Mangoes: రోజుకు ఎన్ని మామిడి పండ్లు తింటే బరువు, డయాబెటిస్ పెరగకుండా ఉంటాయి?-how many mangoes a day can be eaten to prevent weight gain and diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mangoes: రోజుకు ఎన్ని మామిడి పండ్లు తింటే బరువు, డయాబెటిస్ పెరగకుండా ఉంటాయి?

Mangoes: రోజుకు ఎన్ని మామిడి పండ్లు తింటే బరువు, డయాబెటిస్ పెరగకుండా ఉంటాయి?

Haritha Chappa HT Telugu
May 22, 2024 06:37 PM IST

Mangoes: వేసవిలో మామిడి పండ్లు అధికంగా తినే వారి సంఖ్య ఎక్కువ. ఇవి ఎక్కువ తింటే బరువు త్వరగా పెరిగిపోతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి గ్లూకోజ్ స్పైక్ ను నియంత్రించడానికి మామిడి పండ్లను మితంగా తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు.

రోజులో మామిడి పండ్లు ఎన్ని తినవచ్చు?
రోజులో మామిడి పండ్లు ఎన్ని తినవచ్చు? (Pixabay)

వేసవిలో మామిడి పండ్లను అధికంగా తింటారు. కొంతమంది ఒకేసారి రెండు మూడు పండ్లు తినడం, ప్రతి పూటా వాటినే తినడం వంటివి చేస్తూ ఉంటారు. మామిడి పండ్లను అధికంగా తినడం వల్ల త్వరగా బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్పైక్ ను నియంత్రించడానికి మామిడి పండ్లను మితంగా తినాలని, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి ఆ పండ్లను తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. మామిడిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. కానీ అతిగా తినడం వల్ల మాత్రం బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంది.

మామిడి పండ్లను మితంగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీ మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిలోని విటమిన్ సి, కెరోటినాయిడ్లు సూర్యరశ్మి దెబ్బతినకుండా చర్మాన్ని కాపాడతాయి. మామిడిలోని విటమిన్ ఎ కంటిచూపును కాపాడుతుంది. మాక్యులర్ క్షీణత వంటి వయస్సు-సంబంధిత దృష్టి సమస్యలను నివారిస్తుంది. మామిడిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, మామిడి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది మానసిక స్థితిని కాపాడుతుంది.

రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినవచ్చు?

పోషకాహార నిపుణురాలు జూహీ కపూర్ తన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్టులో రోజులో ఎన్ని మామిడి పండ్లు తినవచ్చు చెబుతున్నారు. ఆమె చెబుతున్న ప్రకారం పెద్ద మామిడి పండులో సగభాగాన్ని లేదా 150 గ్రాముల పండును తినవచ్చని వివరిస్తున్నారు. ఈ పండు సుమారు 125-150 కేలరీలను అందిస్తుంది.

300-350 గ్రాముల బరువున్న పెద్ద మామిడి పండులో దాదాపు 250 నుండి 300 కేలరీలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. సగటు మనిషికి రోజుకు 2,000 కేలరీలు అవసరమవుతాయి. ఒక పెద్ద మామిడి పండు తింటే వారి మొత్తం రోజువారీ కేలరీల అవసరాలలో సుమారు 15 శాతం ఇది అందిస్తుంది.

ఇలా తినండి

ఒక మీడియం సైజులో ఉండే మామిడిలో సుమారు 50 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. కాబట్టి రోజుకు సగం పండు లేదా ఒక పూర్తి పండును తింటే చాలు. ఈ పండును ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారపదార్థాలతో కలిపి తింటే మంచిది. కాబట్టి మీరు మీ మామిడి తినడానికి ముందు నానబెట్టిన చియా విత్తనాలు, నానబెట్టిన బాదం, వాల్ నట్స్ వంటి వాటితో కలిపి తినవచ్చు. ఇలా తింటే మామిడి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

మామిడి పండు తినే సమయం కూడా చాలా ముఖ్యమైనది. దీన్ని ముఖ్యంగా బాగా శారీరక శ్రమ చేశాక తింటే మంచిది. వ్యాయామం చేశాక తిన్నా కూాడా మంచిదేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

మామిడి పండు తినడం వల్ల అధిక బరువు పెరగకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే రోజుకు ఒక పండుకు మించి తినకూడదు. అలాగే ఈ పండు తిన్న వెంటనే నానబెట్టిన చియా విత్తనాలు, బాదం, వాల్ నట్స్ వంటివి తింటూ ఉండాలి.

Whats_app_banner