Overthinking problems: ఓవర్‌థింకింగ్ సమస్య లక్షణాలేంటి? బయటపడే మార్గాలేంటి?-know how to stop overthinking and find causes symptoms types solutions here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Overthinking Problems: ఓవర్‌థింకింగ్ సమస్య లక్షణాలేంటి? బయటపడే మార్గాలేంటి?

Overthinking problems: ఓవర్‌థింకింగ్ సమస్య లక్షణాలేంటి? బయటపడే మార్గాలేంటి?

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 02:26 PM IST

Overthinking problems: ఓవర్‌థింకింగ్ వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. దాని లక్షణాలు, రకాలు, దీని నుంచి బయటపడే మార్గాలు ఇక్కడ చదవండి.

Overthinking sideeffects: ఓవర్‌థింకింగ్ కారణంగా మానసిక, శారీరక అనారోగ్యం
Overthinking sideeffects: ఓవర్‌థింకింగ్ కారణంగా మానసిక, శారీరక అనారోగ్యం

Overthinking problems: మీరు ఓవర్‌థింకింగ్ చేస్తున్నట్టుగా మీకు అనిపించిందా ఎప్పుడైనా? జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో ఆకాంక్ష చాలా అమూల్యమైనదిగా తోస్తుంది. ఒకరికి అంబానీలా అవ్వాలని ఉండొచ్చు. ఇంకొకరికి ప్రేమ, ఆత్మీయతలు పొందడమే జీవిత ధ్యేయమై ఉండొచ్చు. మీరు అత్యంత ప్రాణంగా భావించే ఆ కలలు భగ్నమైనప్పుడు లేదా జీవితంలో అనూహ్యమైన సంఘటనలు జరిగినప్పుడు దాని నుంచి కోలుకోలేక విపరీతమైన ఆలోచనలతో సతమవుతుంటారు. ఈ ఓవర్‌థింకింగ్ వల్ల మీకు తెలియకుండానే చాలా నష్టపోతారు.

signs of overthinking: ఓవర్ థింకింగ్ లక్షణాలు ఇవే

ఒక నిర్ధిష్ట సంఘటన, సందర్భంపై మీరు అతిగా ఆలోచిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు ఈ లక్షణాలు గమనించండి.

1. ఆ ఒక్క వ్యక్తి, సంఘటన, సందర్భం గురించి మినహా ఇతర అంశాలపై ఆలోచించలేకపోవడం,

2. విశ్రాంతి లేకపోవడం

3. నిరంతరం బాధపడుతుండడం, యాంగ్జైటీ ఉండడం

4. మీ నియంత్రణలో లేని అంశాల గురించి బాధపడడం

5. మానసికంగా అలసిపోవడం

6. ప్రతికూల ఆలోచనలతో సతమతమవడం

7. ఆ నిర్ధిష్ట సంఘటనలు మీ మెదడులో పదే పదే తిరుగుతుండడం

8. ఆయా సంఘటనలకు అంతిమంగా బాధాకరమైన పర్యవసనాలను ఊహించడం

9. మీ నిర్ణయాలను మీరు ప్రశ్నించుకోవడం

ఓవర్ థింకింగ్‌కు గల కారణాలు ఏంటి?

అతిగా ఆలోచించడం వెనక చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ సమస్యలోనే జీవించడం. సమస్యకు పరిష్కారం వెతకాల్సిన సమయంలో ఆ సమస్యలోనే జీవిస్తూ మానసిక వ్యథను అనుభవించడం. ఉదాహరణకు మీరు తుపాను రాబోతున్నట్టు తెలుసుకున్నారు. అప్పుడు మీరు ఆ తుపాను రాకూడదని కోరుకోవడం, నాకే అన్ని సార్లు ఇలా జరుగుతుందని చింతించడం, నేను దీనిని తట్టుకోలేకపోతున్నానని బాధపడడం ఓవర్ థింకింగ్‌ కిందకే వస్తుంది. కానీ తుపాను ప్రభావం మీపై పడకూడదంటే ఏం చేయాలో కార్యాచరణ అమలు చేయడం సమస్యకు పరిష్కారంగా ఉంటుంది. తుపాను ఆపడం మీ చేతుల్లో లేదని తెలుసు. వస్తే జరిగే నష్టమేంటి? వాటిని ఎలా కాపాడుకోవాలి? అన్న అంశాలు ఆలోచించాలి. సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా సమస్యలోనే జీవించడమే ఓవర్ థింకింగ్‌కు కారణమవుతుంది. అలాగే ఏదైనా రిలేషన్‌షిప్‌లో మీ మనసు గాయపడి ఉండొచ్చు. మీరు కలలు గన్న అందమైన ప్రపంచం ఒక్క రాత్రిలో కుప్ప కూలొచ్చు. అందుకు కారణం మీరు అవ్వొచ్చు.. కాకపోయి ఉండొచ్చు. కానీ ఆ శిథిలాల కిందే పడి నాకే ఎందుకు ఇలా జరుగుతోందని క్షోభ అనుభవించడం ఓవర్ థింకింగ్. ఆయా సంఘటనలను సమ్మతిస్తూ, మీరు ఆశించిన ప్రేమ, ఆప్యాయత మరో వ్యక్తిలో, మరో పనిలో వెతుక్కోవడం సమస్యకు పరిష్కారం.

ఓవర్‌థింకింగ్ ఎన్ని రకాలు

ఓవర్‌థింకింగ్‌ విభిన్న సందర్భాలను బట్టి తేడా ఉంటుంది. ప్రధానంగా ఒకే కోణం నుంచి ఆలోచించడం. అంటే మీరు ఒక సంఘటనను బొమ్మాబొరుసులా చూడకుండా పూర్తి చెడును లేదా పూర్తి మంచిని మాత్రమే చూడడం. అంటే పూర్తిగా వైఫల్యాన్ని లేదా పూర్తిగా విజయాన్ని మాత్రమే చూడడం.

మరొకటి విపత్తును ఊహించడం. అంటే మీరు వైఫల్యం ఎదురవుతుందని భయపడడం. ఉదాహరణకు మీరు పరీక్ష ఫెయిలవుతారని, అలా జరిగితే మీ చదువు కొనసాగకపోవచ్చని, పట్టా అందుకోలేకపోవచ్చని, అంతిమంగా ఉద్యోగం దొరకకపోవచ్చని ఆలోచించడం. అంటే అవాస్తవిక ఆలోచనలతో సతమతమవడం.

ఇక జనరలైజ్ చేయడం మరొకటి. గతంలో జరిగిన కొన్ని సంఘటనల ఫలితాల ఆధారంగా భవిష్యత్తులోనూ ఇదే జరగబోతోందని అంచనా వేస్తూ అతిగా ఆలోచించడం. విభిన్న ఫలితాలు ఉంటాయన్న సంగతిని స్వాగతించకుండా అలాంటి విషయాల్లో ఎప్పటికీ అలాగే జరుగుతుందని ఆలోచిస్తుంటారు. అంటే ఒక సంఘటనను బట్టి భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని ఆలోచించడం కూడా ఓవర్ థింకింగ్‌లో ఒక రకం.

ఓవర్‌థింకింగ్ నుంచి బయటపడకపోతే ఏమవుతుంది?

ఒక సంఘటన పదేపదే మీ మెదడులో తిరుగుతోందంటే అది మీకు హాని చేసినట్టే. ఒక సంభాషణ, సంఘటన పదే పదే గుర్తుకు వస్తూ, చెడు జరుగుతోందనే ఆలోచన రావడం దీర్ఘకాలంలో బాగా చేటు చేస్తుంది. గతంలో అనుభవించిన గాయాలు, మోసాలు, పొరపాట్లు, లోటుపాట్లలో ఇంకా జీవిస్తుండడం మీరు మానసిక అనారోగ్య సమస్యలకు గురవుతారని జర్నల్ ఆఫ్ అబ్‌నార్మల్ సైకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది.

మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మీ ఆలోచనలతో ఇంకా సతమవుతుంటారు. ఆలోచనలను బ్రేక్ చేయగలిగే సామర్థ్యం కోల్పోతారు. మీ మెదడుకు విశ్రాంతి ఉండదు. నిద్ర అసలే ఉండదు. ఇది ఇంకా మీ పరిస్థితిని దిగజార్చుతుంది. మరుసటి రోజు మీ రోజువారీ పనులు చేయలేరు. వాటిపై ఫోకస్ ఉండదు. ఈ కారణంగా ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఇలాంటి సమయాల్లో మద్యపానం, దూమపానం అలవాటవుతాయి. ఈ వ్యసనాల నుంచి ఇక మీరు బయటపడడం చాలా ఆలస్యమవుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలపై మీకు విశ్వాసం లేక ఇతరుల అభిప్రాయంపై ఆధారపడతారు. ఫలానా నిర్ణయం తీసుకుని ఉంటే జీవితం బాగుండేదని బాధపడుతుంటారు.

బంధాలు బీటలు వారుతాయి..

