పచ్చి ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని చాలామంది తినడం మానేస్తారు. ఈ పచ్చి ఉల్లిపాయ తిన్నాక నోటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఆ వాసన పోతుంది. పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి.
పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ క్రియను పెంచుతుంది. పేగు కదలికలకు సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు, ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈ పచ్చి ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుంది. ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో వారు ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలు తినడానికి ప్రయత్నించండి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్ పెరగకుండా అడ్డుకుంటుంది.
పచ్చి ఉల్లిపాయల్లో ఎన్నో రకాల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఉల్లిపాయల్లో విటమిన్ b6, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. దీనివల్ల జీవక్రియ, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో ఇనులిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ గా పని చేస్తుంది. ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు చాలా అవసరం. ఇవి పోషకాల శోషణను పెంచుతాయి. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడానికి రోజుకో పచ్చి ఉల్లిపాయ కచ్చితంగా తినాలి.
ఉల్లిపాయల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు, రోజూ పచ్చి ఉల్లిపాయను తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఉల్లిపాయల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రభావాన్ని చూపిస్తాయి.
ఉల్లిపాయలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలంటే, చల్లగా ఉన్న ప్రాంతంలో ఉంచండి. అలాగని ఫ్రిజ్‌లో మాత్రం పెట్టకండి. ఇంట్లోనే చల్లగా ఉండే, పొడిగా ఉండే ప్రాంతంలో ఉంచితే మంచిది. సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోండి. అలాగే తడి తగలకుండా చూసుకోండి. బంగాళదుంపలు లేదా ఇతర కూరగాయలు పండ్లతో కలిపి ఉల్లిపాయలను నిల్వ చేయకండి. ఇలా చేస్తే ఉల్లిపాయలు త్వరగా పాడవుతాయి.