Uthappam Pizza । పిజ్జా స్టైల్‌లో ఉతప్పం.. ఉతప్పం పిజ్జా ఇలా చేసేయండి!
పిల్లలకు ఏదైనా తినిపించాలంటే వారిని మాయ చేయాలి. పిజ్జా అని చెప్పి ఉతప్పం, బాదంతో నిండిన చాక్లెట్ తినిపించండి. Uthappam Pizza అలాగే Choco Almond Muffin రెసిపీలు ఇక్కడ ఉన్నాయి, చూడండి.
ఇంట్లో ఎంత శుభ్రంగా, ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలు సిద్ధం చేసినా పిల్లలు వాటిని తినేందుకు మారాం చేస్తారు. అదే సమయంలో బయట లభించే చిరుతిళ్లను మాత్రం ఇష్టంగా తింటారు. ఈరోజు పిల్లలకు ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈరోజు బాలల దినోత్సవం. ఈ సందర్భంగా వారికోసం ప్రత్యేకంగా ఏదైనా రెసిపీ సిద్ధం చేయాలని చూస్తుంటే మీకు ఇక్కడ కొన్ని ఐడియాలను అందిస్తున్నాం.
మీకు ఉతప్పం అనేది ఇష్టమైన అల్పాహారం కానీ, పిల్లలకు పిజ్జా నచ్చుతుంది. ఇలాంటపుడు ఉతప్పంనే పిజ్జాలా మార్చి, ఉతప్పం పిజ్జా తయారు చేస్తే ఎలా ఉంటుంది? పోలా.. అదిరిపోలా!
అలాగే పిల్లలు చాక్లెట్, చీజ్ మొదలైన ఫ్లేవర్లను, రంగురంగులుగా ఉండే వంటకాలను ఇష్టపడతారు. వారికి చూపుకు నచ్చేలా ఉంటే చాలు ఏదైనా తినడానికి ఇష్టపడతారు. అందుకే వారు కోరిన విధంగా రుచికరంగా చేయండి. పోషకాలు, విటమిన్‌లతో నిండిన ఈ ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసి వారిని ఆనందపరచండి.
ముందుగా ఉతప్పం పిజ్జా రెసిపీని చూద్దాం. ఇందుకు కావలసిన సామాగ్రి, తయారీ విధానం తెలుసుకోండి.
Uthappam Pizza Recipe కోసం కావలసినవి:
- ఇడ్లీ దోశ పిండి - 2 కప్పులు
- ఆలివ్ ఆయిల్ - 2-3 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ - 1 చిన్నది
- స్వీట్ కార్న్ - 2 టేబుల్ స్పూన్లు
- క్యాప్సికమ్ - 1
- టొమాటో - 1/2
- రుచికి ఉప్పు
- నల్ల మిరియాలు - 1/2 tsp
- చిల్లీ ఫ్లేక్స్ - రుచి ప్రకారం
- ఒరేగానో - రుచి ప్రకారం
- పిజ్జా సాస్ - 1 కప్పు
- పిజ్జా చీజ్ - 1 కప్పు
ఉతప్పం పిజ్జా రెసిపీ - తయారీ విధానం
- ముందుగా పాన్‌పై ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను వేడి చేయండి. పాన్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసి వేయించండి.
- ఆపై పైన పేర్కొన్న మిగతా వెజిటెబుల్స్ వేసి 2 నిమిషాల పాటు ఎక్కువ మంట మీద వేయించండి.
- ఇప్పుడు ఉప్పు, నల్ల మిరియాలు, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ చల్లండి. మిక్స్ చేయండి, ఆ వెంటనే చల్లార్చండి, పక్కనపెట్టండి.
- ఇప్పుడు అదే పాన్‌లో గరిటె నిండా ఇడ్లీ దోశ పిండిని పోసి ఉత్తపం లాగా మందంగా చేసుకోవాలి. మూతపెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. మంటను ఆపివేయండి.
- ఇప్పుడు ఉతప్పంను మరోవైపు తిప్పి పిజ్జా సాస్ వేసి, విస్తరించండి. వెజిటెబుల్స్ మిశ్రమాన్ని వేసి పరచండి.
- పైనుంచి కొంచెం ఆలివ్ ఆయిల్‌ని స్ప్రెడ్ చేసి మూతపెట్టి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి.
అంతే, ఉతప్పం పిజ్జా రెడీ. వేడివేడిగా పిజ్జా అని చెప్పి మీ పిల్లలాకు తినిపించండి.
Choco Almond Muffin Recipe కోసం కావలసినవి:
కోకో పౌడర్ 4 టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు
బాదం 10-12 తరిగినవి
గుడ్లు 4
చక్కెర 1 కప్పు
మైదా పిండి 3 టేబుల్ స్పూన్లు
వెన్న 4 టేబుల్ స్పూన్లు కరిగింది
చాకో బాదాం మఫిన్స్ తయారీ విధానం
1. ఓవెన్‌ను 180ºC వరకు వేడి చేయండి. మరోవైపు ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టండి. పంచదార వేసి నురుగు వచ్చేవరకు హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేయాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో శుద్ధి చేసిన పిండి, కోకో పౌడర్, చిన్నని బాదంపప్పులు వేసి కలపాలి.
3. ఈ పిండి మిశ్రమాన్ని గుడ్ల మిశ్రమంతో కలిపి బ్లెండర్‌తో కలపండి, ఇందులోనే కరిగించిన వెన్న వేసి కలపాలి.
4. ఈ మిశ్రమాన్ని మఫిన్ అచ్చులలో పోయాలి. పైనుంచి తరిగిన బాదం పప్పులను చల్లాలి, అనంతరం ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేయండి, చాకో బాదాం మఫిన్స్ రెడీ.
సంబంధిత కథనం