Tips to overcome loneliness: ఒంటరితనం వేధిస్తోందా? ఈ టిప్స్ తెలిస్తే మీరూ హాపీ-know these 3 tips to overcome loneliness and deal with holiday blues ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Overcome Loneliness: ఒంటరితనం వేధిస్తోందా? ఈ టిప్స్ తెలిస్తే మీరూ హాపీ

Tips to overcome loneliness: ఒంటరితనం వేధిస్తోందా? ఈ టిప్స్ తెలిస్తే మీరూ హాపీ

HT Telugu Desk HT Telugu
Jan 17, 2023 10:36 AM IST

Tips to overcome loneliness: మీ ఒంటరితనం హాలిడేస్‌లో మరింత పెరుగుతుంది. భావోద్వేగాలు, ఆలోచనలు ముప్పేట దాడిచేస్తాయి. కానీ అవి హాలిడేస్ మీ ఒంటరి తనం దూరం చేసేందుకు నాంది కావాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఒంటరితనం నుంచి బయటపడేందుకు 3 మార్గాలు
ఒంటరితనం నుంచి బయటపడేందుకు 3 మార్గాలు (Cottonbro studio)

జనవరి మాసం వచ్చిందంటే పాత ఏడాది జ్ఞాపకాలు, సాధించిన విజయాలు మన మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇదే సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి సంబరాలు, కొత్త కొత్త ఆకాంక్షలు జీవితంలో ఒక జోష్ నింపుతాయి. కానీ ఈ వేడుకలన్నీ కొందరిని ఒంటరితనానికి గురిచేస్తాయి. ఏకాంతంలో ఉండిపోయేందుకు ప్రేరేపిస్తాయి. దీనినే హాలిడే బ్లూస్ అని అంటారు.

అంటే జీవింతలో జరిగే దురదృష్ట సంఘటనలు కొందరు ఒంటరిగా జీవించేలా చేస్తాయి. ఒంటరితనంలో మగ్గేలా చేస్తాయి. బంధాలకు దూరంగా ఉండేలా చేస్తాయి. అనారోగ్య పరిస్థితులు కూడా ఇదే దుస్తితిని తెచ్చిపెడుతుంది. ఈ దశ నుంచి ముందుకు సాగడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఆలోచనలు, భావోద్వేగాలు ఈ సమయంలో ఇంకా ముప్పేట దాడి చేస్తాయి. అయితే ఒంటరితనంలో అతి పెద్ద సవాలు ఏంటంటే వారి మానసిక ఆరోగ్యం కోసం ప్రాధాన్యతలు గుర్తించలేకపోవడమే.

మానసిక ఆరోగ్య పరిశోధకులు, యోగా ఆఫ్ ఇమ్మోర్టల్స్ ఫౌండర్ ఇషాన్ శివానంత్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ‘చాలా మంది వ్యక్తులు తమను తాము చీకట్లో బంధించుకునే ధోరణి కలిగి ఉంటారు. అపరాధం, కోపం, భయాలు, అభద్రతలు, బాధాకరమైన అనుభవాల నుంచి తప్పించుకోవడానికి వారికి తెలియకుండానే టీవీకో, మొబైల్‌కో అతుక్కుపోతారు. లేదా ప్రతికూల ఆలోచనలతో ఎక్కువగా తిండి తినడమో, అసలే తినకపోవడమో చేస్తారు. భావోద్వేగాలు మొద్దుబారిపోయే స్థితిని ఎదుర్కొంటారు. అంటే జీవించే సామర్థ్యాన్ని, జీవన నాణ్యతను ప్రభావితం చేసే స్థితిని ఎదుర్కొంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సెలవు దినాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. తనతో తాను సంబంధాన్ని నిరంతరం కలిగి ఉండడమే దీనికి పరిష్కారం..’ అని సూచించారు.

‘రోజులో చివరగా మనం మనలో ప్రశాంతత కోరుకుంటాం. మీ సామర్థ్యాన్ని గుర్తించి మీరు మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టినప్పుడు మీ జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి, అలాగే జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి వీలుపడుతుంది. ఇందుకోసం హాలిడే సమయం కంటే మించిందేముంటుంది?..’ అని ఆమె వివరించారు. ఒంటరితనం నుంచి బయటపడేందుకు, హాలిడే బ్లూస్‌ను డీల్ చేసేందుకు ఆమె కొన్ని సూచనలు చేశారు.

యోగా పద్ధతిలో ఒంటరితనం ఇలా దూరం

మీ దిన చర్యలో ఉదయం, సాయంత్రం శాస్త్రీయ, నాన్-ఫార్మాస్యూటికల్ ఆధారిత విధానాలను అభ్యాసం చేయాలి. యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్రలేమి వంటి వాటిపై కొందరు వైద్యులు, సైంటిస్టులతో కలిసి పరిశోధన చేశాం. ఈ విధానాలు అభ్యాసం చేయగా మంచి ఫలితాలు కనిపించాయి. 72 నుంచి 82 శాతం లక్షణాలు తగ్గిపోయాయి. రోజూ క్రమం తప్పకుండా యోగా అభ్యాసం చేయడం వల్ల 4 నుంచి 8 వారాల్లోనే జీవన నాణ్యత మెరుగుపడింది.

విశ్వాస వ్యవస్థలపై దృష్టి నిలిపితే ఒంటరితనం మాయం

ఈ బిజీ లైఫ్‌లో మనం చాలా సందర్భాల్లో మనకు మనమే కొన్ని మెంటల్ బ్లాక్స్ నిర్మించుకుంటాం. అవేవీ మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవు. ఇలాంటప్పుడు జర్నల్ రాయడం మీలో సానుకూల ఆలోచనలను నింపుతుంది. అది ఒక హెల్తీ బిలీఫ్ సిస్టమ్‌గా నిర్మించుకునేందుకు దారితీస్తుంది. ఏదైనా రాస్తున్నప్పుడు నిజమైన ఉద్దేశాలు, భావోద్వేగాలను కలిగి ఉంటే మన లక్ష్యాలను వ్యక్తపరచడంలో మన న్యూరోపాత్‌వేలను ప్రభావితం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.

ఒంటరితనం పారదోలేందుకు వ్యక్తీకరణ అవసరం..

మనుషులు అంటేనే వ్యక్తీకరణకు చిహ్నం. స్వేచ్ఛగా వ్యక్తీకరణ చేయడానికి, మన వ్యక్తీకరణలపై తీర్పు ఇవ్వని అవగాహనతో కూడిన వాతావరణంలో ఉండడం అవసరం. కొత్త హాబీలు అలవరచుకోవడం, మనలోని అభిరుచులను అన్వేషించడం, కొత్త నెట్‌వర్క్ నిర్మించుకోవడం ఏదైనా కావొచ్చు.. వీటిపై మీ వ్యక్తీకరణ అవసరం. ఆలోచనలు, మీ మాటలు, చర్యలు ఏకతాటిపైకి వస్తే గాఢమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.

Whats_app_banner