Kidney stones symptoms: కిడ్నీ స్టోన్స్ సంకేతాలు, చికిత్సపై వైద్యుల మాట ఇదీ
Kidney stones symptoms: కిడ్నీ స్టోన్స్ కారణాలు, సంకేతాలు, లక్షణాలు, చికిత్సపై వైద్యుల మాట ఇదీ..
కిడ్నీలోపలు ఖనిజ లవణాలు, ఘన పదార్థాలు రాళ్ల రూపంలో ఏర్పడతాయి. మూత్రం గట్టి పడి లవణాలు స్ఫటికాకారంలోకి మారుతాయి. ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం లేదా నీరు తక్కువగా తాగడం కారణంగా కిడ్నీ స్టోన్స్ ఏర్పడొచ్చు. రాళ్లు ఎక్కువగా మూత్ర పిండాల్లో గానీ, మూత్రాశయంలో గానీ ఏర్పడతాయి. రాళ్లు పెదవుతున్న కొద్దీ సమస్యాత్మకంగా మారుతాయి. నొప్పి తీవ్రమవుతుంది. కిడ్నీ స్టోన్స్ కూడా ఇతర జీవనశైలి వ్యాధుల లాంటివే. చురుకైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, తులసి, ఆకు కూరలు, యాపిల్స్, గ్రేప్స్ వంటి ఆహారం తీసుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు.
‘కరిగి ఉన్న ఖనిజ లవణాలు కిడ్నీల్లో ఘనీభవించి స్టోన్స్‌గా ఏర్పడతాయి. అవి మూత్రనాళంలోకి చేరి అక్కడ సమస్యలు సృష్టిస్తాయి. తక్కువగా నీరు తాగడం, ఆహారం సక్రమంగా లేకపోవడం, వారి వారి ఇతర అనారోగ్య కారణాలు వంటి వాటి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది..’ అని ప్రిస్టిన్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ పుష్కర్ వివరించారు.
Types of kidney stones: కిడ్నీ స్టోన్స్‌లో రకాలు
‘కిడ్నీ స్టోన్స్‌లో చిన్నవి, పెద్దవి ఉంటాయి. చిన్నవి ఉన్నప్పుడు మనం గమనించలేం. అవి మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. పెద్దవైతేనే సమస్యలు సృష్టిస్తాయి..’ అని డాక్టర్ ప్రవీణ్ వివరించారు. ‘ఒక్కోసారి గోల్ఫ్ సైజ్‌లో కూడా పెరుగుతాయి. కొద్ది వారాలు, నెలల సమయంలో అలా పెద్దవవుతుంటాయి. కాల్షియం స్టోన్స్ చాలా సాధారణ రకం. పెద్ద స్టోన్స్ చాలా నొప్పిని కలిగిస్తాయి.. అవి మూత్రం ద్వారా వెళ్లిపోవు..’ అని వివరించారు.
Symptoms of kidney stones: కిడ్నీ స్టోన్స్ లక్షణాలు
‘చిన్న స్టోన్స్ తక్కువ లేదా నొప్పి లేకుండా శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. మూత్ర నాళంలో పెద్ద రాళ్ళు చిక్కుకుపోవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి ప్రారంభమవుతుంది. సాధారణంగా మీ పొత్తికడుపు లేదా మీ వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది. మూత్రం రంగు మారడం, మీ మూత్రంలో రక్తం రావడం, జ్వరం, చలి, వికారం, వాంతులు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు పెద్ద రాయి కదలడానికి వీల్లేక మూత్ర విసర్జన ఇబ్బంది అవుతుంది. ఈ కారణంగా ఒకటి లేదా రెండు కిడ్నీలు ఉబ్బి పక్క వైపు, వీపు భాగంలో నొప్పికి కారణమవుతాయి. దీనికి చికిత్స చేయకపోతే, భవిష్యత్తులో మూత్రపిండాలు దెబ్బతింటాయి’ అని డాక్టర్ ప్రవీణ్ చెప్పారు.
