Nimmakaya Karam Pachadi: నిమ్మకాయ కారం పచ్చడి రెసిపీ, వేడివేడి అన్నంలో ఈ పచ్చడి రుచే వేరు
Nimmakaya Karam Pachadi: ఎన్ని కూరలు ఉన్నా పక్కన స్పైసీ పచ్చడి ఉండాల్సిందే. అప్పుడే భోజనం సంపూర్ణమవుతుంది. ఇక్కడ మేము నిమ్మకాయ కారం పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
Nimmakaya Karam Pachadi: తెలుగిళ్లల్లో సంపూర్ణ భోజనం అంటే అందులో పచ్చడికి కూడా స్థానం ఉంటుంది. ఎన్నో రకాల పచ్చళ్ళు ప్రస్తుతం లభిస్తున్నాయి. ఇంట్లోనే ఒకసారి నిమ్మకాయ కారం పచ్చడి చేసుకుని చూడండి. ఇది ఒకసారి చేసుకుంటే వారం రోజులు తాజాగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే ఆ రుచే వేరు. పుల్లపుల్లగా కారం కారంగా ఉండే పచ్చడి పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ నచ్చుతుంది. నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ పచ్చడి తింటే ఎంతో మేలు. నిమ్మకాయ కారం పచ్చడి రెసిపీ చాలా సులువు. ఎలాగో తెలుసుకోండి.
నిమ్మకాయ కారం పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
నిమ్మకాయలు - నాలుగు
మెంతులు - పావు స్పూను
నూనె - మూడు స్పూన్లు
ఎండుమిర్చి - 17
మినపప్పు - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - పావు స్పూను
పసుపు - పావు స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
శనగపప్పు - అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
కరివేపాకులు - గుప్పెడు
నిమ్మకాయ కారం పచ్చడి రెసిపీ
1. ముందుగా నిమ్మకాయలను కోసి రసం మొత్తం పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నిమ్మకాయ ముక్కలను పడేయవచ్చు.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. ఆ నూనెలో మెంతులు, మినప్పప్పు వేయించుకోవాలి.
4. ఆ తర్వాత ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి.
5. వాటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
6. కాస్త ఉప్పు, పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి.
7. అలాగే తీసిన నిమ్మరసాన్నివేసి మిక్సీ మరొక్కసారి పట్టుకోవాలి.
8. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
10. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
11. ఆ పచ్చడిపై ఈ తాళింపును వేసుకోవాలి. అంటే టేస్టీ నిమ్మకాయ కారం పచ్చడి రెడీ అయినట్టే.
12. ఇందులో నిమ్మకాయ రసాన్ని వినియోగించాము. మీకు కావాలనుకుంటే నిమ్మకాయ రెబ్బలను వేసుకోవచ్చు. ఈ కారం పచ్చడి వారం రోజులు పాటు నిల్వ ఉంటుంది. తింటే రుచి అదిరిపోతుంది.
నిమ్మరసంతో చేసినా కారం పచ్చడి ఇది. దీనిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. నోరు చప్పగా అనిపించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ పచ్చడిని కాస్త నాలుకకు రాసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే కారం అధికంగా తినలేని వారు ఈ పచ్చడిలో ఎండుమిర్చిని కాస్త తగ్గించుకుంటే సరిపోతుంది.
టాపిక్