Karivepaku Rice: కరివేపాకు రైస్ ఇలా చేశారంటే డిన్నర్‌లోకి అదిరిపోతుంది-karivepaku rice recipe in telugu know how to make this rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karivepaku Rice: కరివేపాకు రైస్ ఇలా చేశారంటే డిన్నర్‌లోకి అదిరిపోతుంది

Karivepaku Rice: కరివేపాకు రైస్ ఇలా చేశారంటే డిన్నర్‌లోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 30, 2024 05:30 PM IST

Karivepaku Rice: డిన్నర్లో సింపు‌ల్‌గా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఓసారి కరివేపాకు రైస్ ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

కరివేపాకుల రైస్
కరివేపాకుల రైస్ (Youtube)

Karivepaku Rice: రాత్రిపూట చాలా సింపుల్‌గా రాత్రి భోజనాన్ని ముగించే వారి సంఖ్య ఎక్కువ. కొందరు చపాతీ కూరతో ముగిస్తే మరికొందరు సలాడ్ తో ముగిస్తారు. ఇంకొందరు అప్పటికప్పుడు చేసుకొనే ఇన్ స్టెంట్ రైస్‌‌లను ప్రయత్నిస్తారు. ఓసారి ఈ కరివేపాకు రైస్ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కరివేపాకు రైస్ చేయడం చాలా సులువు.

కరివేపాకుల రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కరివేపాకులు - ఒక కప్పు

వండిన అన్నం - రెండు కప్పులు

శనగపప్పు - ఒక స్పూన్

మిరియాలు - అర స్పూను

ధనియాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

మినప్పప్పు - ఒక స్పూన్

ఎండుమిర్చి - ఐదు

వెల్లుల్లి రెబ్బలు - మూడు

నువ్వులు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పల్లీలు - గుప్పెడు

జీడిపప్పు - ఐదు

ఇంగువ - చిటికెడు

కరివేపాకు రైస్ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక కరివేపాకులు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి.

2. అవన్నీ వేగాక తీసి మిక్సీలో వేసి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం నూనె వేసి పల్లీలు, ఇంగువ, గుప్పెడు కరివేపాకులు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి.

4. అవి వేగాక ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి.

5. ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి, రుచికి సరిపడా ఉప్పును అన్నంలో వేసి పులిహోర కలుపుకున్నట్టు కలుపుకోవాలి.

6. ఒక నిమిషం పాటు స్టవ్ మీదే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

7. అంతే రుచికరమైన కరివేపాకు రైస్ రెడీ అయినట్టే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వేసవిలో కరివేపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాత్రిపూట సింపుల్‌గా భోజనాన్ని ముగించాలి అనుకునేవారు ఒక కప్పు కరివేపాకు రైస్ తింటే సరిపోతుంది. మిగిలిన అన్నంతో ఈ కరివేపాకు రైస్‌ను టేస్టీగా చేసుకోవచ్చు. కరివేపాకులు తినడం వల్ల శరీరంలో ఉన్న విషాలు, వ్యర్ధాలు బయటికి పోతాయి. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే చర్మానికి కూడా కరివేపాకుల్లోని గుణాలు ఎంతో మేలు చేస్తాయి.

చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి. కరివేపాకులు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వీటిని తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యానికి, చర్మం మెరిసేందుకు కరివేపాకులు సహాయపడతాయి. కరివేపాకు రైస్ ను పిల్లలకు వారానికి ఒకసారైనా తినిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కరివేపాకులను కూరల్లో ఎక్కువగా వాడుతూ ఉండాలి.

Whats_app_banner