Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది-oats vegetables khichdi recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Vegetables Khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

Oats vegetables khichdi: ఓట్స్ తో చేసిన ఆహారాలు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడమే కాదు, బరువు త్వరగా తగ్గుతారు. గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కూరగాయలు వేసి ఇలా ఓట్స్ కిచిడి ప్రయత్నించండి.

ఓట్స్ కిచిడీ రెసిపీ

Oats vegetables khichdi: బ్రేక్ ఫాస్ట్‌లో పౌష్టికరమైన ఆహారాన్ని తినమని వైద్యులు చెబుతారు. ముఖ్యంగా ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినాలి. ఓట్స్‌ను తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు మధుమేహంతో బాధపడేవారు. ఓట్స్ కిచిడిని తినడం చాలా ముఖ్యం. ఓట్స్ చేసే వంటకాలు ఏవైనా మేలే చేస్తాయి. ఇక్కడ మేము టమాటోలు, వెల్లుల్లి తరుగు, బంగాళా దుంప, బీన్స్, బఠానీలు వేసి ఓట్స్ కిచిడిని రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఇందులో అనేక రకాల కూరగాయలు వినియోగించాము.. కాబట్టి ఎన్నో పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఓట్స్ - ఒక కప్పు

టమాట - ఒకటి

అల్లం తరుగు - అర స్పూను

పెసరపప్పు - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - ఒకటి

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - చిటికెడు

ఆవాలు - ఒక స్పూను

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

నీరు - సరిపడినంత

నెయ్యి - రెండు స్పూన్లు

ఇంగువ - చిటికెడు

మిరియాల పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

క్యారెట్ తరుగు - పావు కప్పు

బీన్స్ - పావు కప్పు

బఠానీలు - పావు కప్పు

బంగాళదుంప - ఒకటి

ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి రెసిపీ

1. కూరగాయలు అన్నింటినీ శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. క్యారెట్, బంగాళాదుంపలను పైన తొక్కు తీసేయాలి. బఠానీలను కూడా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.

3. పెసరపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

4. నెయ్యి వేడెక్కాక అందులో ఇంగువ, ఆవాలు వేసి చిటపటలాడించాలి.

5. అందులోని ఎండుమిర్చి, కరివేపాకులె, తరిగిన అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

6. అవి వేగాక సన్నగా తరిగిన బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, టమోటాలు వేసి వేయించాలి.

7. క్యారెట్, బీన్స్, టమాటోలు ఇవన్నీ మెత్తగా ఉడికే వరకు చిన్న మంట మీద మూత పెట్టి ఉంచాలి.

8. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలపాలి.

9. అలాగే మిరియాల పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీటిని వేసి మూత పెట్టాలి.

10. ఆ కూరగాయన్ని మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.

11. అది దగ్గరగా అయ్యాక నీటిలో నానబెట్టుకున్న ఓట్స్ ను చేత్తోనే పిండి ఇందులో కలపాలి.

12. ఓట్స్ ఆ మిశ్రమంలో బాగా కలిసిపోయేలా ఉంచాలి.

13. తర్వాత మళ్లీ ఒక అర గ్లాసు నీళ్లు వేసి బాగా ఉడికించాలి.

14. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

15. ఇదంతా దగ్గరగా ఉప్మా లాగా అవుతుంది. అప్పుడు స్టవ్ కట్టేయాలి.

16. అంతే టేస్టీ ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి రెడీ అయినట్టే. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది.

అల్పాహారంలో భాగంగా ఓట్స్, క్యారెట్, బీన్స్, టమోటో, పెసరపప్పు వంటివి తినడం వల్ల ఆ రోజంతా శరీరానికి శక్తి అందుతూనే ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఓట్స్ కిచిడి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి.