Coconut water: రోజులో కొబ్బరి నీళ్ళు ఏ సమయంలో తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలుసుకోండి-know when to drink coconut water to get the most health benefits in a day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Water: రోజులో కొబ్బరి నీళ్ళు ఏ సమయంలో తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలుసుకోండి

Coconut water: రోజులో కొబ్బరి నీళ్ళు ఏ సమయంలో తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Feb 22, 2024 02:24 PM IST

Coconut water: కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవి తాగడానికి ఒక సమయం ఉంది. రోజులో ఏ సమయంలో కొబ్బరి నీళ్లను తాగితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

కొబ్బరినీళ్లు ఎప్పుడు తాగాలి
కొబ్బరినీళ్లు ఎప్పుడు తాగాలి (pexels)

Coconut water: కొబ్బరినీటిని అద్భుత పానీయంగా చెబుతారు పోషకాహార నిపుణులు. వేసవి వచ్చిందంటే కచ్చితంగా తీసుకోవాల్సిన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ఒకటి. ఎన్నో వ్యాధులకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకొని శక్తిని అందిస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎంత తాగినా బరువు పెరగరు. అలాగే శరీరానికి అవసరమైన సహజ ఎంజైములు వీటిలో పుష్కలంగా ఉంటాయి. పొటాషియం వంటి ఖనిజాలు కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే మాంగనీస్, విటమిన్ సి, క్యాల్షియం, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు కొబ్బరి నీళ్లలో అధికంగా ఉంటాయి. కాబట్టి వేసవి వచ్చిందంటే ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. రోజులో ఏ సమయంలో కొబ్బరి నీళ్లలో తాగితే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకోండి.

వర్కవుట్స్ ముందు

వ్యాయామం చేయడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగి వెళితే మంచిది. ఇది డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే శక్తిని అందిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత కూడా ప్రోటీన్ షేక్ వంటివి తాగే బదులు ఎలక్ట్రోలైట్స్ నిండిన కొబ్బరినీళ్ళను తాగడం చాలా మంచిది. ఇది అలసట నుంచి కాపాడుతుంది. శక్తిని వెంటనే అందిస్తుంది.

భోజనానికి ముందు

భోజనానికి ముందు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆహారం అధికంగా తినలేరు. కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలి అనుకునేవారు ఈ చిట్కాలు పాటించడం అలవాటు చేసుకోవాలి. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కాపాడడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి. రక్తపోటు పెరగకుండా ఇవి అడ్డుకుంటాయి.

నిద్రపోయే ముందు

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. ఇది మానసిక ఒత్తిడిని రాకుండా కాపాడుతుంది. ఇది మానసిక సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె కొట్టుకునే రేటు పెరగకుండా అడ్డుకుంటుంది. ఒత్తిడితో పోరాటడానికి కొబ్బరి నీళ్లను ఉపయోగించుకోవచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచి నిద్ర సరిగా పట్టేలా చేస్తుంది. కొబ్బరినీరు తాగడం వల్ల మూత్ర నాళాలు శుభ్రపడతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.

చాలామంది రాత్రిపూట ఆల్కహాల్ ను సేవిస్తారు. ఉదయం లేచిన తర్వాత హ్యాంగోవర్ సమస్యతో బాధపడతారు. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్‌కు గురవుతుంది. తలనొప్పి, వికారం వంటివి కలుగుతాయి. ఇలా హ్యాంగోవర్ రాకుండా ఉండాలంటే ఉదయం లేచి కొబ్బరినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. హ్యాంగోవర్ తగ్గడంతో పాటూ మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

కొబ్బరి నీళ్లను పైన చెప్పిన సమయాల్లో తాగడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. రెండు వారాలపాటు ఇలా కొబ్బరి నీళ్లు తాగడానికి ప్రయత్నించండి. పిల్లలకు కూడా వేసవిలో రోజుకో కొబ్బరి బోండాం తాగించండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Whats_app_banner