Monday Motivation : సంకల్పం ఉంటే.. ఎన్ని కష్టాలున్నా గెలవొచ్చు.. ఇదిగో రియల్ లైఫ్ స్టోరీ-monday motivation suraj tiwari lost his legs and hands in train accident but he cracked upsc in first attempt ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : సంకల్పం ఉంటే.. ఎన్ని కష్టాలున్నా గెలవొచ్చు.. ఇదిగో రియల్ లైఫ్ స్టోరీ

Monday Motivation : సంకల్పం ఉంటే.. ఎన్ని కష్టాలున్నా గెలవొచ్చు.. ఇదిగో రియల్ లైఫ్ స్టోరీ

Anand Sai HT Telugu
Feb 19, 2024 05:00 AM IST

Monday Motivation Telugu : జీవితంలో విజయం సాధించాలంటే అన్ని సౌకర్యాలు ఉండాలని చాలా మంది చెబుతారు. కానీ కాళ్లు, చేతులు సరిగా లేకున్నా విజయం సాధించొచ్చని ఓ వ్యక్తి నిరూపించాడు.

సూరజ్ తివారీ లైఫ్ స్టోరీ
సూరజ్ తివారీ లైఫ్ స్టోరీ (Unsplash)

కొందరికి అన్ని సౌకర్యాలు, సంపదలు, సుఖాలు ఉన్నా జీవితంలో లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదు. లక్ష్యాన్ని సాధించడం తపస్సు లాంటిది. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం సాధించడం అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం పగలు రాత్రి కష్టపడాలి. శ్రద్ధగా ఉండాలి, నిద్రలేని రాత్రులు గడపాలి. కోరికలు పక్కన పెట్టాలి. లక్ష్యాన్ని సాధించడమే తపస్సుగా ఉండాలి. అయినా విజయం వస్తుందని నమ్మకంగా చెప్పలేం.

అయితే కొందరు మాత్రం కాస్త సౌకర్యాలు లేకున్నా.. పరిస్థితులు బాగాలేవని తెగ బాధపడిపోతారు. కానీ ఒక వ్యక్తి గురించి చెబితే మాత్రం మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆయనకు రైలు ప్రమాదంలో కాళ్లు, చేతులు పోయాయి. కానీ సంకల్పంతో ముందుకెళ్లాడు. మెుదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. అతడే.. సూరజ్ తివారీ.

యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సేవ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ అందులో విజయం సాధించిన వారి సంఖ్య మాత్రం కొందరే. ఎందుకంటే యూపీఎస్సీ పరీక్ష అంత సులభం కాదు. దీనికి కష్టపడి పని చేయాలి. పగలు రాత్రి తేడా లేకుండా చదవాలి. కానీ ఒక్క వ్యక్తి పోరాటం మాత్రం ఆశ్చర్యపరుస్తుంది. అతని మార్గం తెలిస్తే నిజమా అనిపిస్తుంది. రెండు కాళ్లు, చేయి లేని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సూరజ్ తివారీ అనే యువకుడు యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అతడి జీవితంలో చాలా విషాదం ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన సూరజ్ తివారీ 2017లో ఘజియాబాద్‌లో కదులుతున్న రైలు నుంచి పడి రెండు కాళ్లు, కుడి చేయి, ఎడమ చేతి రెండు వేళ్లను కోల్పోయాడు. రైలు ప్రమాదం తర్వాత సూరజ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా అతని సోదరుడు మే 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు.

సూరజ్‌కి జీవితం చీకటిగా మారింది. వేరేవాళ్లు అతడి స్థానంలో ఉంటే కచ్చితంగా కుంగిపోయేవారు. అప్పుటికే కాళ్లు, చేతులు పొగొట్టుకున్న తనకు.. అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేకపోయాడు. కానీ తర్వాత తన కుటుంబన్ని మంచి పొజిషన్ తీసుకెళ్లాలనుకున్నాడు. యూపీఎస్‌సీకి సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 917 ర్యాంక్ సాధించాడు.

కాలు కోల్పోయిన తర్వాత లేచి నడవడానికి మరొకరిపై ఆధారపడాల్సి వచ్చింది. కూర్చొని చదివే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. చక్రాల కుర్చీలో లైబ్రరీ చుట్టూ తిరగలేదు. గంటల తరబడి కూర్చొని పుస్తకాలు చదివేవాడు. రోజూ 15 గంటలకు పైగా చదివేవాడు.

అయితే అతడు మూడు వేళ్ల ద్వారా UPSC పరీక్ష రాశాడు. UPSCలో ప్రతి సెకను లెక్కించబడుతుంది. కానీ సూరజ్ పట్టు వదలకుండా నిర్ణీత సమయానికి పరీక్ష కోసం కష్టపడి సాధన చేశాడు. సూరజ్ తివారీ చాలా మంది ఆదర్శం. అన్ని ఉన్నా ఏమీ లేనట్టుగా చేసేవారు సూరజ్ జీవితాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు.

జీవితంలో ప్రతీ విషయంలో కంప్లైంట్స్ ఇచ్చేవారికి సూరజ్ జీవితం ఆదర్శం. కాళ్లు, చేతులు సరిగా లేకున్నా మెుదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడటం అంటే మాటలు కాదు. అతడి సంకల్ప బలం ముందు వైకల్యం చిన్నబోయింది. పొరబాట్లు, విమర్శలు.. ఇతర సమస్యలు అన్నీ గెలుపుకు మెట్లుగా భావించాలి. అప్పుడే ముందుకు సాగుతారు.

ఓపిక ఉన్నంత వరకూ కాదు.. ఊపిరి ఉన్నంత వరకూ పోరాడాలి.. ఓటమి నీ కాళ్ల దగ్గర.. గెలుపు నీ కళ్ల ముందు ఉండిపోతాయి.

Whats_app_banner