Oats Egg Bhurji: ఓట్స్ ఎగ్ బుర్జీ... డయాబెటిస్ పేషెంట్లకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్, చేయడం చాలా సులువు
Oats Egg Bhurji: డయాబెటిస్ పేషెంట్లు అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే మంచిది. అలాగే బరువు పెరగ కుండా ఉండే ఆహారాన్ని తినాలి. అలాంటి వారికి ఓట్స్ ఎగ్ బుర్జీ నచ్చుతుంది.
Oats Egg Bhurji: ఓట్స్, కోడిగుడ్లు... ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటితో చేసిన ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తినమని వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా సిఫారసు చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము ఓట్స్ ఎగ్ బుర్జీ రెసిపీ ఇచ్చాము. ఇది అల్పాహారంగా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు దీన్ని తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా ఉంటాయి. ఈ రెసిపీ చేయడం చాలా సులువు.
ఓట్స్ ఎగ్ బుర్జీ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఓట్స్ - ఒక కప్పు
గుడ్లు - రెండు
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - పావు స్పూను
ఒరెగానో - అర స్పూను
చీజ్ తరుగు - రెండు స్పూన్లు
నీరు - తగినంత
బటర్ - రెండు స్పూన్లు
ఓట్స్ ఎగ్ బుర్జీ రెసిపీ
1. కోడిగుడ్లను ఒక చిన్న గిన్నెలో కొట్టి బాగా గిలక్కొట్టండి.
2. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి చిన్న మంట పెట్టండి.
3. కాస్త బటర్ ను వేయండి. అందులోనే గుడ్లు వేసి కీమా లాగా కలుపుకోండి.
4. ఒక నిమిషం పాటు కలిపితే కీమా ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది.
5. ఇప్పుడు అందులో ఓట్స్ ని కూడా వేసి కలపండి.
6. తర్వాత నీటిని వేయండి. ఓట్స్ నీటిలో ఉడకడానికి రెండు నుంచి మూడు నిమిషాలు పడతాయి.
7. ఆ తర్వాత చీజ్‌ను కలపండి.
8. అలాగే ఒరెగానో, మిరియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపండి.
9. మిశ్రమం ముద్దలా కాకుండా పొడిపొడిగా వచ్చేవరకు చిన్న మంట మీద ఉంచి గరిటతో కలుపుతూ ఉండండి.
10. ఆ తర్వాత స్టవ్ కట్టేయండి. టేస్టీ ఓట్స్ ఎగ్ బుర్జీ రెడీ అయినట్టే. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది.
డయాబెటిస్ ఉన్నవారు, హైబీపీ ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి బెస్ట్ రెసిపీ ఓట్స్ ఎగ్ బుర్జీ. ఇది తింటే చాలా గంటల వరకు ఆకలి వేయదు. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఇది అమాంతం పెంచదు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీన్ని మనస్పూర్తిగా తినవచ్చు. దీని చేయడం చాలా సులువు. కేవలం అరగంటలో ఇది రెడీ అయిపోతుంది. రుచిలో కూడా అదిరిపోతుంది.