Blood Sugar In Winter: చలికాలంలో షుగర్ పెరగడానికి కారణాలివే.. తెల్సుకుని జాగ్రత్తపడండి..
Blood Sugar In Winter: చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయుల్లో పెరుగుదల కనిపిస్తుంది. దానికంటూ కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. అవేంటో తెల్సుకుని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
మిగిలిన కాలాలతో పోలిస్తే శీతాకాలంలో వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. సహజంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే వీటన్నింటితో పాటు ఈ కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ కాలంలో సాధారణంగా చాలా మంది మధుమేహం బారిన పడుతుంటారు. అలాగే షుగర్ ఉన్న వారికి మందులు వాడుతున్నా సరే అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వైద్యులు వివరిస్తున్నారు. చదివేయండి.
డీ విటమిన్ లోపం వల్ల :
మిగిలిన కాలాలతో పోలిస్తే ఈ శీతాకాలంలో ఎండ తక్కువ సమయం ఉంటుంది. ఇలా తగినంత ఎండ మనకు తగలకపోతే మన శరీరంలో విటమిన్ డీ లోపం ఏర్పడుతుంది. ఈ లోపం వల్ల ఇన్సులిన్ ప్రభావితం అయి తగ్గిపోతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి షుగర్ ఉన్న వారైనా లేని వారైనా సరే ఈ కాలంలో ఎండలో కాసేపు కూర్చోవడం అలవాటుగా చేసుకోవాలి.
వ్యాయామం లేకపోవడం వల్ల :
ఈ కాలంలో వాతావరణం చలిగా ఉంటుంది. అందుకనే ఉదయాన్నే లేచి వాకింగ్‌కి వెళ్లడం, వ్యాయామాలు చేయడం లాంటి వాటిని చాలా మంది మానేస్తుంటారు. ఇలా ఉదయాన్నే లేస్తే మంచు వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయని భయపడి బయటకెళ్లి వ్యాయామాలు చేయడం విరమించుకుంటారు. అందువల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే లేవ లేకపోయినా కనీసం సాయంత్రం అయినా ఓ గంట పాటు వ్యాయామాలకు కేటాయించుకోవాలి.
చల్లటి ఉష్ణోగ్రత వల్ల :
ఎప్పుడూ అధికంగా షుగర్ ఉండే వారు ఇంజెక్షన్లు చేసుకుంటూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ చేసుకునే మందుల్ని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. శీతాకాలంలో సాధారణంగానే ఇంట్లో ఉష్ణోగ్రతలు చల్లబడతాయి. అలాంటి ఉష్ణోగ్రతల వల్ల ఈ మందులు పెద్దగా ప్రభావవంతంగా పని చేయవు. ఈ కారణం వల్ల కూడా షుగర్ పెరుగుతుంది.
నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల :
శీతాకాలంలో చల్లగా ఉండటం వల్ల సహజంగానే మనకు ఎక్కువగా నీరు తాగాలని అనిపించదు. అందువల్ల మన శరీరంలోకి నీరు తక్కువగా వెళుతుంది. నీరు తగినంతగా లేకపోతే మన శరీరంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ బయటకు వెళ్లడానికి తావు దొరకదు. అందువల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి శీతాకాలంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని షుగర్‌ని నియంత్రణలో ఉంచుకోవాలి.