పెరుగులో ప్రొబయాటిక్స్, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే మరిన్ని లక్షణాల వల్ల ఇది బరువు తగ్గించడానికి సాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ డైట్ లో దీన్ని చేర్చుకోవచ్చు. దీన్ని ఆహారంలో ఎలా చేర్చుకుంటే ఫలితాలుంటాయో, దీని ఉపయోగాలేంటో చూడండి.
పెరుగులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్ మాస్ పెంచుతుంది. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండిన బావననిస్తుంది. దాంతో మనం తినే కేలరీలు తగ్గుతాయి. ప్రొటీన్ ఎక్కువున్న ఆహారం తినడం వల్ల బరువు తగ్గుతారని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.
పెరుగులో ప్రొబయాటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ఇవన్నీ బరువు తగ్గించే లక్షణాలు. ఆకలిని తగ్గించి హార్మోన్ల స్థాయుల్ని నియంత్రణలో ఉంచుతాయి. ఆరోగ్య కరమైన పేగు ఆరోగ్యం ప్రభావం బరువు మీద ఉంటుంది.
కేలరీలు ఎక్కువ తీసుకుంటే బరువు ఎక్కువగా పెరుగుతారు. సాదా పెరుగులో కేలరీలు తక్కువుంటాయి. వంద గ్రాముల పెరుగులో 98 కేలరీలుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
సాధారణంగా పెరుగు తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొందరిలో గ్యాస్, బ్లోటింగ్ లాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ల్యాక్టోజ్ పడనివాళ్లలో ఈ సమస్య రావచ్చు.
బయట దొరికే ఫ్లేవర్డ్, స్వీటెన్డ్ పెరుగులో ఎక్కువ పంచదార ఉంటుంది. ఇది మీ బరువు తగ్గించే ప్రయత్నానికి ఆటంకమే. అందుకే ఇంట్లో పెరుగు లేదంటే ఎలాంటి ఫ్లేవరింగ్, పంచదార లేని పెరుగు తినాలి.
కేలరీలు తక్కువ కదాని ఎక్కువగా పెరుగు తినకూడదు. అనవసరమైన కేలరీలు చేరి బరువు పెరిగిపోతారు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.