Kidney disease symptoms: మీ కిడ్నీలకు మీరే బాధ్యులు.. లైఫ్ స్టైల్ మారాల్సిందే
Kidney disease symptoms: మన దేశంలో కిడ్నీ వ్యాధులు ఉన్నట్టు ఉన్న వారిలో 10 శాతం మందికి కూడా తెలియదు. లక్షణాలు గుర్తించి నివారణ చర్యలు చేపడితే మీ విలువైన జీవితాన్ని కాపాడుకోవచ్చు.
కిడ్నీ వ్యాధులు పెరగడానికి లైఫ్‌స్టైల్ అతిముఖ్య కారణంగా కనిపిస్తోంది. వాటి లక్షణాలు అర్థం చేసుకుని నివారణ చర్యలు చేపట్టకపోతే విలువైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఉరుకులు పరుగుల జీవితం, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, కదలిక లేని ఉద్యోగాలు, పెరుగుతున్న ఒత్తిడి స్థాయి క్రమంగా యువతలోనూ అనారోగ్యాలకు దారితీస్తోంది.
తగినంత నిద్ర లేకపోవడం, పొగ తాగడం, మద్యపానం, ఊబకాయం వంటివన్నీ ఇప్పటికే ఉన్న అనారోగ్యాలకు తోడవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో దొరికే పెయిన్ కిల్లర్స్ వాడడం వంటివన్నీ ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీస్తున్నాయి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. కిడ్నీ వ్యాధి బారిన పడిన వారిలో కేవలం 10 శాతం మందికే తమకు కిడ్నీ జబ్బు ఉందని తెలుసు. ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైన అంశం.
లైఫ్‌స్టైల్ కారకాలే కిడ్నీ సమస్యలకు మూలం
కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు చివరి దశ వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. పైగా వీటి గురించి మనకు అవగాహన కూడా ఉండదు. కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ హాస్పిటల్‌లో నెఫ్రాలజీ హెడ్ డాక్టర్ శరద్ సేఠ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కిడ్నీ వ్యాధులకు ముఖ్య కారణాల్లో ఒకటి. ముఖ్యంగా ఉప్పు, చక్కెర, శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా తీసుకుంటే కిడ్నీ వ్యాధులు వస్తాయి. ఇలాంటి డైట్ హైబీపీకి దారితీస్తుంది. అది కిడ్నీ వ్యాధిని తెచ్చి పెట్టే ముప్పు కలిగిన కారకం..’ అని వివరించారు.
‘కిడ్నీ వ్యాధికి మరొక జీవనశైలి కారకం ఏంటంటే పొగ తాగడం. స్మోకింగ్ కిడ్నీ వ్యాదులను తెచ్చి పెట్టడమే కాకుండా కిడ్నీ తన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చేస్తుంది. స్మోకింగ్ కిడ్నీలలోని రక్త నాళాలను డామేజ్ చేస్తుంది. ఈ కారణంగా కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలు రక్తం నుంచి మలినాలను శుద్ధి చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతాయి. శారీరకంగా చురుగ్గా లేకపోవడం కూడా కిడ్నీ వ్యాధులకు మరొక కారకం. చురుగ్గా లేకపోతే ఊబకాయం వస్తుంది. హైబీపీ, టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధులకు కారకాలే. అందువల్ల క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గడపడం ముఖ్యం..’ అని ఆయన వివరించారు.
Symptoms of kidney disease: కిడ్నీ వ్యాధి లక్షణాలు
‘కిడ్నీ వ్యాధి దశను బట్టి లక్షణాలు కనిపిస్తాయి. తొలినాళ్లలో లక్షణాలు ఏవీ కనిపించవు. వ్యాధి ముదురుతున్న కొద్దీ అలసట, నీరసం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లలో వాపు, మడమల్లో వాపు, పాదాల్లో వాపు, మూత్ర విసర్జన తీరులో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి..’ అని డాక్టర్ శరద్ సేఠ్ వివరించారు.
పీడీ హిందూజా హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నెఫ్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ నేహా పూణాటర్ కిడ్నీ వ్యాధి లక్షణాలు వివరించారు.
- తీవ్రంగా అలసిపోవడం
- నిద్ర లేకపోవడం
- చర్మం దురద, పొడి బారడం
- తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం
- మూత్రం పూర్తిగా విసర్జించలేకపోవడం
- మూత్రంలో రక్తం రావడం
- కళ్ల చుట్టూ ఉబ్బడం
- పాదాలు ఉబ్బడం
- ఆకలి లేకపోవడం
- వాంతి, వికారం
- కండరాలు పట్టేయడం, తీవ్రమైన నొప్పులు రావడం
- శ్వాస ఆడకపోవడం
Prevention tips: కిడ్నీ వ్యాధి నివారణ చర్యలు
‘కిడ్నీ వ్యాధుల నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయడం, పొగ మానేయడం, హైబీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం అవసరం. ఎల్ల వేళలా తగినంత నీరు తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్న వారికి ఇది తీప్పనిసరి.. ’ అని డాక్టర్ శరద్ వివరించారు.
కిడ్నీ వ్యాధుల నివారణకు డాక్టర్ నేహా సూచనలు
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణ ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉప్పు, చక్కెర తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అస్సలే వద్దు. కొవ్వులు తగ్గించేయాలి.
- మీ రోజువారీ కార్యకలాపాల్లో వ్యాయామం భాగం కావాలి. కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాలి.
- బరువును అదుపులో పెట్టుకోవాలి. ఊబకాయం వచ్చే వరకు చూడొద్దు.
- కచ్చితంగా రోజూ ఏడెనిమిది గంటలు నిద్ర పోవాలి
- పొగ వెంటనే మానేయాలి
- మద్యపానం మితం చేయాలి
- ఒత్తిడి తగ్గించే మార్గాలను అన్వేషించాలి. యోగా, ధ్యానం వంటి పరిష్కారాలను ఆచరించాలి.
- శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలి.
- రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండాలి. అలాగే బీపీ నియంత్రణలో ఉండాలి.
- మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ కొని వాడరాదు.
- తరచూ రక్త పరీక్షలు చేయించాలి. సీరం క్రియాటినైన్, యూరిన్ స్పాట్ అల్బమిన్ టు క్రియాటినిన్ రేషియో వంటివి కిడ్నీ వ్యాధులను నిర్ధారించేందుకు సాయపడతాయి.
- డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాగే 60 ఏళ్లు పైబడిన వారు, ఊబకాయం ఉన్న వారు, గుండె, కాలేయం జబ్బులు ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారు కుటుంబంలో ఉన్నప్పుడు కనీసం ఏడాదికోసారి రక్త పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ స్టోన్స్ ఏర్పడినా, ప్రొస్ట్రేట్ సమస్యలు ఉన్నా, దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి.