Oats Dosa : ఇలా ఓట్స్ దోసె చేస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి
Oats Dosa Recipes : ఆరోగ్యంగా ఉండేందుకు ఓట్స్ తినడం కొందరికి అలవాటు. అయితే దీనితో దోసె చేసుకుని తింటే మాత్రం రుచి బాగుంటుంది.
ఓట్స్ ఆరోగ్యానికి మంచివి. కానీ ఎప్పుడూ వీటిని ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేయండి. ఇటు ఆరోగ్యంగా ఉంటారు.. అటు రుచి కూడా దొరుకుతుంది. ఓట్స్‌తో దోసెను తయారు చేయండి. చాలా ఈజీ. డైట్ చేసేవారికి ఇది ఇంకా ఉపయోగకరం. అల్పాహారంగా ఓట్స్ ను తీసుకునేవారు.. దోసె చేసుకుని ఇష్టంగా తినొచ్చు.
ఓట్ దోస తయారు చేయడం చాలా సులభం, చాలా రుచి కూడా దొరుకుతుంది. ప్రధానంగా ఇది రవ్వ దోసెను పోలి ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ ఓట్ దోసెతో కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఓట్ దోసెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. ఓట్ దోస రెసిపీ కింది విధంగా చేయాలి.
ఓట్స్ దోసెకు కావాల్సిన పదార్థాలు
1. ఓట్స్ - 1/2 కప్పు
2. ఉప్పు - రుచి ప్రకారం
3. జీలకర్ర - 1/2 tsp
4. బియ్యం పిండి - 1/4 కప్పు
5. రవ్వ- 1/4 కప్పు
6. సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2 టేబుల్ స్పూన్లు
7. కరివేపాకు - కొద్దిగా (తరిగినవి. )
8. కొత్తిమీర - కొద్దిగా (తరిగిన)
9. అల్లం తురిమినది - 1/2 tsp
10. పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగిన)
11. పెరుగు - 1/4 కప్పు
12. నీరు - అవసరమైనంత
ఓట్స్ దోసె తయారీ విధానం
ముందుగా ఓట్స్ ను మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలోకి రుబ్బిన ఓట్స్ పొడిని తీసుకుని అందులో జీలకర్ర, బియ్యప్పిండి, రవ్వ వేయాలి.
తర్వాత తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, అవసరమైన నీరు వేసి బాగా కలపాలి.
రవ్వ దోసె పిండిలా చేసుకోవాలి. తర్వాత పిండిని 10-15 నిమిషాలు నానబెట్టాలి.
ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌ను పొయ్యి మీద పెట్టి పెనం వేడి అయ్యాక అందులో కలిపిన పిండిని దోసెలా వేయాలి.
నూనె పోసి క్రిస్పీగా అయ్యాక దోసె తీసుకోవాలి. అంతే రుచికరమైన ఓట్ దోసెలు రెడీ.