Hing Water Benefits: ఇంగువ నీటితో జలుబు, దగ్గు తగ్గడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు..-know health benefits of drinking health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hing Water Benefits: ఇంగువ నీటితో జలుబు, దగ్గు తగ్గడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు..

Hing Water Benefits: ఇంగువ నీటితో జలుబు, దగ్గు తగ్గడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు..

Koutik Pranaya Sree HT Telugu
Dec 21, 2023 04:55 PM IST

Hing Water Benefits: ఇంగువను నీళ్లలో కలిపి తాగడం వల్ల బరువు తగ్గడం, షుగర్ అదుపులో ఉండటం, డిటాక్స్ లాగా పనిచేయడం లాంటి అనేక లాభాలున్నాయి. అవేంటో వివరంగా తెల్సుకోండి.

ఇంగువ నీళ్లతో ప్రయోజనాలు
ఇంగువ నీళ్లతో ప్రయోజనాలు (freepik)

ఇంగువను భారతీయ వంటిళ్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పప్పు, పులిహోర లాంటి కొన్ని వంటలకు ఇది ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. మంచి వాసనతో నోరు ఊరిపోయేలా చేస్తుంది. అందుకనే ఇది దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అందుబాటులో ఉంటుంది. ఇది కలిపిన నీటిని తాగడం వల్ల జలుబు, దగ్గులాంటివి తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. అలాంటి అద్భుతమైన ఇంగువ నీటితో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.

మధుమేహ నియంత్రణకు:

రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడంలో ఇది సమర్థవంతంగా పని చేస్తుంది. ఒకేసారి ఎనర్జీ స్పైక్‌ కావడం, మళ్లీ పడిపోవడం లాంటివి జరగవు. ఎప్పుడూ ఒకే స్థాయిలో శక్తి ఉండేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో సహాయకారిగా ఉంటుంది.

వ్యర్థాల్ని తోసివేస్తుంది :

శరీరాన్ని డిటాక్స్‌ చేసుకోవాలని అనుకునే వారు ఇంగువ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను ఇది సమర్థవంతంగా బయటకు నెట్టివేస్తుంది. అందువల్ల మొత్తం శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది.

బరువు తగ్గడానికి :

తొందరగా బరువు తగ్గాలని అనుకునే వారికి ఇంగువ నీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. గోరు వెచ్చటి నీటిలో చిటికెడు ఇంగువ కలిపి పరగడుపునే తాగడం వల్ల అద్భుతాలు చూస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. అజీర్ణం, పొట్ట ఉబ్బరం లాంటి వాటిని తగ్గిస్తుంది. వీటన్నింటి వల్ల జీవక్రియ కూడా మెరుగై శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీనిలో ఆకలిని ఎక్కువగా వేయనీయని లక్షణం కూడా ఉంది. అందువల్ల మనం అతిగా తినడానికి కూడా దూరంగా ఉంటాం.

శ్వాసకోశ ఇబ్బందులకు :

ఇంగువ నీటిని తాగడం వల్ల శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయి. శ్వాస ఆడకపోవడం, దగ్గు లాంటి వాటి లక్షణాలు తగ్గుతాయి. అలాగే శ్వాస కోశంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తగ్గి తేలికగా గాలి ఆడే విధంగా ఉంటుంది.

ఈ విషయంలో జాగ్రత్త :

రోజూ పరగడుపున ఇంగువ నీటిని తాగవచ్చు. అయితే నీటిలో ఇంగువను ఎంత వేసుకుంటున్నారు? అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిటికెడు మాత్రమే చాలు. అంతకంటే ఎక్కువ వేసుకుని తాగడం వల్ల విరోచనాలు, జీర్ణ సంబంధమైన చికాకులు తలెత్తుతాయి. అతిగా దీన్ని తీసుకుంటే పెదవుల వాపులు రావొచ్చు. చర్మం మీద కూడా దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. రక్త పోటులో హెచ్చు తగ్గులు ఉంటాయి. గర్భవతులు, పాలిచ్చే మహిళలు దీన్ని తినడం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు అసలు పరగడుపు ఈ నీటిని తీసుకోకుండా ఉండటమే ఉత్తమం.

WhatsApp channel