Onions Sprouts: మొలకెత్తిన ఉల్లిపాయలు కూరల్లో వాడొచ్చా? అవి తినడం సురక్షితమేనా?
Onions Sprouts: ఉల్లిపాయలు మొలకెత్తడం అందరూ చూస్తూనే ఉంటాం. ఎక్కువ కాలం పాటు ఉల్లిపాయలను అలా వదిలేస్తే అవి మొలకెత్తుతాయి. అలా మొలకెత్తిన ఉల్లిపాయలను తినాలా? వద్దా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.
Onions Sprouts: చాలామంది మొలకెత్తిన ఉల్లిపాయలను చూడగానే తీసి బయట పడేస్తూ ఉంటారు. అవి తినడం అంత సురక్షితం కాదని భావిస్తారు. మొలకెత్తిన ఉల్లిపాయలను బయట పడేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నిజానికి మొలకెత్తిన ఉల్లిపాయలను పడేయాల్సిన అవసరం లేదు. వాటిని చక్కగా వండుకొని తినవచ్చు. మొలకెత్తిన ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయల గడ్డల నుండి పైకి పెరిగే ఒక ఆకుపచ్చ రెమ్మలు. ఇవి నిల్వ చేసిన చోట వెచ్చదనానికి, తేమకు గురైతే ఇలా మొలకెత్తుతాయి. అంతేకాదు మొలకెత్తిన ఉల్లిపాయలను తినడం అన్ని విధాలుగా సురక్షితం. ఇవి మంచి రుచిని కలిగి ఉంటాయి.ముఖ్యంగా పైకి వచ్చిన మొలకలను కూరల్లో వేసుకోవచ్చు. ఉల్లిపాయల పైన పెరిగే ఆ మొలకలనే స్ప్రింగ్ ఆనియన్స్ పేరుతో అమ్ముతూ ఉంటారు. రెమ్మలను కూడా నూడిల్స్ పైన, ఫ్రైడ్ రైస్‌ల పైన చల్లుతూ ఉంటారు. కాబట్టి మీకు స్ప్రింగ్ ఆనియన్స్ కావాలనుకున్నప్పుడు కూడా అలా మొలకెత్తిన ఉల్లిపాయలను తీసుకొచ్చి కుండీలో మట్టి పైన ఉంచండి. మరింత పొడవు పెరిగి అవి స్ప్రింగ్ ఆనియన్స్ గా మారుతాయి. వాటిని కూరల్లో వాడుకోవచ్చు.
ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్నో పోషక విలువలు అందుతాయి. ఇలా మొలకెత్తిన ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉల్లిపాయల్లోని ఖనిజాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. మొలకెత్తిన ఉల్లిపాయలు మృదువుగా, తాజా రుచితో ఉంటాయి. కాబట్టి వాటిని పడేయాల్సిన అవసరం లేదు. మీకు మొలకలు నచ్చకపోతే వండడానికి ముందే ఆ మొలకలను కత్తిరించి పడేయండి. మిగతా ఉల్లిపాయలను సాధారణంగానే వాడుకోండి. అయితే మొలకెత్తిన ఉల్లిపాయ లోపల బాగా మెత్తబడిపోతే దాన్ని పడేయడమే మంచిది. ఉల్లిపాయల్లోని సారాన్ని ఈ మొలకలు తీసుకొని ఎదుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మొలకలు పొడవు పెరిగవుతాయో.. ఉల్లిపాయలోని సారం అంతా పోయి మెత్తగా మరీ ఎండినట్టు అవుతుంది. అలాంటప్పుడు ఉల్లిపాయలను వాడకపోవడమే మంచిది. పైన వచ్చిన పొడవాటి మొలకలను కత్తిరించుకుని కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.
ఏది ఏమైనా ఉల్లిపాయలు చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో యాంటీబయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ఉల్లిపాయల్లో పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, సల్ఫర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. కొలెస్ట్రాల్, సోడియం వంటివి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిది. ఉల్లిపాయలు తినేవారిలో నిద్రలేమి, ఇతర నిద్రా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. రోజుకి అర ముక్క పచ్చి ఉల్లిపాయ తిన్నా మంచిదే. లేదా కూరల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకొని తినడం అలవాటు చేసుకోండి. ఏదైనా పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయ లేకుండా ఏ కూర పూర్తవ్వదు. బిర్యానీ, కూరల్లో ముఖ్య పాత్ర ఉల్లిపాయలదే.
టాపిక్