Oats Uttapam Recipe । ఓట్స్ ఊతప్పం.. ఆదివారం రోజు ఒక ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్!
Oats Uttapam Recipe: రెగ్యులర్‌గా తినే ఊతప్పంకు భిన్నంగా, మరింత ఆరోగ్యకరమైన ఓట్స్ ఊతప్పం రెసిపీ ఇక్కడ ఉంది. మీరు ఓ సారి ప్రయత్నించి చూడండి.
వీకెండ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, అందులోనూ ఈరోజు ఆదివారం, మధ్యాహ్నం విందు భోజనాలు ఎక్కువ చేస్తారు. మరి కడుపును కాస్తైనా ఖాళీగా ఉంచితేనే, మీరు తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మళ్లీ సోమవారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ ఉదయానికి తేలికైన అల్పాహారంను పరిచయం చేస్తున్నాం. ఇక్కడ ఓట్స్ ఊతప్పం రెసిపీని అందిస్తున్నాం.
మీరు ఊతప్పం తినే ఉంటారు, కానీ ఈ రెసిపీ మీరు రెగ్యులర్‌గా తినే ఊతప్పంకు భిన్నంగా ఉంటుంది. అంతేకాదు ఇది చాలా త్వరగా చేసుకోగలిగే ఇన్‌స్టంట్ రెసిపీ. ఓట్స్, రవ్వ, మీకు నచ్చిన కూరగాయలను కలిపి రుచికరంగా చేసుకోవచ్చు. ఈ ఓట్స్ ఊతప్పం ఎంతో ఆరోగ్యకరమైనది, ఎందుకంటే ఇది తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్. మరి ఈ ఇన్‌స్టంట్ ఓట్స్ ఊతప్పంను ఎలా తయారు చేసుకోవాలి, ఏమేం కావాలో తెలుసుకోవాలనుకుంటే, కింద ఓట్స్ ఊతప్పం రెసిపీ కోసం అందించిన సూచనలు చదవండి.
Oats Uttapam Recipe కోసం కావలసినవి
- 250 గ్రాముల ఓట్స్
- 1/2 కప్పు రవ్వ
- 1/2 కప్పు పుల్లని పెరుగు
- 2 టీస్పూన్లు అల్లం పేస్ట్
- 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా
- 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి
- 1 కప్పు క్యాప్సికమ్, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు
- 2 చిన్న పచ్చి మిరపకాయలు
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
- రుచికి తగినంత ఉప్పు
- ఊతప్పం కాల్చడానికి నూనె
ఓట్స్ ఊతప్పం తయారీ విధానం
- ముందుగా ఓట్స్‌ను గ్రైండర్‌లో వేసి, దానిని పిండిలాగా మార్చండి.
- ఇప్పుడు ఓట్స్ పిండిలో రవ్వ, ఉప్పు, మిరియాల పొడి, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపండి.
- ఇప్పుడు పుల్లని పెరుగు కలపండి, పెరుగు పుల్లగా లేకపోతే కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలుపుకోండి.
- ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకొని, గిన్నెను కవర్ చేసి 20-30 నిమిషాలు పక్కనపెట్టండి.
- అరగంట తర్వాత బ్యాటర్ తయారవుతుంది, నీరు అడ్జస్ట్ చేసుకోండి. బేకింగ్ సోడా వేసి కలపండి.
- ఇప్పుడు ప్యాన్ వేడి చేసి, ఒక టీస్పూన్ నూనె చిలకరించి, వేడయ్యాక గుండ్రటి మందమైన దోశలాగా వేసుకోండి.
- పైనుంచి కూరగాయ ముక్కలు చల్లుకోండి, మీడియం మంట మీద ఉడికించుకోండి.
- కింద గోధుమ రంగులోకి మారాక, మరొక వైపు తిప్పి 2 నిమిషాలు కాల్చండి.
అంతే, ఓట్స్ ఊతప్పం రెడీ. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో ఓట్స్ ఉత్తపమ్‌ను సర్వ్ చేయండి.
సంబంధిత కథనం