ఓవర్‌థింకింగ్ వల్ల రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయి. చెడును ఊహించి ఒక తప్పుడు నిర్ధారణకు రావడం మీ భాగస్వాములతో వాదనలకు, సంఘర్షణలకు దారితీస్తుంది. వారి ప్రతి చర్యను మీరు మీ ఆలోచనలకు ముడిపెడుతూ అర్థం చేసుకుంటే వారిని అపార్థం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టే జరిగితే దానిని స్వాగతిస్తూ సమస్యలో జీవించకుండా దానిని పరిష్కరించడమే మార్గం. లేదంటే ఓవర్ థింకింగ్ వల్ల పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓవర్‌థింకింగ్ అనేది మానసిక జబ్బు ఏం కాదు. అయితే మీలో యాంగ్జైటీకి దారితీస్తుంది. తద్వారా డిప్రెషన్, అబ్జెసివ్ -కంపల్సివ్ డిజార్డర్, ప్యానిక్ అవడం, చేదు గాయం తరువాత ఎదురయ్యే స్ట్రెస్, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ వంటివి ఎదురవుతాయి.

ఓవర్ థింకింగ్‌తో శారీరక అనారోగ్యం

ఓవర్ థింకింగ్ కారణంగా మీరు స్ట్రెస్, మానసిక ఆందోళనకు గురవుతారు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ డయాబెటిక్, హైబ్లడ్ ప్రెజర్, మెమొరీ లాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతిమంగా మీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడం ఎలా?

దీని నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక చేదు సంఘటన గురించి చింతించడం కంటే మీరు మరొక టాస్క్‌లో నిమగ్నమవుతూ, మీ సమస్యకు పరిష్కారం కనుగొనడం సులువవుతుంది.

అంటే మీ మనసును వేరొక పనిపైకి మళ్లిస్తే తప్పకుండా మీ ఆలోచనలకు బ్రేక్ పడుతుంది. అలాంటి సమయంలో మీకు వచ్చే సానుకూల ఆలోచనలు మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఇవ్వొచ్చు.

అలాగే ప్రతికూల ఆలోచనలకు బ్రేక్ వేయండి. మీరు ఆలోచిస్తున్నవన్నీ నిజాలు కాకపోయి ఉండొచ్చని అనుకోండి. మీకు వస్తున్న ప్రతి ఆలోచన వాస్తవం కాకపోవచ్చని గుర్తించండి.

ఒకవేళ వాస్తవమే అయితే జీర్ణించడం నేర్చుకోండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. అంతకంటే సుందరమైన స్వప్నం గురించి ఆలోచించండి. మీలో ఆత్మవిశ్వాసం నింపే పనులు చేయండి. సెల్ప్ కంట్రోల్ నేర్చుకోండి. ధ్యానం అన్నింటి కంటే మేలు చేస్తుంది. మీ ఆలోచనలకు బ్రేక్ వేస్తుంది.

మీరు మార్చలేని సంఘటనల్లో జీవించడం కంటే వాటిని స్వాగతించి మీపై మీరు కరుణ చూపండి. కృతజ్ఞతా భావాన్ని అభ్యసించడం, మీలో మీకు నచ్చిన అంశాలను అభినందించుకోవడం, మీరు రిగ్రెట్‌గా ఫీలైన అంశాలపై మిమ్మల్ని మీరు క్షమించేయండి.

మీ ఆలోచనలు నిజమని తేలితే మీ భాగస్వామిని నిందించకుండా క్షమించేయండి. వారికీ మీలాగా అందమైన ప్రపంచం గురించి కలలు కనే హక్కుందని గ్రహించి స్వాగతించండి. యాక్సెప్ట్ చేయడాన్ని నేర్చుకోవడం మొదలుపెడితే మీరు ఓవర్ థింకింగ్ నుంచి బయటపడొచ్చు.

అలాగే మిమ్మల్ని ప్రోత్సహించే, మీపై ప్రేమ, ఆత్మీయత చూపే వ్యక్తులతో కూడిన ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఓవర్ థింకింగ్ నుంచి బయటపడొచ్చు. ప్రకృతితో మమేకం అవ్వడం వల్ల మీరు త్వరగా కోలుకోగలుగుతారు. అలాగే యోగా, వ్యాయామం మీరు శారీరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చేస్తాయి.

ఓవర్‌థింకింగ్ నుంచి బయటపడలేనని మీరు గుర్తించినప్పుడు మీరు మానసిక వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అత్యుత్తమైన చర్య. మీరు మీ గతం నుంచి, విపరీతమైన ఆలోచనల నుంచి బయటపడేందుకు అవసరమైన చికిత్స ఆయా వైద్య నిపుణులు అందిస్తారు. మీ పరిస్థితికి అనుగుణంగా వారు స్పందిస్తారు.

Whats_app_banner