Mushroom Masala Curry: మష్రూమ్ మసాలా కర్రీ, దీన్ని చూస్తేనే తినాలనిపించేస్తుంది, ఇదిగో రెసిపి-mushroom masala curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom Masala Curry: మష్రూమ్ మసాలా కర్రీ, దీన్ని చూస్తేనే తినాలనిపించేస్తుంది, ఇదిగో రెసిపి

Mushroom Masala Curry: మష్రూమ్ మసాలా కర్రీ, దీన్ని చూస్తేనే తినాలనిపించేస్తుంది, ఇదిగో రెసిపి

Haritha Chappa HT Telugu
Feb 23, 2024 05:30 PM IST

Mushroom Masala Curry: మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుట్టగొడుగులను తినమని వైద్యులు కూడా సూచిస్తారు. మష్రూమ్ మసాలా కర్రీ ఒక్కసారి తిన్నారంటే మీకు నచ్చడం ఖాయం.

మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ
మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ (youtube)

Mushroom Masala Curry: పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వారానికి ఒక్కసారైనా మష్రూమ్స్‌ను తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. వీటి ద్వారా విటమిన్ డి శరీరానికి అందుతుంది. దీంతోపాటు అనేక రకాల పోషకాలు అందుతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నోరూరించేలా ఒకసారి మష్రూమ్ మసాలా కర్రీ చేసుకుని చూడండి. రుచి అదిరిపోతుంది. దీన్ని చపాతీతో తిన్నా, అన్నంలో కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ మసాలా గ్రేవీ చేయడం చాలా సులువు.

మష్రూమ్స్ మసాలా గ్రేవీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పుట్టగొడుగులు - 200 గ్రాములు

నూనె - మూడు స్పూన్లు

దాల్చిన చెక్క - ఒకటి

యాలకులు - మూడు

జీలకర్ర - అర స్పూను

ఉల్లిపాయ - ఒకటి

పసుపు - అర స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

గరం మసాలా - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

కారం - రెండు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్

పచ్చిమిర్చి - మూడు

కరివేపాకులు - గుప్పెడు

టమాటా - ఒకటి

నీరు - సరిపడినంత

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ

1. పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర వేసి వేయించాలి.

4. అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారేవరకు ఉంచాలి.

5. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం, ధనియాలపొడి, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి బాగా వేయించాలి.

6. అవి వేగాక టమోటా తరుగును వేసి కలపాలి.

7. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.

8. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి.

9. టమోటో మెత్తగా అయి ఇగురులాగా అవుతుంది.

10. అప్పుడు నీటిని వేసి మూత పెట్టాలి. పది నిమిషాల పాటు ఉడికిస్తే నూనె పైకి తేలి ఇగురు చేరుతుంది.

11. అప్పుడు కోసుకున్న పుట్టగొడుగులను అందులో వేసి కలుపుకోవాలి.

12. మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు పాటు చిన్న మంట మీద ఉడికించాలి.

13. మూత తీసి కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ కట్టేయాలి.

14. అంతే టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో తిని చూడండి. సూపర్ గా ఉంటుంది. చపాతీతో కూడా అదిరిపోతుంది.

పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయని ముందే చెప్పుకున్నాం. పుట్టగొడుగుల్లో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి9, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగులు తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా పుట్టగొడుగులు అడ్డుకుంటాయి. అయితే అన్ని రకాల పుట్టగొడుగులను తినకూడదు. కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాటిని ఎంచుకోవాలి.

కొందరిలో పుట్టగొడుగులు అలెర్జీకి కారణం అవుతాయి. అలాంటి అలెర్జీలు ఉన్నవారు మష్రూమ్స్ కి దూరంగా ఉండటమే మంచిది. మష్రూమ్స్ తో ఎలాంటి అలెర్జీ లేనివారు దీని వారంలో రెండు సార్లు తినడం ఉత్తమం. మష్రూమ్ పులావ్, మష్రూమ్ బిర్యాని వండుకొని తింటే మంచిది. ఈ మష్రూమ్ మసాలా కర్రీ మాత్రం అన్నంతోనే తినాలి. అలా తింటేనే దీని రుచి తెలుస్తుంది. ఒకసారి ఈ మష్రూమ్ మసాలా గ్రేవీని వండి చూడండి. మీకు నచ్చేయడం ఖాయం.

Whats_app_banner