Geyser Water: గీజర్ వాటర్‌తో స్నానం చేస్తే జుట్టు ఊడుతుందా? వివరంగా తెల్సుకోండి..
Geyser Water: కొంతమందిలో గీజర్ వాటర్ వాడటం గురించి అనేక సందేహాలుంటాయి. కొంతమంది జుట్టు ఊడుతుందని, చిన్న పిల్లలకు మంచిది కాదని అనుకుంటారు. అదెంతవరకూ నిజమో తెల్సుకోండి.
గత కొన్ని సంవత్సరాలుగా గీజర్ల వాడకం చాలా పెరిగింది. దాదాపుగా చాలా మంది ఇళ్లల్లో ఇవి ఉంటున్నాయి. స్నానం చేయడానికి వేడి నీళ్లు కాచుకునే పని లేకుండా గీజర్లు సులభంగా ఆ పని చేసేస్తాయి. నేరుగా స్నానాల గదిలోనే వేడి నీళ్లు వచ్చేస్తాయి. అయితే ఇలా కరెంటు ద్వారా వేడి అయిన నీటితో స్నానం చేయడం మంచిదేనా? జుట్టుకు దీని వల్ల ప్రతికూల ప్రభావాలు ఏమైనా ఉంటాయా? అలాగే చిన్న పిల్లలకు ఈ నీటితో స్నానం చేయించవచ్చా? లాంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ కథనం. మరి ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
ఆరోగ్యకరమేనా?
గీజర్ నుంచి వచ్చిన వేడి నీటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరెంటు ద్వారా ఇవి వేడి కావడం వల్ల నీటిలో ఉన్న సూక్ష్మ జీవులు, వైరస్‌లు, బ్యాక్టీరియాల్లాంటివి అన్నీ నశించిపోతాయి. అందువల్ల మరింత సురక్షితమైన నీటితో మనం స్నానం చేసినట్లు అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ఆ నీరు ఎంత వేడి ఉన్నాయి? అనే దాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. కొంత మంది మరీ ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే గోరు వెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయడం ఉత్తమం.
గీజర్ నీటి వల్ల జుట్టు ఊడుతుందా?
సాధారణంగా గోరు వెచ్చటి గీజర్ నీటితో తల స్నానం చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. అయితే కొందరి శరీర తత్వాల్ని బట్టీ ఇది మారుతూ ఉంటుంది. ఇలాంటి నీటితో స్నానం చేస్తున్నప్పుడు జుట్టు ఎక్కువగా ఊడుతున్నట్లు గమనిస్తే అది పడట్లేదని అర్థం చేసుకోవాలి. కానీ సాధారణంగా వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావమూ ఉండదు. అయితే మరీ అతి వేడిగా ఉండే నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లలో ఉండే సహజమైన నూనెలన్నీ తగ్గిపోతాయి. అది గీజర్ నీళ్లే అవ్వక్కర్లేదు. మామూలుగా ఎక్కువగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేస్తే ఈ సమస్య మొదలవుతుంది. కుదుళ్ల దగ్గర పొడి బారిపోయి జుట్టు రాలే అవకాశాలు ఉంటాయి. బాగా ఎక్కువ వేడి నీటితో కాకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల పెద్దగా జుట్టు సమస్యలు రాకపోవచ్చు.
చిన్న పిల్లలకు స్నానం చేయించవచ్చా?
మామూలుగా పసి పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వేడి లేకుండా చూసుకుని ఈ నీటితో స్నానం చేయించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు.
టాపిక్