Reasons for kidney stone: కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణాలు
సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ వయోజనుల్లో వస్తాయి. కొన్నిసార్లు చిన్న పిల్లలు, టేనేజర్లలో కూడా ఈ సమస్య వస్తుంది. ఒబెసిటీ, డయాబెటిస్, మెటబాలిక్ డిజార్డర్ ఉన్నప్పుడు ఈ పరిస్థితి రావొచ్చు. మూత్ర నాళం ఏర్పడిన తీరు, మీరు తీసుకున్న ఆహారం వంటి అంశాలు కూడా ఇందుకు దోహదపడతాయి. ‘అతిగా ఉప్పు తినడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి..’ అని డాక్టర్ ప్రవీణ్ చెప్పారు.
Diagnosis for kidney stones: ఏయే పరీక్షలు నిర్వహిస్తారు..
మీ వైద్యులు భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు. రక్త పరీక్షలు కూడా అవసరమవ్వొచ్చు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. సీటీ స్కాన్ కూడా అవసరమవ్వొచ్చు. ఆయా పరీక్షలు మెరుగైన చికిత్సకు అవసరమవుతాయి.
Treatment of kidney stones: కిడ్నీ స్టోన్స్‌కు చికిత్స
కిడ్నీ స్టోన్ పరిమాణాన్ని, లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. స్టోన్స్ బయటకు తీసుకురావడానికి ఎక్కువ పరిమాణంలో మూత్రం విసర్జన అవసరమవుతుంది. వైద్యులు నీరు ఎక్కువ తాగాలని సిఫారసు చేస్తారు. అలాగే కిడ్నీ స్టోన్ బయటకు వచ్చినప్పుడు వచ్చే నొప్పిని భరించేందుకు ఔషధాలు కూడా ఇస్తారని డాక్టర్ ప్రవీణ్ చెప్పారు. ఉప్పు, సోడా తీసుకోవద్దని సూచిస్తారని, రాళ్లు వెళ్లిపోవడానికి వీలు ఆల్ఫా బ్లాకర్స్ కూడా సిఫారసు చేస్తారని డాక్టర్ చెప్పారు.
రాళ్లు పెదగ్గా ఉన్నప్పుడు, ఇంకా పెరుగుతున్నప్పుడు, మూత్ర ప్రవాహాన్ని ఆపుతున్నప్పుడు సర్జరీ లేదా ఇతర చికిత్సలు అవసరమవ్వొచ్చని డాక్టర్ ప్రవీణ్ చెప్పారు. పెద్ద రాళ్లు ఉణ్నప్పుడు అవి కిడ్నీలను దెబ్బ తీస్తాయని, అందువల్ల వాటిని చిన్న రాళ్లుగా పగలగొట్టే ప్రక్రియను అవలంబిస్తారని చెప్పారు. అలా చేసినప్పుడు వాటంతట అవే వెళ్లి పోవడం గానీ, సర్జరీ ద్వారా తీసివేయడం గానీ చేస్తారని డాక్టర్ తెలిపారు.
Ways to prevent kidney stone: కిడ్నీ స్టోన్స్ నివారణకు మార్గాలు
కిడ్నీ స్టోన్స్ సర్వ సాధారణం. తగినంత నీరు తీసుకోకపోవడం ప్రధానమైన కారణం. ఆహార అలవాట్లు, ఒబెసిటీ, కదలిక లేని జీవన శైలి కూడా కారణాలే.
‘మీ ఆహారంలో తులసి, ఆకు కూరలు, యాపిల్స్, గ్రేప్స్ తీసుకోవాలి. అవి కిడ్నీలను కాపాడుతాయి. కిడ్నీ స్టోన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్న వారు వైద్యుడిని సంప్రదించి సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలి..’ అని డాక్టర్ ప్రవీణ్ వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్