Murder and Suicide: అనుమానంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త.. కడియంలో అనాథలైన చిన్నారులు
Murder and Suicide: కట్టుకున్న భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈ దారుణం జరిగింది.
Murder and Suicide: భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. దారుణంగా బ్లేడుతో గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. వారి ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. కడియం మండలం కడియపుసావరంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
డీఎస్పీ అంబికాప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడియపుసావరం వడ్డి వీరభద్రరావునగర్‌కు చెందిన దూళ్ల సూరిబాబుకు అదే గ్రామానికి చెందిన సత్యశ్రీ పదహారేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సూరిబాబు కౌలురైతుగా జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో సత్యశ్రీ ఎనిమిది నెలల క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. సంక్రాంతి పండగ నుంచి వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
తన భార్య సత్యశ్రీ ఇతరులతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని అత్తింటి వారికి సూరిబాబు ఫిర్యాదు చేశాడు. వారు ఇద్దరికీ సర్దిచెప్పి కాపురానికి పంపించారు. ఈ నెల 14న మరోసారి పిల్లలను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
అక్కడ గొడవ జరగడంతో సూరిబాబు పిల్లలను తీసుకుని తనింటికి వెళ్లిపోయాడు. కాపురానికి రమ్మని అడగడానికి గురువారం ఉదయం ఆరున్నర గంటలకు భార్య వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని భార్యను గ్రాఫ్టింగ్ బ్లేడుతో గొంతుకోసి వెళ్లిపోయాడు.
తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న సత్యశ్రీని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పిల్లలు తల్లిని లేపేందుకు చేసిన ప్రయత్నం అందరినీ కంట తడి పెట్టించింది. భర్త సూరిబాబే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
భార్యను హత్యచేసిన సూరిబాబు కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడియం మండలం మాధవరాయుడుపాలెం ప్రాంతంలోని పొలాల్లో విగతజీవిగా పడి ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కొనఊపిరితో ఉన్న సూరిబాబును చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దంపతుల కుమారుడు వెంకన్నబాబు కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా కుమార్తె వైష్ణవిశ్రీ స్థానిక పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. క్షణికావేశంలో సూరిబాబు భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. sa