Masala Oats: మసాలా ఓట్స్ ఒకసారి ఇలా వండి చూడండి, వారంలో అన్ని రోజులు తినేందుకు సిద్ధమైపోతారు
Masala Oats: ఓట్స్ తినడం వల్ల గుండెకు ఆరోగ్యం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ తో చేసిన ఆహారాలనే తింటారు. మసాలా ఓట్స్ రెసిపీ ఒకసారి తిని చూడండి. ఈ రెసిపీ కూడా చాలా సులువు.
Masala Oats: మసాలా ఓట్స్ అనేది దేశీ శైలిలో వండే వంటకం. దీనిలో ఎన్నో మసాలాలు కలుస్తాయి. దీనిలో మనకు నచ్చిన కూరగాయలతో పాటూ, ఆకుకూరలను కూడా వేసుకోవచ్చు. ఇది తాజాగా, టేస్టీగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ ఈ మసాలా ఓట్స్. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరోజు ఓట్స్ తో చేసిన ఆహారాలను తినమని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఒకసారి మీ ఇంట్లో మసాలా ఓట్స్ వండుకొని చూడండి. రుచి అదిరిపోతుంది.
మసాలా ఓట్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉల్లిపాయలు తరుగు - పావు కప్పు
టమోటోలు తరుగు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - అర స్పూను
క్యారెట్ల తరుగు - అరకప్పు
బీన్స్ తరుగు - పావు కప్పు
పచ్చి బఠానీలు - పావు కప్పు
అల్లం తరుగు - పావు స్పూను
వెల్లుల్లి తరుగు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఓట్స్ - ఒక కప్పు
పసుపు - పావు స్పూను
కారం - అర స్పూను
నూనె - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
మసాలా ఓట్స్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె లేదా నెయ్యిని వేయాలి.
2. అవి వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి.
3.అందులోనే ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి.
4. తర్వాత అల్లం వెల్లుల్లి తరుగును వేసి వేయించాలి. ఇవన్నీ రంగు మారేవరకు ఉంచాలి.
5. తర్వాత సన్నగా తరిగిన టమోటోలను వేసి కలుపుకోవాలి.
6. పైన రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి మూత పెట్టాలి.
7. టమోటాలు మెత్తగా అయ్యాక కారం, గరం మసాలా, పసుపు వేసి కలుపుకోవాలి.
8. ఇవన్నీ వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వేసి బాగా కలుపుకోవాలి.
9. మూత పెట్టి వాటిని బాగా ఉడకనివ్వాలి.
10. తర్వాత రెండు కప్పుల నీరు వేసి ఆ కూరగాయలు బాగా ఉడికే వరకు ఉంచాలి.
11. ఈ మిశ్రమమంతా కూరలా అయ్యాక ఓట్స్ లో వేసి చిన్న మంట మీద కలుపుకోవాలి.
12. మిరియాల పొడిని కూడా వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.
13. ఇది దగ్గరగా అయ్యాక పైన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే మసాలా ఓట్స్ రెడీ అయినట్టే. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వారమంతా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు.. ఈ మసాలా ఓట్స్ ను రెసిపీలో చేర్చుకుంటే మంచిది.
ఓట్స్ లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫాస్పరస్, ఐరన్, మాంగనీస్, జింక్ పాటు విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీ బరువును త్వరగా తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఓట్స్ ముందుంటాయి. కాబట్టే గుండె రక్షణ కోసం ఓట్స్ ను తినమని సిఫారసు చేస్తూ ఉంటారు. ఇది గ్లూటెన్ రహిత ధాన్యం. చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టే మధుమేహ రోగులు ఓట్స్ తరచూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా తింటే నాలికకు రుచిగా అనిపించదు. అందుకే ఒకసారి ఇలా మసాల ఓట్స్ వండుకొని చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
ఇక్కడ మనం వేసిన కూరగాయలే కాదు మీకు నచ్చిన కూరగాయలను ఈ మసాలా రెసిపీలో యాడ్ చేసుకోవచ్చు. పాలకూరతో పాటు కందిపప్పు, పెసరపప్పు వంటివి కూడా కలుపుకోవచ్చు. అవి కలిపినప్పుడు రుచి మరి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏడు రోజులు ఇలా ఓట్స్ తో డిఫరెంట్ రెసిపీలలో ప్రయత్నిస్తే ఆరోగ్యానికి మంచిది. పిల్లలకి కూడా ఈ మసాలా ఓట్స్ రెసిపీ నచ్చే అవకాశం ఉంది. ఒకసారి వారికి పెట్టి చూడండి.