UPSC Civil Services 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా అప్లై చేయండి..
UPSC CSE 2024: 2024 సంవత్సర సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు నోటిఫికేషన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in ద్వారా ఆన్ లైన్ లో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు.
UPSC CSE 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2024) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ లో సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించవచ్చు. అనంతరం, upsconline.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెయ్యికి పైగా ఖాళీలు
సీఎస్ఈ 2024 ద్వారా యూపీఎస్సీ మొత్తం 1,056 పోస్ట్ లను భర్తీ చేయనుంది. వీటిలో 40 ఖాళీలను దివ్యాంగుల (PwBD) కోసం రిజర్వ్ చేశారు. వాటిలో 6 పోస్ట్ లు అంధత్వం, తక్కువ దృష్టి ఉన్న అభ్యర్థులకు, 12 పోస్ట్ లు చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికి; 9 పోస్ట్ లు సెరిబ్రల్ పాల్సీ, కుష్టువ్యాధి, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, 13 పోస్ట్ లు కండరాల డిస్ట్రోఫీ బాధితులకు కేటాయించారు.
లాస్ట్ డేట్
2024 సివిల్ సర్వీసెస్ పరీక్షకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ మార్చి 5. ఆ రోజు సాయంత్రం 6 గంటలలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ సివిల్స్ మూడు దశల్లో జరుగుతుంది. ముందుగా, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారు పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరవుతారు.
అర్హతలు..
సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ తదితర సర్వీస్ లతో పాటు కేంద్ర ప్రభుత్వ గ్రూప్ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి. ఇతర సేవల కోసం, భారత పౌరులు; నేపాల్ లేదా భూటాన్ పౌరులు; 1962 జనవరి 1కి ముందు శాశ్వతంగా స్థిరపడటానికి భారతదేశానికి వచ్చిన టిబెట్ శరణార్థులు; పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, తూర్పు ఆఫ్రికా దేశాలైన కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా, మలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం నుండి వలస వచ్చిన భారత సంతతికి చెందిన వ్యక్తులు భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు ఉండాలి. అలాగే, వారి వయస్సు 32 ఏళ్లకు మించకూడదు. అంటే 1991 ఆగస్టు 2 తరువాత, 2002 ఆగస్టు 1 ముందు జన్మించి ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇలా అప్లై చేయండి
- ఈ పరీక్షకు అప్లై చేసే అభ్యర్థులు ముందుగా upsc.gov.in. లేదా upsconline.nic.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- CSE 2024 registration లింక్ పై క్లిక్ చేయాలి.
- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియను పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.