Diwali 2024: దీపావళికి గోధుమపిండితో వందల కొద్దీ దీపాలు మీరే తయారు చేయొచ్చు.. ఈ మార్గాలూ ఉన్నాయ్-make diyas for diwali festival at home with wheat flour and more ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali 2024: దీపావళికి గోధుమపిండితో వందల కొద్దీ దీపాలు మీరే తయారు చేయొచ్చు.. ఈ మార్గాలూ ఉన్నాయ్

Diwali 2024: దీపావళికి గోధుమపిండితో వందల కొద్దీ దీపాలు మీరే తయారు చేయొచ్చు.. ఈ మార్గాలూ ఉన్నాయ్

Koutik Pranaya Sree HT Telugu
Oct 25, 2024 12:30 PM IST

Diwali 2024: దీపావళి అంటేనే దీపాల వెలుగులతో నిండిపోయే పండగ. ఈ పండగకు దీపాలు బయట కొనకుండా మీరే ఇంట్లో తయారు చేయొచ్చు. దానికోసం ఏమేం మార్గాలున్నాయో చూడండి.

దీపాల తయారీ
దీపాల తయారీ (PC: Canva)

దీపాల పండుగ దీపావళికి ఏర్పాట్లు మొదలైపోయి ఉంటాయి. దీపావళి అంటే గుర్తొచ్చేది టపాసులు, దీపాల వెలుగులు. దీపావళి పండుగ సంప్రదాయంలో భాగంగా దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఇది చీకటిపై వెలుగు సాధించిన విజయానికి సంకేతం. సాధారణంగా దీపావళి రోజు మట్టి దీపాలను వెలిగిస్తారు.

అయితే మీరే మీ చేతుల్తోనే మీ ఇంట్లో వెలిగించబోయే దీపాలు తయారు చేయొచ్చు. కాస్త ఓపిగ్గా కుటుంబం అంతా కలిసి కూర్చున్నారంటే ఎన్ని దీపాలైనా చేసేస్తారు. ఆ మార్గాలేంటో చూసేయండి. ఖర్చు కూడా తక్కువే.

గోధుమపిండితో దీపాలు:

గోధుమపిండితో దీపాల తయారీ కోసం గోధుమ పిండి - 1 కప్పు, నీరు, నూనె - 1 టేబుల్ స్పూన్, కాటన్ క్లాత్ లేదా పత్తి (వత్తి తయారు చేయడానికి), దీపాన్ని అలంకరించడానికి అవసరమైన పదార్థాలు - పెయింట్, పూసలు, స్ప్రే, పూల రేకులు, ఫుడ్ కలర్ లాంటివి అవసరం

గోధుమ పిండి దీపం తయారీ:

1. వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి వేసుకోండి. అందులో కొద్దిగా నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోండి. పిండి గట్టిగా ముద్దలా అవ్వాలి. చేయికి అంటుకోకూడదు. చివరగా చెంచా నూనె వేసి బాగా కలుపుకోవాలి. నూనె వేయడం వల్ల దీపాలు చేశాక పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

2. ఇప్పుడు చిన్న పిండి ముద్ద తీసుకుని గుండ్రంగా చేసుకోండి. మధ్యలో వేలితో గుంత లాగా నొక్కండి. చుట్టూ అంచులను చేత్తో ఒత్తుతూ మీకిష్టమైన ఆకారంలోకి తీసుకురండి. డిజైన్ కోసం టూత్ పిక్, అగ్గిపుల్ల వాడండి. ఇలా చేసిన దీపాలను ఫ్యాన్ గాలి కింద రెండ్రోజులు ఆరబెట్టండి. ఎండలో మాత్రం పెడితే దీపాలు విరిగిపోతాయని గుర్తుంచుకోండి.

3. దీపాలు ఆరిన తర్వాత ఫుడ్ కలర్, పూసలతో అలంకరించుకోవచ్చు.సహజ పద్దతుల ద్వారా పెయింటింగ్ వేయాలనుకునే వారు బీట్ రూట్ జ్యూస్, పసుపు కూడా వాడవచ్చు.అయితే కేవలం దీపం బయటి వైపు మాత్రమే అలంకరణలు, రంగులు వేయండి.

4. అలంకరణ పూర్తయిన తర్వాత కాటన్ క్లాత్ లేదా కాటన్ బాల్ సహాయంతో ఒక వత్తిని తయారు చేయండి. దీపంలో ఉంచి నూనె వేసి దీపావళి రోజున దీపం వెలిగించేయండి.

మరో విధంగా:

మరింత కళాత్మకంగా చేద్దాం అనుకుంటే బయట ఎయిర్ డ్రై క్లే దొరుకుతుంది. దాంతోనూ దీపాలు చక్కగా తయారు చేసేయొచ్చు. అలాగే ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే వాటిని కాస్త మంచి ఆకారంలోకి వచ్చేలా చేయండి. తర్వాత మంచి రంగులు వేసి అందులో మైనం లేదా క్యాండిల్ పెట్టి దీపంలాగా వెలిగించేయొచ్చు.

Whats_app_banner