Baby Care Tips : చలికాలంలో పుట్టిన బిడ్డను ఇలా చూసుకోవాలి.. ప్లీజ్ జాగ్రత్త-know how to take care of new born baby in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Care Tips : చలికాలంలో పుట్టిన బిడ్డను ఇలా చూసుకోవాలి.. ప్లీజ్ జాగ్రత్త

Baby Care Tips : చలికాలంలో పుట్టిన బిడ్డను ఇలా చూసుకోవాలి.. ప్లీజ్ జాగ్రత్త

Anand Sai HT Telugu
Dec 23, 2023 01:30 PM IST

Baby Care Tips In Winter : నవజాత శిశువును చలికాలంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అసలే వారి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. చలికి తట్టుకోలేదు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

నవజాత శిశువు ఆరోగ్యం, చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వారిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అప్పుడే చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి బిడ్డను కాపాడుకోవచ్చు. చలికాలంలో పుట్టినా లేదంటే అంతకుముందు చాలా చిన్న పిల్లలు అయినా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం కాదులే అని చేసే చిన్న పొరబాట్లే సమస్యలను తెచ్చి పెడుతాయి. పిల్లలను శీతాకాలంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా నవజాత శిశువుల విషయంలో తెలిసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. వాటి గురించి చూద్దాం..

చలికాలంలో శిశువును దుప్పటితో కప్పాలి. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. బరువు ఎక్కువగా ఉన్న వాటితో కప్పేస్తారు. కానీ శిశువుకు ఎప్పుడూ బరువైన దుప్పటిని వేయకండి. ఎందుకంటే శిశువుకు చేతులు, కాళ్ళు కదలడం కష్టం అవుతుంది. దీని కారణంగా పిల్లలు అసౌకర్యంగా ఫీలవుతారు. చురుకుగా ఉండరు. నిద్రపోయినా మధ్యలోనే మెలకువ వచ్చేస్తుంది. బరువు ఎక్కువగా ఉన్న దుప్పటి కప్పితే ఊపిరి తీసుకోవడంలో అసౌకర్యంగా అనిపిస్తుంది.

చలి నుండి పిల్లలను రక్షించడానికి పిల్లలను వెచ్చని దుస్తులు వేయండి. వీలైతే లూజ్ ఉన్న దుస్తులు పైనుంచి మరొకటి వేయండి. చిన్న పిల్లలకు జలుబు కాకుండా చూసుకోవాలి. చలికాలంలో జలుబు అయితే తగ్గడం కష్టంగా ఉంటుంది. నవజాత శిశువు విశ్రాంతి తీసుకునేలా, శ్వాస సమస్యలు లేకుండా చూసుకోండి.

నవజాత శిశువు ఆరోగ్యం, చర్మం చాలా సున్నితంగా ఉంటాయి. వారిపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. అప్పుడే ఈ సీజన్ లో మీ బిడ్డను వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. పిల్లల పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. శిశువును వెచ్చని నీటిలో స్నానం చేయించండి. అయితే ప్రతీరోజు స్నానం అవసరం లేదు. ఒక్కోసారి తడి టవల్‌తో శిశువు శరీరాన్ని శుభ్రం చేయండి. అందువల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం లేదు.

ఈ సీజన్‌లో పిల్లలు పాదాలు, చెవుల ద్వారా జలుబుకు గురయ్యే అవకాశం ఉంది. ఎల్లప్పుడూ పిల్లల పాదాలకు సాక్స్, చెవులకు టోపీలు ధరించండి. వాళ్లు అసౌకర్యంగా ఫీలైతే.. కాసేపు తీసి పక్కన పెట్టండి.

పిల్లలకు మసాజ్ చేయడం వల్ల వారి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ సీజన్‌లో బిడ్డకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయండి. దీని కోసం బాదం, ఆలివ్ లేదా కొబ్బరి నూనె ఉపయోగించండి. మసాజ్ తర్వాత పిల్లలు మంచి అనుభూతి చెందుతారు. స్నానం చేయించిన తర్వాత వెంటనే నిద్రపోతారు.

చలికాలంలో పిల్లలకు తరచుగా ముక్కులు మూసుకుపోతాయి. దీని కారణంగా పిల్లలు ఏడవడం ప్రారంభిస్తారు. అటువంటి సందర్భాలలో నాసికా డ్రప్స్ వాడండి. తద్వారా పిల్లలకి ఉపశమనం లభిస్తుంది.

అన్నింటికంటే ఇది చాలా ముఖ్యం. శిశువును ప్రతిరోజూ 10 నిమిషాలు సూర్యరశ్మికి తీసుకెళ్లండి. ఉదయం పూట వచ్చే సూర్యరశ్మి ఆరోగ్యానికి మంచిది. దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే పిల్లలు తగినంత విటమిన్ డిని పొందుతారు. చలికాలంలో సురక్షితంగా ఉండటమే కాకుండా మంచి అనుభూతి చెందుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Whats_app_banner