Kedareshwara vratha katha: కేదారేశ్వర వ్రత పూర్తి కథ, ప్రాముఖ్యత, విశిష్టత తెల్సుకోండి..-know kedareshwara vratha katha importance and prominence ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kedareshwara Vratha Katha: కేదారేశ్వర వ్రత పూర్తి కథ, ప్రాముఖ్యత, విశిష్టత తెల్సుకోండి..

Kedareshwara vratha katha: కేదారేశ్వర వ్రత పూర్తి కథ, ప్రాముఖ్యత, విశిష్టత తెల్సుకోండి..

Koutik Pranaya Sree HT Telugu
Nov 12, 2023 02:36 PM IST

Kedareshwara vratha katha: కేదారేశ్వర వ్రత చదివితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ వ్రత పూర్తి కథ, విశిష్టత ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి మాటల్లో తెల్సుకోండి.

కేదారేశ్వర వ్రత కథ
కేదారేశ్వర వ్రత కథ (freepik)

కార్తీక పౌర్ణమిరోజు కేదారేశ్వర వ్రతము ఆచరించుట చాలా మంచిది. అలా కార్తీక పౌర్ణమికి కేదారవ్రతం ఆచరించలేనటువంటి వారు ఈ కేదార వ్రతకథను చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అందుకోసం కేదారేశ్వర వ్రతకథను పాఠకుల కోసం సవివరంగా అందచేస్తున్నాము.

పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్థభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండుసభయందు కూర్చుని యుండెను. సిద్ధ సాధ్య, కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు, మునులు, అగ్ని వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమథగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందుఉపవిష్టులై ఉన్నారు.

నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమాల, వకుళ, నారికేళ, చందన, పనస, జంబూవృక్షములతోను చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీనదపర్వతములతోను చతుర్దశభువనాలు పులకిస్తున్నాయి.

అట్టి అనంద కోలాహలములలో భృంగురిటి అను శివభక్తిశ్రేష్టుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడిని మెప్పించుచుండెను. శివుడతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు ఖృంగి మొదలుగా గల వందిమాగధులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి "నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. అటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేల చేసితిరి” అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని 'దేవీ! పరమార్ధవిదులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు” అని జవాబిచ్చాడు. “సాక్షాత్‌ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి యాదండ ప్రణామములకు నోచుకోని అయోగ్యురాలనా” అని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునానర్చుటకు నిశ్చయించుకున్నది.

కైలాసమును వదలి శరభ శార్జూల, గజములు గల నాగ, గరుడ, చక్రవాక పక్షి సముదాయముతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొన్న సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిథిమర్యాదలొనర్చి “తల్లీ! నీవెవ్వరవు? ఎవరిదానవు? ఎటనుండి వచ్చితివి? నీ రాకకుగల అంతర్యమేమిటి? అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి అనందించినదై 'యజ్ఞయాగాది 'క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా! పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్‌ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా, నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్పానర్చ సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను” అన్నది పార్వతి.

'మహర్షులారా! జగత్మల్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు” అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు “పార్వతీ! ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటి యున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్టసిద్ధిని పొందవలసిందిని అన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడిని కోరింది.

“జగజ్జననీ! ఈ వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి అరోజున ఉపవాసముండవలెను. ఆ మర్నాడు విప్రలకు భోజనము పెట్టి ఆ తర్వాత అహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతము ఆరంభించిన నాటినుంచి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములను గాని, సువర్జమును గానీ ఉంచి గంధపుష్పాక్షతలతో పూజించాలి.

దేవీ! ఇరవైఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు, కదళీఫలాలు, పనసలు అరగింపజేసి తాంబూల దక్షిణలనిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోథీష్టసిద్ధిని కలుగజేయును”అని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధివిధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వరవ్రతాన్ని నిష్టగా, భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారము తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమునకేగెను. కొంత కాలమునకు శివభక్తి పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును, దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేతెంచి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజదంతుడు అ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.

తదనంతరము ఉజ్జయినీ నగరంలోగల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి 'జనకా! మాకు కేదారవ్రతము చేయుటకు అనుజ్ఞ నిమ్ము” అని అడిగారు. అందుకాతడు 'బిడ్డలారా! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు అ ఆలోచనను మానుకోండి” అని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ అనుజ్ఞయే మాకు ధనము. అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృ్ఫక్షము క్రింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడయ్యాడు.

ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయగం గల ఆ వైశ్యపుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్యమదోనృత్తురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరాను గ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది. ఆమె భర్త ఆమెను, కుమారుడిని రాజ్యము నుండి వెడలగొట్టివేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడామె తన కుమారుడిని చేరబిలిచి 'నాయనా! నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయ మర్ధించి తీసుకొనిరావలసింది” అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి పెదతల్లిని కలసి తమ దుస్థితిని వివరించాడు. ఆమెకొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగినదానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్య మందు చోర రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు “ఓయీ! నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణముగా అ సొమ్ము మీకు దక్కదు” అని హెచ్చరించాడు.

ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడామె బాగా అలోచించి అతని చేత కేదార వ్రతము చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదారవ్రతము చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారము తల్లివద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి వ్రతము చేయవలసిందని పెద్దతల్లి చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తుకలిగిన భాగ్యవతి భక్తిశద్ధలతో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీ మార్చలముతో వచ్చి ఆమెను, కుమారుడిని రాజధానికి తీసుకువెళ్ళాడు. భాగ్యవతి ప్రతిసంవత్సరము కైదారవ్రతము చేస్తూ శివానుగ్రహము పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవించింది. ఎవరు ఈ కేదారేశ్వరవ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈకథ చదివినా, విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner