Diwali 2024: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? ఏ నూనెతో వెలిగిస్తే సిరిసంపదకు లోటు ఉండదు
Diwali 2024: దీపావళి రోజు తప్పనిసరిగా అందరూ తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. అయితే అది సంప్రదాయ బద్ధంగా ఉండాలని ఎలా పడితే అలా దీపాలు వెలిగించకూడదని పండితులు సూచిస్తున్నారు. ఎన్ని దీపాలు వెలిగించాలి? ఏ నూనెతో దీపం వెలిగిస్తే మంచిది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తూ దీపావళి పండుగ జరుపుకుంటారు. అమావాస్య చీకటిని పారద్రోలుతూ తమ జీవితాల్లోకి వెలుగులు తీసుకురావాలని దీపావళి రోజు ఇల్లు మొత్తం దీపాలు వెలిగిస్తారు. దీపం ఉన్న ప్రదేశం ప్రకాశవంతం చేయడమే కాకుండా ఇంట్లోని ప్రతికూలతలను తరిమికొడుతుంది.
దీపావళి రోజు కేవలం గుమ్మం దగ్గర, పూజ గదిలో కాకుండా ఇతర ప్రదేశాల్లోనూ దీపాలు పెట్టడం వల్ల ఇంటికి శ్రేయసు, సంపద వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరం లేదా ఈశాన్య దిశలో దీపం వెలిగిస్తే ఇంటికి సంపద చేకూరుతుంది. అలాగే మెరుగైన ఆరోగ్యం కోసం తూర్పు దిశలో దీపం వెలిగించాలి. ఇది నెగటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది. వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.
దీపావళి రోజు లక్ష్మీ పూజ అనంతరం రాత్రంతా దీపం వెలిగేలా అఖండ జ్యోతి వెలిగిస్తే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఇంటికి దీపాలు కేవలం అలంకరణ మాత్రమే కాదు సానుకూల శక్తిని ఇస్తుంది. దీపం వెలిగించడమే కాదు దీపం పెట్టేందుకు వినియోగించే వస్తువు కూడా దీని మీద ప్రభావం చూపుతుంది. దీపావళి వేళ ఎక్కువగా మట్టి ప్రమిదలు వెలిగిస్తారు. ఇవి సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి. ప్రతికూలతను దూరం చేస్తాయి. ఇత్తడి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు.
ఇంట్లో ఏ మూల ఏ రంగు దీపం వెలిగించాలి?
సంతోషకరమైన వాతావరణం కావాలనుకుంటే మీరు ఇంట్లో ఈ రంగుల దీపాలు వెలిగించండి. ఇల్లు ప్రశాంతతతో నిండిపోతుంది. ఉత్తరం వైపు నీలం, తూర్పున ఆకుపచ్చ, దక్షిణాన ఎరుపు, పశ్చిమాన ముదురు నీలం, ఆగ్నేయంలో నారింజ వంటి రంగు దీపాలతో ఇంటని అలంకరించుకోవచ్చు. ఆవుపాలతో చేసిన నెయ్యిని దీపం వెలిగించేందుకు ఉపయోగించడం మంచిది.
ఏ నూనెతో దీపం వెలిగించాలి?
దీపావళి రోజు మీరు వెలిగించే దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించడం శ్రేయస్కరం. ఇలా చేస్తే ఆ ఇంటి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. అలాగే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. దీపాలు బేసి సంఖ్యలో వెలిగించాలి. కనీసం ఐదు దీపాలు అయినా పెట్టుకోవాలని చెప్తారు.
ఇవి కాకుండా డబ్బు నిల్వ చేస్తే ప్రదేశం, పూజ గది, తులసి మొక్క దగ్గర, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం మరచిపోవద్దు. చాలా మంది దీపావళికి 13 దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని కూడా అనుసరిస్తారు. ఇంట్లోని ఒక్కో ప్రదేశంలో దీపం పెడతారు. ఇలా చేయడం వల్ల ఇల్లు అందంగా కనిపించడమే కాదు సానుకూల శక్తి ఇల్లు మొత్తం ప్రసరిస్తుందని నమ్ముతారు. పదమూడు దీపాలు వెలిగించడం వల్ల ఇల్లు సిరిసంపదలు, అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని విశ్వసిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.