Koraishutir Kochuri | కోరైషుటిర్ కొచూరి.. గొప్ప టేస్ట్, చలికాలంలో ఇది పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!-koraishutir kochuri a perfect winter breakfast to keep you warm in the cold season check recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Koraishutir Kochuri | కోరైషుటిర్ కొచూరి.. గొప్ప టేస్ట్, చలికాలంలో ఇది పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

Koraishutir Kochuri | కోరైషుటిర్ కొచూరి.. గొప్ప టేస్ట్, చలికాలంలో ఇది పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 07:45 AM IST

Koraishutir Kochuri Recipe: చలికాలంలో చల్లటి చలిని ఎదుర్కోవడానికి ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయండి. వేడివేడిగా, రుచికరంగా ఉండే కోరైషుటిర్ కొచూరి రెసిపీ ఇక్కడ ఉంది ట్రై చేయండి.

Koraishutir Kochuri Recipe
Koraishutir Kochuri Recipe (Slurrp)

చలికాలం సీజన్‌లో కొన్నికొన్ని రోజుల్లో చలి విపరీతంగా ఉంటుంది. శీతల గాలులకు శరీరం వణికిపోతుంది, చేతులతో ఏది పట్టుకోలేకపోతాము. ఇలాంటి సమయాల్లో వేడివేడిగా ఏదైనా తింటుంటే, తాగుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే ఈ చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ల కోసం చూస్తున్నట్లయితే ఒక రెసిపీ గురించి మీరు తెలుసుకోవాలి.

ఆ రెసిపీ పేరు కోరైషుటిర్ కొచూరి (Koraishutir Kochuri). పేరు చూసి ఇదేదో కొరియన్ వంటకం అనుకోకండి. ఇది సాంప్రదాయ భారతీయ వంటకమే. ఇది బెంగాలీల పాపులర్ బ్రేక్‌ఫాస్ట్. బెంగాలీలు శీతాకాలపు చలిని తట్టుకునేందుకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో, సాయంత్రం అల్పాహారంగా కోరైషుటిర్ కొచూరి తినడానికే ఇష్టపడతారు.

ఈ కోరైషుటిర్ కొచూరి అంటే మరేమిటో కాదు, దీని అర్థం బఠానీ కచోరి. ఇది చూడటానికి పూరీలా ఉంటుంది, తింటుంటే సమోసాలాగా ఉంటుంది. పూరీలాంటి సమోసా అన్నమాట. కోరైషుటిర్ కొచూరి తయారీకి పూరీల లాగా పిండి చేసుకోవాలి, సమోసాలాగా లోపల స్టఫింగ్ చేసుకోవాలి. రెండూ కలిపి ఫ్రై చేసుకోవాలి. కోరైషుటిర్ కొచూరి మీరు ఓ సారి రుచి చూడాలంటే ఇక్కడ దాని రెసిపీ ఉంది చూడండి.

Koraishutir Kochuri Recipe కోసం కావలసినవి

స్టఫింగ్ కోసం:

  • 1½ కప్పు పచ్చి బఠానీలు
  • 1 అంగుళం అల్లం
  • 1 టీస్పూన్ ఫెన్నెల్ విత్తనాలు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1½ టీస్పూన్ జీలకర్ర రోస్ట్ పొడి
  • 1/2 టీస్పూన్ కారం
  • 2 టేబుల్ స్పూన్లు కూరగాయల నూనె
  • చిటికెడు ఇంగువ
  • రుచికి తగినంత ఉప్పు

కచోరీ పూరీ పిండి కోసం

  • 3 కప్పులు మైదాపిండి
  • 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
  • రుచికి ఉప్పు
  • పిండిని పిసికి కలుపుటకు నీరు
  • డీప్ ఫ్రై కోసం నూనె

కోరైషుటిర్ కొచూరి తయారీ విధానం

  1. ముందుగా మైదాపిండి, నెయ్యి, ఉప్పు, కొంచెం నూనె అలాగే నీటిని కలిపి మెత్తటి పిండి ముద్దను సిద్ధం చేయండి. పిండి ఆరిపోకుండా తడిగా గుడ్డతో కప్పండి, ఓ పక్కకు పెట్టండి, ఇప్పుడు స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి.
  2. పచ్చి బఠానీలు, అల్లం, పచ్చిమిర్చి అన్ని గ్రైండర్‌లో వేసి ముతక పేస్ట్‌లా చేసుకోవాలి.
  3. ఇప్పుడు మూకుడులో నూనె వేడిచేసి, అందులో సోంఫ్ విత్తనాలు, ఇంగువ వేసి చిటపటలాడించాలి.
  4. అనంతరం ఇంతకు ముందు చేసుకున్న పచ్చిబఠానీ పేస్ట్‌ను వేసి వేయించాలి.
  5. తరువాత ఉప్పు, కారం సహా మిగతా సుగంధ దినుసులు, పొడులు వేసి అన్నింటిని బాగా కలపండి.
  6. మిశ్రమం కొద్దిగా పొడిగా మారిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి చల్లబరచండి.
  7. ఇప్పుడు పిండి ముద్దను నిమ్మకాయ సైజులో తీసుకొని, అందులో ఈ మిశ్రమం స్టఫ్ చేసి సర్కిల్‌లా రోల్ చేయండి, సరిగా సీల్ చేయండి.
  8. ఆపై వీటిని పూరీలు వేయించినట్లుగా నూనెలో వేయించుకుంటే కోరైషుటిర్ కొచూరీలు రెడీ అయినట్లే.

ఆలూ కర్రీ లేదా మీకు నచ్చిన గ్రేవీ కరీతో తింటూ కోరైషుటిర్ కొచూరీల రుచిని ఆస్వాదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం